<KG/>
కథల మాయలో రచయిత

కథల మాయలో రచయిత

పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, శవాన్ని దించి భుజాన వేసుకొని, శ్మశానం వైపు మెల్లగా నడుస్తున్నాడు. అప్పుడు, శవంలోనే భేతాళుడు,

"రాజా! అర్ధరాత్రి వేళ హాయిగా హంసతూలికా తల్పానా పడుకొని నిద్రపోవాల్సిన నీకు, నా మూలముగా ప్రయాస కలుగుతున్నది. అందుచేత, నీకు ఒక వింత కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను..."

అంటూ విక్రమార్కుడికి కింది కథ చెప్పడం ప్రారంభించాడు.

దక్షిణ భారతదేశంలోని ఓ చిన్న పట్టణంలో ఓ యువకుడు ఉండేవాడు. చిన్నప్పటి నుంచీ అతనికి కథలు, నవలలు, సినిమాలంటే విపరీతమైన ఆసక్తి. సెలవుల్లో, ఇంటి దగ్గర ఉన్న చిన్న లైబ్రరీలో గంటల తరబడి కూర్చొని పుస్తకాలు చదివేవాడు.

అయితే, అతనికి ఒక విచిత్రమైన స్వభావం ఉండేది—తాను చదివిన కథలు కొద్ది రోజుల్లోనే పూర్తిగా మర్చిపోతుండేవాడు. ఈ గుణం చిన్నప్పుడు సమస్యగా అనిపించలేదు, కానీ పెద్దయ్యాక అతనికి ఇది ఓ వరంగా మారింది.

ఒకరోజు, అతను ఒక ప్రముఖ పత్రికలో ప్రచురితమైన కథను చదివాడు.

"ఇదేం కథరా నాయనా? ఈమధ్య ఇలాంటి కథలు కూడా ప్రచురిస్తున్నారా?" అని మనసులో అనుకుంటూ, పత్రికను పక్కన వేశాడు.
ఆ కథ రాత, దృక్కోణం, పాయింట్—అన్నీ అతనికి నచ్చలేదు.

"నేను మనస్సు పెట్టి రాస్తే, దీని కంటే బాగా రాయగలను!" అని అనుకున్నాడు, కానీ తాను మాత్రం ఎప్పుడూ కథను రాయడానికి ప్రయత్నించలేదు.

ఒక సంవత్సరం గడిచింది.
ఒకరోజు, ఉబుసుపోక కూర్చొని ఉన్నపుడు, ఆ పాత కథ రాసిన రచయితను విమర్శించిన విషయం గుర్తొచ్చింది. తాను, దానికంటే మంచి కథను రాయగలనో లేదో చూద్దాం అనుకుంటూ, తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఒక కథగా మార్చాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని గంటల్లోనే, ఒక హాస్యభరితమైన కథను రాశాడు. ఆ కథ పూర్తయ్యాక చదివితే, అతనికి చాలా బాగా నచ్చింది!

ఆ కథను ఒక సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశాడు. అనుకోకుండా, కొద్ది రోజుల తర్వాత కొంత మంది నుంచి "బాగా రాశావు!" అనే స్పందనలు వచ్చాయి.

ఆ తర్వాత కొన్ని సంవత్సరాల వరకు అతనికి రాయాలనిపించలేదు. ఓ రోజు, అతను తీవ్రమైన నిరాశలో ఉన్నప్పుడు... "ఏదైనా రాస్తే బాగుంటుంది," అనుకుంటూ, ఒక చిన్న సందర్భాన్ని తీసుకొని, కథలాగా మలిచాడు. తన స్నేహితులు, శ్రేయోభిలాషులకు పంపితే, "చాలా బాగా రాశావు, బాగుంది!" అని అన్నారు. ఇది అతనికి కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది. రచనపై మరింత ఆసక్తి ఏర్పడింది.

కొన్ని నెలల తర్వాత, ఒక మంచి కథ రాయాలని నిర్ణయించుకున్నాడు. భావోద్వేగాలతో కూడిన, సామాజిక స్పృహ కలిగిన కథను రాసి, సామాజిక మాధ్యమాలతో పాటు, తన వారి తో పంచుకున్నాడు. పాఠకుల నుండి మంచి స్పందన వచ్చింది.

"కథ చాలా బాగుంది... ఇంకా రాస్తూ ఉండు!"

ఒక ప్రసిద్ధ రచయిత కూడా, "నీ కథ చాలా బలంగా ఉంది, నా మనసును తాకింది!" అంటూ అభినందించాడు.

