
మాయమైన దారి
గజిబిజి ఆలోచనల నుండి దూరంగా, నన్ను నేను కొంతసేపు మరిచిపోవాలని నిర్ణయించుకున్నాను. బయట వర్షం కురిసేలా — ఆకాశం ముసురుకొని ఉంది. ప్లాస్క్‌లో కాఫీ నింపి, రైన్‌కోట్‌ని స్ట్రింగ్‌బ్యాగ్‌లో వేసుకుని బైక్ దగ్గరికి వెళ్లాను. రే-బాన్ షేడ్స్ పెట్టుకున్న తర్వాత వెలుతురు మరింత చీకటిగా అనిపించింది.
ఆ క్షణాన ఎక్కడికి వెళ్ళాలి అనేది తెలియదు. కానీ మనసు మాత్రం “కొండెక్కుదాం ” అని చెప్పింది.
బైక్ స్టార్ట్ చేసి బైపాస్ రోడ్డెక్కాను. స్పీడ్ 50 km/h మాత్రమే, కానీ నా ఆలోచనలు 100 km/h వేగంతో పరుగులు తీస్తున్నాయి.
అక్కడక్కడా జల్లులు కురవడం మొదలయ్యింది .
ముక్కొండా దగ్గరవుతున్నకొద్దీ, మనసు మారింది. ఇప్పటివరకు యాభైసార్లు ఎక్కిన కొండే. కొత్త ప్లేస్ వెదికుదామని బైక్ వేగం పెంచాను. దారిలో వీరయ్య హోటల్ కనిపించగానే మీల్స్ ప్యాక్ చేసుకుందామని ఆగాను. వీరేంద్ర అన్నను క్షేమం అడిగి, “రైస్ కొంచెం తక్కువ కట్టు, మిగిలితే వేస్ట్ అవుతుంది” అని అన్నాను.
అతను నా వైపు ఒకసారి చూసి చిరునవ్వుతో అన్నాడు, “అడవిలోకి వెళ్తున్నావ్, అన్నం మిగిలితే కోతులకి పెట్టు”. నాకు ఒకింత ఆశ్చర్యం వేసింది. నేను ఎక్కడికి వెళ్లాలో అతనికి చెప్పలేదు కదా, ఎలా తెలిసింది? ఇలా ఆలోచిస్తుండగానే ఇంకో సత్యం మెరుపులా మెరిసింది.
మనకున్నదాన్ని కాపాడుకోవడమే జీవితం అనుకున్నాను. కానీ పంచిపెట్టినపుడు ఇంకో జీవితాన్ని కూడా కాపాడొచ్చు కదా అనిపించింది.
పార్సెల్ తీసుకొని అక్కనుంచి బైల్దేరాను. యర్రబల్లె దగ్గరికి వచ్చేసరికి పొలాల్లో అరటిచెట్లు కనిపించాయి. పక్కనే ఒక పిల్లకాలువ పోతుంది. పొలానికి కావలి కూర్చున్న అతన్ని పలకరించి, “ఒక అరిటాకు తీసుకోవచ్చా?” అని అడిగాను. “తీసుకో తమ్ముడు” అని చెప్పాడు. తుంచుకుని పిల్లకాలువలో శుభ్రంగా కడిగి అతనికి థాంక్స్ చెప్పి అక్కనుంచి బైల్దేరాను.
అరిటాకు తుంచుకుంటున్నపుడు అనిపించింది —
ప్రకృతి మనం అడగకముందే ఇస్తుంది. మనిషి మాత్రం కొన్నిసార్లు అడిగినా ఇవ్వడానికి వెనుకాడతాడు. ప్రకృతిని నియంత్రిస్తున్న మనిషి గొప్పవాడా? ప్రకృతి గొప్పదా?
దారిలో కరుణగిరి బోర్డు కనపడితే బండి అటు వైపు తిప్పాను. ఇంటర్మీడియట్ రోజుల్లో వెళ్లిన జ్ఞాపకం వచ్చింది. కరుణగిరిలో చర్చి కొండ మీద ఉంటుంది. మేరిమాత తిరుణాల బాగా జరుగుతుంది. ఇప్పుడు అక్కడ స్కూల్ కూడా ఉంది.
టైం మధ్యాహ్నం రెండు అయ్యింది. ఆకలి కూడా కొరికేస్తుంది. బైక్‌ని స్కూల్ దగ్గర ఆపి, కబడ్డీ కోర్టు పక్కన శుభ్రంగా ఉన్న చోట అరటాకు పరుచుకుని భోజనం చేశాను. ఇంకా అన్నం మిగిలింది. ప్యాక్ చేసి బాగ్‌లో పెట్టుకున్నాను. కొద్దీ సేపు అక్కడే నడిచి మళ్లీ బైక్ ఎక్కాను. మిట్టమాను పల్లె నుంచి బ్రహ్మంసాగర్‌కి వెళ్లే దారి గుర్తొచ్చింది.
