
చీమల్ని ఎంచిన యువకుడు
వర్షం పడేలా ఉంది.
కానీ ఇంత ఎండాకాలం లో ఎక్కడ వర్షం పడుతుందిలే అని అనుకుంటూ, పాలకేంద్రం కాడ ఉన్న మున్సిపాలిటీ పార్క్‌కి కాసేపు వాకింగ్ చేద్దాం అని బయలుదేరాను.
సూర్యుడు వర్షపు ట్రాఫిక్‌లో చిక్కుకోకముందే పారిపోవాలన్న తపనతో, పార్కులోని ఈత చెట్ల వెనుక నుంచి మెల్లగా దిగిపోతున్నాడు. పక్కనే ఉన్న అయ్యప్ప స్వామి గుడిలో లయబద్ధంగా గంటలు మోగుతున్నాయి. పార్క్ వెనుకవైపు బంతి, మల్లెపూల తోటల నుంచి వచ్చే తడి వాసన గాలిలో కలసిపోయి, మల్లె పరిమళం నా ముక్కును తాకింది.
మూడుసార్లు పార్క్ మొత్తం చుట్టూ తిరిగి, చివరికి క్రోటన్ చెట్టు పక్కన ఉన్న చెక్క బెంచ్‌పై కూర్చున్నాను. పక్కనే ఓ పెద్దాయన — వయసు 60 ఏళ్లు పైగా ఉంటుందేమో — బులుగు గళ్ల చొక్కా, నల్ల కాటన్ ప్యాంట్, ప్యారగాన్ చెప్పులు వేసుకుని, తల వంచి నేలవైపు చూస్తూ కూర్చొని ఉన్నాడు. వాకింగ్ చేస్తున్నప్పుడు కూడా గమనించాను — చాలా సేపటి నుంచే అలాగే ఉన్నాడు. ముఖంలో ఏదో తెలీని బాధ, ఆయన చేతులు మోకాళ్ళ మీద ఉన్నాయి, మనసంతా శూన్యంగా ఉన్నట్టు కనిపించాడు.
ఐదునిమిషాల తర్వాత, ఆ నిశ్శబ్దాన్ని కొద్దిగా చెడగొడదామని ...
"ఏం సార్... ఇప్పటిదాకా ఎన్ని చీమల్ని ఎంచినారు?"
ఆయన కళ్ళు పెద్దవయ్యాయి. తనతోనే మాట్లాడుతున్నానా అన్నట్టు ఆశ్చర్యంగా నా వైపు చూసాడు. అవకాశం కోల్పోకుండా మళ్లీ చిన్న నవ్వుతో అన్నాను:
"అంటే, అంతసేపు చీమల్ని చూస్తుంటే... లెక్కపెడుతున్నారేమో అనిపించింది. నేను... ఓ నలభై దాకా ఎంచి ఉంటా... చానా కష్టం అనిపించింది... అవి అన్నీ ఒకే రకంగా, ఒకే కలర్ లో ఉండాయి... ఆ చైనా వాళ్ల ముక్కు మొహాల మాదిరి...
ఆయన ముఖంలో చిన్న నవ్వు...
(అపరిచితులతో నేను బాగా మాటలు కలుపుతాను. అదేంటో తెలీదు కానీ, ఎవరైనా చాల ఈజీగ నాతో వాళ్ళ బాధలు పంచుకుంటారు. నాకు అన్ని మా నాయనా పోలికలే వచ్చినాయని చెప్పేది మా జేజి... మా నాయనా కూడా అంతే అంట, తీరిక దొరికినప్పుడల్లా మా ఇంటి పక్కన ఉన్న చబుతర మీద కూచొని, వీధిలో వచ్చే పోయే వాళ్ళని పలకరిస్తా ఉండేవాడట. మా అమ్మ చెప్పేది బాధల్లో ఉన్నపుడు కొంత మంది అదే పనిగా వచ్చి ఆయన తో మాట్లాడిపోతే స్వాంతంగా ఉంటాది అని. నాయన చనిపోయినపుడు చూడటానికి ఎంతమంది జనాలొచ్చారో ఇంకా గుర్తు ఉంది నాకు. ఆ నలుగురు సినిమాలో రాజేంద్రప్రసాద్ చనిపోయినపుడు వచ్చినారు కదా అంత మంది వచ్చింటారు. నాయనని డిగ్రీ లేని సైకాలజిస్ట్ అంటుంది అమ్మ.)
