
గోపురం మీద ఏనుగు
నల్లమల్ల అడవి—ప్రకృతి అందాలతో నిండిన అద్భుతమైన ప్రదేశం. ఆకాశాన్ని తాకే కొండలు, పురాతన గుహలు, సంగీతంలా ప్రవహించే నదులు—ఇవన్నీ కలిసిన దివ్యప్రదేశం.
ఇక్కడ అడుగుపెట్టినవాళ్లకు ఈ అడవి ఓ మాయగా, ఓ స్వప్నంలా అనిపిస్తుంది.
కొన్ని వందల సంవత్సరాల క్రితం…
విక్రాంత మహారాజు తన సైనికులతో వేటకు బయల్దేరాడు. నల్లమల్ల అడవిలో అడుగుపెట్టి, అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ తనకు తెలీకుండానే చాలా లోపలికి వెళ్లిపోతాడు.
ఆ సమయంలో, అతనికి ఒక అద్భుతమైన ప్రదేశం కనబడింది.
చుట్టూ ఎత్తైన కొండలు, సువాసనభరితమైన చెట్లు, పొదల మధ్య చిన్న నది, ఆహ్లాదకరమైన గాలి—ఆ ప్రదేశం తపస్సు చేసే పవిత్ర స్థలంలా అనిపించింది.
వేట ముగిసిన తర్వాత విశ్రాంతి తీసుకోవడం కోసం అతని పరివారం అక్కడి పరిసరాల్ని చూస్తున్నప్పుడు కొద్దిదూరంలో ఒక చిన్న గ్రామం కనిపించింది. ఆ గ్రామం పేరు జాండ్లవరం.
అక్కడి జనజీవనాన్ని పరిశీలించిన మహారాజు ఒక విషయం గమనించాడు.
"ఇంత పవిత్రమైన ప్రదేశంలో ఒక్క ఆలయం కూడా లేదు!"
వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది.
"ఈ ప్రదేశంలో ఒక శివాలయాన్ని నిర్మించాలి!"
ఆలయం నిర్మాణం పూర్తయ్యేంతవరకు, అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు.
కొన్ని నెలల తర్వాత…
ఆలయం నిర్మాణం చివరి దశకు చేరుకుంది. మహారాజు ఆనందంగా ఉన్నాడు. రేపు ప్రతిష్ఠా కార్యక్రమం!
అదే రాత్రి అతనికి భయంకరమైన కల వచ్చింది.
చీకటితో నిండిన ఒక గుహ… ఆ గుహలో ఒక యోగి కనిపించాడు. అతని కళ్లలో అగ్ని, శరీరమంతా బూడిదతో కప్పబడి ఉంది.
అతను ఒక ఏనుగు మీద నిలబడి రాజును కోపంగా చూస్తున్నాడు.
రాజు భయంతో మెలుకువలోకి వచ్చాడు.
కల ప్రభావం గురించి పండితులను అడిగినప్పుడు, దాని గురించి పట్టించుకోవద్దు అంటారు వారు .
ఆలయ ప్రతిష్ఠా రోజు…
వేద మంత్రాలతో పూజారులు శివలింగాన్ని ప్రతిష్ఠించేందుకు సిద్ధమయ్యారు.
కానీ… అదే సమయంలో…
ఒక పెద్ద పిడుగు నేరుగా ఆలయ గోపురాన్ని తాకింది!
ఆ విపరీతమైన మెరుపు వెలుతురులో, పూజారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
అంతేకాదు…
శివలింగం గుడి వెలుపల ఒరిగిపోయింది!
ఈ దృశ్యం చూసిన ప్రజలు భయంతో—
"దేవుడు ఇక్కడ ఉండాలని అనుకోలేదు!"
"ఇది శాపగ్రస్త ఆలయం !"
అలా అనుకుంటూ, ప్రజలు, సైనికులు, అందరూ ఆలయాన్ని విడిచిపెట్టారు.
ఆ రోజునుంచి… ఆ ఆలయం శూన్యంగా మారిపోయింది.
కాలక్రమంలో, పిడుగు తాకిన ఆలయ గోపురంపై ఒక ఆకారం ఏర్పడింది.
దూరం నుంచి చూస్తే, అది ఒక ఏనుగు ఆకారంలా కనిపించేది!
1990
జాండ్లవరం లో అంతు తెలియకుండా జనాలు చనిపోతున్నారని జిల్లా కలెక్టర్‌కు ఒక టెలిగ్రామ్ వస్తుంది.
ఆ టెలిగ్రామ్ మీద ఎటువంటి చిరునామా లేకుండా, కేవలం ఒక సందేశం మాత్రమే ఉంటుంది.
కొన్ని రోజులకి, మరొక టెలిగ్రామ్ వస్తుంది…
"ఈ రోజు - 3"
కలెక్టర్కి అనుమానం పెరుగుతుంది.