మిట్టమానుపల్లె దాటిన తర్వాత రోడ్ నల్లమల అడవి గుండా వెళ్తుంది. చుట్టూ కొండలు, ఎటు చూసిన పచ్చని వాతావరణం మనస్సుని ఆహ్లాదపరుస్తుంది.
వీరేంద్రన్న చెప్పినట్టే దారి మధ్యలో కోతులు కనపడ్డాయి. మిగిలి ఉన్న అన్నం వాటికి పెట్టాను. కాసేపు అక్కడే నిలబడ్డాను, అక్కడి నిశ్శబ్దం మనసులో కాస్త శాంతి నింపింది.
ఇంకా బైక్ ఎక్కడ ఆపకుండా, బ్రహ్మంసాగర్ వెళ్ళాను. గేట్ల దగ్గరి నుండి చుట్టూ చూసాను. దూరంగా ఒక వ్యూవ్‌పాయింట్‌లా కనిపించింది. దారి మాత్రం ఉన్నట్టు కనబడలేదు, చుట్టూ చెట్లు ఉన్నాయ్. సరే, చూద్దాం. పద అనుకోని వెళ్తుంటే, మధ్యలో ఒక పిల్లవాడు చేపలు పడ్తూ కనపడ్డాడు.
“వ్యూవ్‌పాయింట్‌కి దారి ఉందా, తమ్ముడు?” అని అడిగాను.
అతను దారి చూపిస్తూ అన్నాడు: “ఉందిన్నా, కాకపోతే మెటల్ రోడ్… అక్కడక్కడా ముళ్ల చెట్లు ఉంటాయి. జాగ్రత్తగా వెళ్లండి.”
అతను చెప్పినట్టే, ఆ దారంతా ముళ్ల చెట్లతో నిండి ఉంది. జాగ్రత్తగా దాటుకుని వ్యూవ్‌పాయింట్ చేరాను.
అక్కడ ప్రపంచం వేరే లాగా ఉంది.
ఒక వైపు నిశ్శబ్దంగా విస్తరించిన సాగర్. మరో వైపు మందుబాబులు, మాంసపు ముక్కలు, గ్లాసులు.
అప్పుడు ఆలోచన మొదలైంది — చుట్టు ఎంత ప్రశాంతంగా ఉన్న కొంతమంది మనుషులు చిన్న గ్లాసులోనే తమ పరవశాన్ని వెతుకుంటారు..
అక్కనుంచి ఇంకొద్దీ దూరం నడుచుకుంటూ వెళ్లి, కొండ అంచున కూచున్నాను. ఫ్లాస్క్‌లోని వేడి కాఫీ గ్లాసులో పోస్కోని తాగాను. అక్కడే ఉన్న కొన్ని గులకరాళ్లు తీసుకుని, దూరంగా చెట్టు కొమ్మ వైపు లక్ష్యంగ చేసుకొని విసరడం మొదలుపెట్టాను. పది సార్లు విసరగా, ఆరు సార్లు కొట్టాను. చిన్న విజయం అయినా పెద్ద సంతోషం ఇచ్చింది.
వచ్చిన దారిలోనే తిరుగు ప్రయాణం మొదలుపెట్టాను. మిట్టమాను పల్లె కొండల మీద సెల్ టవర్ కనపడింది. టవర్ వేశారు అంటే దారి ఉండొచ్చు అనిపించింది. “తర్వాత ఎపుడైనా తప్పక ఎక్కాలి” అనుకుంటూ ముందుకెళ్తుంటే , ఇద్దరు తాతలు రోడ్ పక్కన ఉన్న అరుగు మీద కూచొని మాట్లాడుకుంటున్నారు.
బైక్ ఆపి వారిని అడిగాను: “ఆ కనపడుతున్న కొండ ఎక్కడానికి దారి ఉందా, తాత?”
“ఓ, ఒకప్పుడుండేలే. నా సినపుడు బోధగడ్డి, పొయ్యిలోకి కట్టెలకోసం ఏళ్ళేవాళ్ళం అప్పుడున్న్యాది అనుకో. ఇప్పుడు గ్యాసు పొయిలోచినాక కట్టెలు కోసరం ఎవరు పోతాండారని ? కంప చెట్లన్నీ పెరిగి దారి మాయమైంది ” అని సమాధానం ఇచ్చాడు ఒక తాత.
దారి ఎప్పుడూ ఉంటుంది, కానీ మన అడుగులు లేకపోతే అది మాయమైపోతుంది. అడవుల్లోనైనా, మనసులోనైనా ఇదే కదా నిజం
అని నేను సమాధాన పరుచుకున్నాను.
నా సంభాషణ పొడిగిస్తూ, చుట్టుపక్కల ఇంకేమైనా కొండాలేమైనా ఉన్నాయా, ఎక్కడానికి అనువుగా అని అడిగాను.