"లెక్క పెట్టలేనన్ని ఉన్నాయి," అన్నాడు. ఆయన ఖంఠం చాల గంభీరంగా ఉంది,కానీ అందులో ఒక విధమైన అలసట కూడా వినిపించింది.
"టీ కాఫీ ఏమైనా తాగుతారా?" ఇక్కడ కాఫీ చాలా బాగుంటుంది, రాము బాగా చేస్తాడు... అదే తెస్తాను, అంటూ ఆయన సమాధానం కోసం ఎదురు చూడకుండానే లేచి నిలబడ్డాను. అడగటం మరిచిపోయాను, మీకు షుగర్ ఉందా? మొన్న ఒకరోజు ఇలాగే ఒక తెలిసినాయన కనపడితే మాట్లాడుతా మాట్లాడుతా చెరుకు రసం తాగినాము ... ఆయప్పకి షుగర్ ఉంది అంట... ఇంటికి పోయే లోపు కళ్ళు తిరిగి పడిపోయినాడు. మీకుగన అట్నే ఉంటె ముందే చెప్పండి... మల్ల ఆ పిల్ల నాయాలు కాపీ ఇప్పించాడు, ఇట్ట అయింది అని చెప్పకూడదు" అని అన్నాను.
"నా ఒంట్లో తప్ప జీవితం లో షుగర్ యాడ లేదు బాబు.. అడిగినందుకు చాల సంతోషం, కానీ నాకు కాఫీ గీపీ ఏమి వద్దు. నువ్వు కూచో” అన్నాడు.
“మీకు వద్దనుకుంటే మన్లే నేను తెచ్చుకుంటాను..” అని చెప్పి, 2 బ్లాక్ కాఫీ, బొరుగుల మిక్చర్ తీసుకొని వచ్చి బెంచి మీద కూచున్నాను.
ఆయన నా వైపు వింతగా చూసాడు, "వద్దు" అన్న కూడా మళ్ళీ తెచ్చాడు. "ఏంటి?" అన్నట్టు. "తాగండి సర్, బ్లాక్ కాఫీ లివర్ కి మంచిది.. బాడీ డిటాక్స్ చేస్తది" అని చెప్తూ, బొరుగుల మిక్చర్ కూడా తినండి, నెయ్యి అది బాగా వేసి చేస్తాడు ఇక్కడ" అని చెప్పి ఆపేసాను.
ఏమనుకున్నాడో .. కాఫీ రెండు సార్లు సిప్ చేసి నా వైపు చూసాడు. ఏదో చెప్పాలని ఉంది ఆయనకీ కానీ చెప్పలేకపోతున్నాడు అనిపించింది.
"ఏమి చేస్తుంటారు సార్ మీరు? ఎపుడు ఇక్కడ చూడలేదు మిమ్మల్ని?" అని అడిగాను.