"ఇదేంటి? అసలు ఏం జరుగుతోంది? జాండ్లవరం ఏంటి?"
మిస్టరీ తెలుసుకోవాలని తన స్నేహితుడు డాక్టర్ విక్రం, ఇన్‌స్పెక్టర్ హరి లను జాండ్లవరం కు పంపిస్తాడు.
ఇన్‌స్పెక్టర్ హరి తన జీప్ నడుపుతూ, డాక్టర్ విక్రం తో కలిసి జాండ్లవరం బయలుదేరుతారు.
ఉరుకులు పరుగులు పెడుతూ ఎండ మాయమవుతోంది… మబ్బులు ఆకాశాన్ని కప్పేస్తున్నాయి… గాలి అశాంతిగా వీస్తూ, చెట్లను ఊపేస్తోంది…
ఎక్కడికక్కడ భయం… చుట్టూ మౌనం…
ఊరికి సమీపిస్తున్న కొద్దీ, ఇద్దరికీ వింత అనుభూతి కలుగుతోంది.
"ఇదెంత నిశ్శబ్దంగా ఉంది! అసలు ఊర్లో మనుషులు ఉన్నారా?" అని హరి అనుమానం వ్యక్తం చేశాడు.
విక్రం కారు కిటికీ నుండి చూస్తూ, గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు.
జీప్ ఊరి చివర్లో ఆగింది. అప్పటికి రాత్రి అయ్యింది.
పచ్చని పొలాలు, మట్టి ఇళ్లు, ఓ చిన్న చెరువు… ఇవన్నీ దూరం నుంచి చూస్తే సాధారణంగానే ఉన్నాయి.
కానీ…
అది సాధారణ గ్రామం కాదు…!
అక్కడ మనుషుల కదలికలు లేవు!
బయట ఎవరూ కనిపించడం లేదు.
ఇళ్లన్నీ మూసివేసిన తలుపులతో ఉన్నాయి... చాలా ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి.
"ఇక్కడెవరైనా ఉన్నారా?" అని హరి గట్టిగా అరిచాడు.
సమాధానం లేదు. అతని కంఠస్వరం గాలిలో కలిసిపోయింది.
అయితే, అదే సమయంలో…
ఒక మూలన ఉన్న పాతింటి తెరిచిన తలుపు మెల్లగా ఊగింది…
క్రాక్... క్రాక్…
వారిద్దరూ ఒకేసారి ఆ ఇంటి వైపు తిరిగి చూశారు!
"హరి, ఎవరో ఉన్నట్టున్నారు!" అని విక్రం అన్నాడు.
వారిద్దరూ జాగ్రత్తగా ముందుకు అడుగు వేశారు…
అప్పుడే…
ఇంటి లోపల నుండి ఒక మహిళ తడబడుతూ బయటికి వచ్చింది!
ఆమె ముఖం కుంచించుకొని పోయి ఉంది ... కళ్లలో భయం!
"అమ్మా! నీకు ఏమైంది?" అని హరి పరిగెత్తుకుంటూ వెళ్లాడు.
అంతలోనే ఆమె భయంతో కొట్టుమిట్టాడుతూ నేలకొరిగింది!
"విక్రం! త్వరగా చూడు! ఈమె పరిస్థితి బాగోలేదు!"
విక్రం వెంటనే ఆ మహిళ శరీరాన్ని పరీక్షించాడు.
అతను పల్స్ చూడగా, విచిత్రమైన రీతిలో కొట్టుకుంటోంది… శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతోంది.
ఆమె అతి కష్టం మీద—
"నీ...ళ్లు... దప్పిక... ఏ...ను..."
అని వెంటనే…
ఆమె ఒకసారి గట్టిగా ఊపిరి తీసుకుని… ప్రాణాలు విడిచింది!
హరి చుట్టుపక్కల ఉన్న ఇళ్ల తలుపులను గట్టిగా కొడుతూ పిలుస్తున్నాడు… కానీ ఎవరూ తలుపు తీయడం లేదు.
ఎవరైనా వస్తారేమో అనుకుంటూ, ఆ రాత్రంతా ఆ మృతురాలి పక్కనే కాపలాగా అక్కడే ఉండిపోయారు.
"ఇక్కడ ఏదో విచిత్రంగా ఉంది… మనం తెలుసుకునే వరకు ఇక్కడి నుండి వెళ్లకూడదు!"
అని నిశ్చయించుకున్నారు.
తర్వాతి రోజు…
ఊరివాళ్లు ఆ ఇంటి చుట్టూ గుమిగూడారు.
విక్రం, హరిని చూసి—
"ఎవరు మీరు? ఎందుకు వచ్చారు?" అని అడిగారు.
వారిద్దరూ వచ్చిన విషయం చెప్పిన తర్వాత, ఒక వృద్ధుడు ముందుకు వచ్చి—
"మీరు ఇక్కడ ఉండకూడదు!"