ఇంకో తాత చెప్తూ:
“సినయ్యగారిపల్లె కానుంచి పోతే ముక్కొండ ఉంది. తాపలు ఉండాయి ఎక్కనికి. ముందరపక్క కాజీపేట కాడ రోడ్డు వారినుంచి చూస్తే నాగేసు కొండ ఉంది. ఈ పక్క ఈశ్వరి దేవి కొండ ఉంది,” అని చేతులు చూపిస్తూ చెప్పాడు.
“ఆ మూడు కొండలు ఇంతకు ముందే ఎక్కినా తాత… ముక్కొండ అయితే ఒక 50 తూర్లు ఎక్కింట. ఫై నుంచి చూస్తే బో ఉంటాదనుకో.”
“అవు, శివరాత్రినాడు అయితే కిక్కిరిస్తది కొండంత,” అనే తాత.
“కాఫీ తాగుతారా?” అని అడిగి, నా దగ్గరున్న కాఫీ వాళ్ళిద్దరికీ ఇస్తూ నేను కూడా ఇంకో కప్పు తాగాను.
“అవు తాత, పెద్ద జంతువులు ఏమైనా ఉంటాయా ఆ కొండమీద?” అని అడిగిన.
“యేయి, నక్కలా? నేను ఎనుములు తొలకపోయేప్పుడు ఓ తూరి సూసినా. ఇంతెత్హు ఉంది దానెక్క. సూస్తే ఒక్కెటు తోనే సంపుతాది అట్టుంది. నేను గబిక్కిన చెట్టెక్కి కూచ్చున్యా . కడుపు నిండి ఉన్యాదేమో, దానఁదారధీ పాయె,” అన్నాడు.
(నాకు కొండపోలం నవల గుర్తొచ్చింది. తాత పెద్దపులి గురించి చెప్తాన్నాడని అర్థమైంది)
“ఐన పైన, ఏమి ఉండవు. ఉంటె గింటే కిందనే నీళ్ల సాట్ల తిరుగుతంటాయి.”
“అవును, మా వాడు మొన్న చెప్తా ఉంటె ఇన్యా, జాండ్లవరం కోనేర్ల కాడా ఎలుగుబంటి కనపడిందని ,” అని చెప్పిన.
“ఎలుంగొడ్లు దండిగా ఉండాయి, ఐన రోషి కుక్కలు రానీయవు దాన్లను ఊర్లోకి ”
ఇద్దరు చాలాసేపు వాళ్ళ తెలిసిన విషయాలు, అనుభవాలు చెప్పారు.
సూర్యుడు అస్తమించే సమయానికి ఇంకా కూచుంటే లేట్ అవుతుంది అని చెప్పి, అక్కనుంచి బైల్దేరి వస్తుంటే, మధ్యలో ఒక పెద్దమనిషి చేయి అడ్డం పెట్టినాడు, “ఆపు” అని.
“రొంత దూరం వదిలిపెట్టుబ్బా?” అని అడిగితే, ఎక్కించుకొని వస్తున్నాను.
నేను అడగకుండానే దారంబడి చెప్తున్నాడు: ఎక్కడికి వెళ్ళింది, ఏమి పని మీద పోయింది, 10 ఎకరాలుంది అంట భూమి, మఠం కాడ గుత్తకి తీసుకున్నది — అన్ని చెప్పాడు.
జీవి సత్రం రాగానే, ఆపి, “ఈనుంచి పోతలేబ్బా” అని దిగి, “ఇంటికాడికి రా, మజ్జిగ తాగిపోదువు” అనే.
“లేదులే పెద్దాయన, శాందూరం పోవాలా” అని చెప్పి, బండి స్టార్ట్ చేసి హైవే ఎక్కాను.
మైదుకూరు బైపాస్ దాటి రాగానే, దూరంగా థర్మల్ పవర్ ప్లాంట్ కనపడింది. దాని పొగలు గాల్లోకి ఎగురుతున్నాయి. అవి అల్లాఉద్దీన్ దీపం నుండి బైటికి వస్తున్నా జీని లాగా ఆకాశంలో తేలుతున్నాయి.
ఒక్క క్షణం ఆలోచించాను —
ప్రకృతి ఇచ్చే గాలి, నీళ్లు, పచ్చదనం అంతా మనసుకి ప్రశాంతతను ఇస్తాయి. కానీ మనిషి సృష్టించే పొగ మాత్రం ఆకాశాన్నే ముసురేస్తుంది.మనసు కూడా అలానే కదా — ఆలోచనలు గజిబిజిగా పొగలా కమ్ముకున్నా, లోపల ఆకాశం మాత్రం ఎప్పటికీ నిర్మలంగానే ఉంటుంది.
గజిబిజి ఆలోచనల నుండి తప్పించుకోవడానికి బయల్దేరిన ఈ ప్రయాణం, కొత్త ఆలోచనలతో ముగిసింది.కొండలు, పొలాలు, పిల్లకాలువలు, అపరిచితుల మాటలు… అన్నీ కలసి, ఒక కథలా అనిపించాయి. కొన్నిసార్లు అనుకోని ప్రయాణం ఒక కొత్త కథను చెబుతుంది.