ఒక దీర్ఘ శ్వాస తీసుకొని, ఆయన చెప్పడం మొదలు పెట్టారు. "నా పేరు గోపాలరెడ్డి, నేను 'వార్త కడప' లో 40 ఏళ్లుగా జర్నలిస్ట్గ పనిచేసి రిటైర్ అయ్యాను బాబు. కథలు, కవితల నుండి క్రైమ్ స్టోరీస్ వరకు అన్ని రాసేవాణ్ణి, ఎంతో మంది దీనార్థుల జీవనాన్ని చాల దగ్గరగా చూసినవాణ్ణి. ఇపుడునా జీవితం ఒక కథ లాగ మారిపోయింది. నా లక్ష్మి, నా భార్య, కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో ఉండేది . అయిన ఆమెకి అన్నీ గుర్తుండేవి. ఏ మందు తీసుకోవాలి, ఏ గుడికి ఎపుడు వెళ్ళాలి, మా ఇరుగు పొరుగు వాళ్ళ పిల్లల పేర్లు, ఇలా అన్నీ. ఆమె నా జ్ఞాపకం. మూడు నెలల క్రితం చనిపోయింది. వెళ్తూ వెళ్తూ నా జ్ఞాపకాలని కూడా తీసుకొని వెళ్ళిపోయింది. ఇంక ఇప్పుడు... అరిగిపోయిన టేప్ రికార్డర్ పాట మర్చినట్టు చాల విషయాలను నేను ఇప్పుడు మరిచిపోతున్నాను. కొడుకు, కోడలు, మనవడు, మనవరాళ్లు ఉన్న అనాధగా మారిపోయాను. ఖాళీగా ఉన్నాను కదా ఎదో ఒక పని చెప్తుంది నా కోడలు, నాకు గుర్తు ఉండటం లేదు. వచ్చేటప్పుడు ఎదో చెప్పింది, సగం దూరం వచ్చేలోపు మరిచిపోయాను. ఇంటికి వెళ్ళ్తే రంకెలేస్తది, అందుకే ఇక్కడికి వచ్చి కూచున్నాను," అంటూ సిగ్గుతో తల దించుకొని చూస్తున్నాడు.
“ఆమె అరుస్తుంది అని కాదు కానీ, ఆ తర్వాత వచ్చే నిశ్శబ్దం భరించలేక పోతున్నా.” ఆయన గొంతులో ఏదో అడ్డుపడినట్టు భాద వినపడింది. అకస్మాత్తుగా, గాలి కొంచెం చల్లగా అనిపించింది.
నేను వెంటనే మాట్లాడలేదు. ఆయన ఇంకొక దీర్ఘ శ్వాస తీసుకున్నాడు.
తర్వాత, మెల్లగా, నేను, "మీకు తెలుసా... కొన్నిసార్లు మర్చిపోవడం శాపం కాదు సార్. అది ఒక వరం కూడా కావచ్చు," అన్నాను.
అతను అయోమయంగా నా వైపు చూశాడు.
నేను నవ్వాను. "మనం కొన్ని విషయాలను మరచిపోగలిగితేనే, బాగా నిద్రపోగలం సర్.
పాత జ్ఞాపకాలను మరిచిపోతేనే కదా కొత్త వాటికీ దారి ఇవ్వగలం. మీకు చెప్పేటంత పెద్దవాణ్ణి కాదు కానీ... నా లైఫ్ లో జరిగిన కొన్ని విషయాలను చెప్తాను, వినండి," అంటూ నా కథ చెప్పడం మొదలు పెట్టాను.
“మా నాన్న నేను 3 క్లాస్ లో ఉన్నపుడు చనిపోయారు. నాన్న ఉన్నపుడు మాతో కలిసి భోజనం చేసే వాళ్ళే, దురాశతో నాన్న చనిపోయాక చాలా ఇబ్బందులు పెట్టారు. మేము ఏ స్టేజీ కి వెళ్ళామంటే , అన్నం లో కలుపు కోవడానికి కూర లేక నీళ్లు కలుపుకొని తిన్న రోజులున్నాయి. వానలు పడినపుడు చూరు వెలిసి నీళ్లు పడ్తుంటే, గిన్నెలు పట్టుకొని రాత్రంతా నిలబడిన రోజులు ఎన్నో ఉన్నాయ్. అప్పటిదాకా ఎపుడు ఇంటికి వచ్చేవాళ్ళు సడన్ గా రావడం మానేశారు.. కొంత మంది అయితే మా పేర్లు కూడా మరిచిపోయారు.