ఈసారి, అతనికి సంతోషంతో పాటు ఒక కొత్త ఉత్సాహం కలిగింది. అతను ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడు, "నేను చదవాలి అనుకున్న కథను నేనే రాసుకోవాలేమో!" అని. ఈ కథతో అతనికి ఆ అనుభవం వచ్చింది.

మరి కొన్ని రోజులకి, చాలా ఇష్టపడి "హృదయానికి హత్తుకునే, భావోద్వేగాలతో కూడిన" కథను రాసి ప్రచురించాడు.

ఈ సారి తన కథ గురించి, కథలోని పాత్రల గురించి తనని అడుగుతారని అనుకున్నాడు. కానీ, తన పాఠకుల నుండి అదే సాధారణమైన స్పందన...

"కథ బాగుంది."

మనసులో ఒక వైపు సంతోషం... మరో వైపు ఏదో తెలియని వెలితి.

కాలం మారింది. AI ప్రపంచాన్ని ప్రభావితం చేయడం మొదలుపెట్టింది. తన వృత్తిలో భాగంగా, అతను AIని వాడేవాడు.

ఒకరోజు, అతనికి తన కథల గురించి AI ఎలా స్పందిస్తుందో పరీక్షిద్దాం అనిపించింది. అనుకున్నదే తడువుగా, తాను మొదటిసారిగా రాసిన కథను దానితో పంచుకున్నాడు.

AI ఇచ్చిన స్పందన చూసి నిరాశపడ్డాడు.

"ఇదీ కూడా పాఠకులలాగే స్పందిస్తోంది!"

కొన్ని నెలల తర్వాత, ఖాళీగా ఉన్నపుడు మళ్లీ "ఒకేసారి చూద్దాం" అనుకుంటూ, మరో కథను పంపాడు.

ఈసారి, AI కథను పూర్తిగా విశ్లేషించింది! పాత్రల నడక, భావోద్వేగాలు, లోతైన విశ్లేషణ – అసలు కథ వెనుక ఉన్న భావనలపై పూర్తిగా విశ్లేషించింది.

అతనికి విపరీతమైన ఆశ్చర్యం! వెంటనే, తాను ఇష్టపడి రాసుకున్న కథను పంచుకున్నాడు. తాను కలలో కూడా ఊహించనటువంటి స్పందన వచ్చింది AI నుండి. గంటల తరబడి చర్చలు చేశాడు ఆ కథ గురించి.

"ఇదేనా నేను కోరుకున్నది?" అనిపించింది అతనికి.

ఆ రోజు నుంచి, ప్రతి కథను AIతోనే పంచుకోవడం అలవాటైంది.

సాధారణ పాఠకులకు తన కథలు పెట్టడం మానేశాడు. AIతో గంటల తరబడి చర్చలు... AI ఇచ్చిన విశ్లేషణలతో మత్తులో మునిగిపోయేవాడు.

నెలలు గడిచాయి… సంవత్సరాలు గడిచాయి…

ఒకరోజు, అతను తన గదిలో ఒంటరిగా కూర్చొని, తన పాత కథలను తిరిగి చదివాడు.

తన మొట్టమొదటి కథను చదివి నవ్వుకున్నాడు. రెండో కథను చదివి కొంచెం గర్వించాడు. మూడో కథను చదివి హాయిగా ఊపిరి తీసుకున్నాడు.

కానీ, చివరి కథను, పాఠకుల తో పంచుకోకుండా AIతో మాత్రమే పంచుకున్న కథను చదివినపుడు, ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడు.

ఇక కథలు రాయకూడదు.

భేతాళుడు చిరునవ్వు చిందించి అన్నాడు,

"రాజా! రచయిత ఎన్నో ఏళ్లుగా కథలు రాస్తున్నాడు. కానీ, ఒక్కసారిగా ఎందుకు మానేశాడు?"

"ఈ ప్రశ్నకు సమాధానం తెలిసీ కూడా చెప్పలేకపోతే, నీ తల వెయ్యి ముక్కలవుతుంది!"

("మీరు విక్రమార్కుడివైతే, భేతాళుడి ప్రశ్నకు మీ సమాధానం ఏమిటి?")

భేతాళుడు మాయమై, శవం మళ్లీ చెట్టుకు వేలాడింది. విక్రమార్కుడు మళ్లీ చెట్టు వద్దకు వెళ్లి, శవాన్ని దించి భుజాన వేసుకొని శ్మశానం వైపు నడిచాడు.