కానీ కాలం తన పని తాను చేసుకుపోతుంది.. మేము వారి గురించి మాట్లాడటం మానేశాము, వాటి గురించి ఆలోచించడం మానేశాము.. మెల్లగా మర్చిపోయాం. మా జీవితాల్లో బాధ లేకుండా పోయింది.. వర్తమానం లో బ్రతుకుతూ భవిషత్తు గురించి మాత్రమే ఆలోచించేవాళ్ళం. మా అమ్మను ఆడామె అయినా పిల్లల్ని చాల బాగా పెంచి మంచి దారిలో పెట్టింది అనుకుంటున్నారు ఇపుడు అందరు. మా అమ్మ మంచితనమూ, దేవుడి దయవలన ఇపుడు బాగానే ఉన్నామనిపిస్తుంది. మా పేర్లు మరిచిపోయిన వాళ్ళు మమ్మల్ని వెతుకుంటూ వస్తున్నారు.
ఆ పెద్దాయన నా మాటలను గ్రహించడం చూస్తూ నేను ఆగిపోయాను.
జ్ఞాపకాలు, నేను కొనసాగించాను, కొన్ని సంతషకరమైనవి ఉంటాయి, కొన్ని బాధాకరమైనవి ఉంటాయి కానీ అవి ఎప్పుడు మనల్ని వెనక్కి లాగుతూనే ఉంటాయి. "మరిచిపోవడం అనేది అంత సౌకర్యవంతంగా ఉండకపోవచ్చు. కానీ బహుశా, అది మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మనస్సు ఉపయోగించే మార్గం కావచ్చు. మీ భార్యను కోల్పోయిన బాధ నుండి. ఇంట్లోని బాధాకరమైన మాటల నుండి. ఎల్లప్పుడూ ప్రతిదీ గుర్తుంచుకునే భారం నుండి.
బాధ కలిగించే గుర్తులు మనలో నిత్యం పునరావృతం అవుతుంటే మనం ముందుకెళ్లలేం. అవి మనల్ని బరువెక్కిస్తాయి. కానీ మనసు మర్చిపోతే, మనం కొంత తేలికగా ముందుకు నడవగలం.
మొన్న నా మేనకోడల్ని పార్కుకి తీసుకొచ్చాను. ఆరేళ్ల పిల్ల. రెండు జడలు, చేతిలో బొమ్మతో. పార్క్‌లో తిరుగుతూ తడబడి కింద పడిపోయింది. ఆమెకు ఇష్టమైన ఐస్క్రీమ్ నేలమీద పడింది. ఏడ్చింది.
కానీ కొన్ని నిమిషాల్లోనే పక్కనే ఉన్న పిల్లలతో ఆడుతోంది. నవ్వుతోంది.
“ఇంత త్వరగా మర్చిపోయిందా?” అనిపించింది నాకు.
“పిల్లలు అలానే ఉంటారు. మర్చిపోతారు. అందుకే వాళ్లు ఆనందంగా ఉంటారు,” అన్నాను.
అతను నిశ్శబ్దంగా ఉన్నాడు. అంతోలోనే, అతను నవ్వాడు - సమీపంలో ఉన్న ఉడుత ఆశ్చర్యంగా మా వైపే చూస్తుంది.
"నువ్వు కవిలా మాట్లాడుతున్నావు," అన్నాడు. "కానీ నువ్వు చెప్పేది కరెక్టే అవ్వచ్చు. బహుశా మర్చిపోవడం కూడా చెడ్డది కాకపోవచ్చు." అన్నాడు.
అతను మళ్ళీ చీమల వైపు చూస్తూ, "నీకు తెలుసా... నేను ఇలాంటి చిన్న విషయాల, పరిశీలనలు, రూపకాలు, భావోద్వేగాలు గురించి రాసేవాడిని. లక్ష్మి వెళ్ళినప్పటి నుండి ఒక్క లైన్ కూడా రాయలేదు.
"మళ్ళీ మొదలుపెట్టండి," అన్నాను. "ఈ రోజు గురించి రాయండి. చీమల గురించి. చెక్క బెంచ్ మీద మిమ్మల్ని ఒక వెర్రి ప్రశ్న అడిగిన వింత యువకుడి గురించి."
అతను నవ్వాడు. "బహుశా రాస్తానేమో లేదా మరిచిపోతానేమో.”
ఆకాశం నారింజ రంగు నుండి నీలిమందు రంగులోకి మారుతుండగా, మేము పార్కు గేట్ వరకు నడిచాము. అక్కడ ఆయన కోడలు ఏమి అడిగిందో గుర్తు తెచ్చుకోడానికి నేను సహాయం చేసాను. అది పసుపు."
"నేను దానిని అతని కోసం కొన్నాను కూడా.
ఆయన థాంక్స్ చెప్తూ చిన్న పసుపు ప్యాకెట్‌ను బంగారంలాగా తీసుకున్నాడు.
మేము ఫోన్ నంబర్లు మార్చుకోలేదు. మేము మళ్ళీ కలుస్తామని మాట ఇవ్వలేదు. కానీ ఆ ఒక సాయంత్రం, క్షీణిస్తున్న సూర్యకాంతి మరియు చీమల కవాతు మధ్య, ఇద్దరు అపరిచితులు ఒక ఆశర్యమైన సంబంధాన్ని కనుగొన్నాం – జ్ఞాపకాలతో కాదు, అర్థం చేసుకోవడంలో ఉన్న సౌకర్యంతో.
ఇంటికి తిరిగి వెళ్తున్నపుడు అయన ఇలా అన్నారు "నువ్వు నన్ను కాఫీకి ఆహ్వానించిన తీరు... ఆ మాటలు..." అంటూ గోపాలరెడ్డి గారు ఆగిపోయారు." ఆయన గొంతు కొంచెం భావోద్వేగం తో నిండి ఉంది.
"చెప్పండి సార్?" అన్నాను నేను నవ్వుతూ.
"ఏమిటంటే... ఇవాళ నేను ఇంట్లో ఉన్నప్పుడు నాతో ఎవరూ మాట్లాడరని అనుకున్నాను . ఏమీ మాట్లాడాలనిపించలేదు కూడా. కానీ ఇప్పుడు... మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెప్పాలనిపిస్తుంది."
ఆయన మాటల్లో నిజమైన కృతజ్ఞత, ఓ విచిత్రమైన స్వాంతన కలగబెట్టే వెచ్చదనం నిండిపోయింది.
“మన మధ్య ఉన్న బంధం పేరులేని, సంతకంలేని పత్రంలా ఉంది — దానికో పక్కా నిబంధన ఏమీ లేదు, కానీ దాని విలువ గొప్పది” అంటూ వెళ్లిపోయారు
మూడు వారాల తర్వాత:
అదే పార్క్. అదే చెక్క బెంచ్. కానీ ఆ రోజు ఆయన కనిపించలేదు. బెంచ్ మీద ఓ పాత పత్రిక పడివుంది. తీసుకుని చూశాను.
మొదటి పేజీపై శీర్షిక:
“చీమల్ని ఎంచిన యువకుడు ” – రచయిత: గోపాల్
అందులో నా కథే ఉంది. ప్రతి మాట, ప్రతి భావన, ప్రతి సంభాషణ.
కానీ చివర్లో ముద్రించిన తేదీ – ఆరు సంవత్సరాల క్రితం.
ఆ కథ చివరి వాక్యం ఇలా ముగుస్తుంది:
"జ్ఞాపకాలు కొంతమంది కోసం ఉంటాయి. మరచిపోవడం కొంతమందికి దీవెన. కానీ లూప్‌లో బ్రతుకుతున్నవారికి అది శాపం.
నా హృదయం గాభరాపడుతుంది .
ఏమిటిది? నిజంగా ఇది జరిగిందా లేదా ??
నేనే ఓ కథలో బ్రతుకుతున్నానేమో అనిపిస్తోంది…