"ఇక్కడి రహస్యం తెలిసిందంటే... మీరు కూడా చచ్చిపోతారు!"
"తక్షణమే ఊరినుంచి వెళ్లిపోండి!" అని హెచ్చరించాడు.
విక్రం, హరి ఆయన్ను ప్రశ్నించబోతుండగా, వినిపించుకోకుండా చనిపోయిన ఆమె దహన సంస్కారాలు చేయడానికి అన్నట్టు అందరూ వెళ్లిపోయారు.
అందరూ వెళ్లిపోయాక…
విక్రం, హరి ఊరి మధ్యలో ఒక కానుగ చెట్టు కింద తమ టెంట్ వేసుకున్నారు.
ఇన్‌స్పెక్టర్ హరి & డాక్టర్ విక్రంకి ఏమి తెలియడం లేదు. అందరి ఇళ్ల తలుపులు తట్టారు.
కానీ… ఏ ఒక్కరు కూడా వారికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు!
"ఈ ఊర్లో జనాలు ఎందుకు మౌనంగా ఉన్నారు?"
"ఎవరూ మాతో మాట్లాడటానికి రావడం లేదెందుకు?"
వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
కానీ… ఎవరూ సహకరించలేదు!
సూర్యుడు అస్తమించే సమయానికి…
ఒక వృద్ధుడు టెంట్ దగ్గరకు వచ్చాడు.
గడ్డం నిండిన మొహం, వంగిన శరీరం, చేతిలో ఒక కర్ర.
అతను చుట్టూ చూస్తూ, నెమ్మదిగా మాట్లాడాడు—
"మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారో నాకు తెలుసు. కానీ, నా మాట వినండి…"
"ఈ ఊరు ఒక శాపగ్రస్తమైన ఊరు."
"ఆలయ గోపురం మీద కనిపించే ఏనుగు నీడ ఎవరు చూసినా… వాళ్లు చచ్చిపోతారు!"
హరి & విక్రం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు!
"ఏం? నాన్సెన్స్! నీడ చూసినంత మాత్రాన ఎవరికైనా మరణమా?"
"ఒక నీడ… ప్రాణాలను ఎలా తీస్తుంది?"
"ఇది మా ఊరి శాపం!"
వృద్ధుడు తన మాటను కొనసాగించాడు…
"నాకు తెలుసు… ఇది మీకు నమ్మశక్యంగా ఉండదు.
కానీ, గత కొన్ని దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది!"
"ఈ ఊరిలో ఎవరు మృత్యువాత పడినా… వాళ్ల శరీరంపై ఎటువంటి గాయాలు ఉండవు!"
"ఎటువంటి వ్యాధి లక్షణాలు ఉండవు!"
"ఏ రోగం లేదు!"
"కానీ, ఒక్క విషయం మాత్రం నిజం…"
"వాళ్లందరూ ఆ రోజు రాత్రి… ఆ నీడను చూసిన వాళ్లే!"
"సూర్యాస్తమయం అవగానే, ఊరిలో ఎవరూ బయట ఉండరు!"
"అందరూ తమ ఇళ్ల తలుపులు గట్టిగా మూసేసి, దీపాలు ఆర్పేస్తారు!"
"ఎవరూ ఆ ఆలయం వైపుకెళ్లరు!"
"ఎవరైనా ఆలయాన్ని చూసే పొరపాటు చేస్తే… వాళ్లు ఆ రోజు రాత్రే చచ్చిపోతారు!"
"దానిని ఆపడానికి ఎవరి తరం కాదు!"
విక్రం, హరి ఆ రోజుకు తమ పరిశోధనను ఆపి, విశ్రాంతి తీసుకున్నారు.
ఈ మిస్టరీ గురించి లోతుగా పరిశోధన చేయాలని నిర్ణయించుకున్నారు.
తర్వాతి రోజు ఉదయం…
విక్రం, హరి తమ పరిశోధన కొనసాగించడానికి బయల్దేరారు.
విక్రం ఆలయం పరిసరాల్లో పరిశోధన చేయడానికి, హరి ఊరి ప్రజలతో మరింత సమాచారం సేకరించడానికి బయలుదేరాడు.
విక్రం ఆలయానికి చేరుకొని చుట్టూ పరిశీలిస్తున్నాడు.
మొదట అతనికి అక్కడ ఏమీ అనుమానాస్పదంగా కనిపించలేదు, కానీ…
కొన్ని అడుగులు ముందుకు వేసినపుడు…
ఆలయం పరిసరాల్లో విచిత్రంగా ఎండిపోయిన ఆకులు అతని దృష్టిని ఆకర్షించాయి.
"ఈ ఆకులు… సింకోనా చెట్టు ఆకుల లాగా ఉన్నాయే?"
వాటిని చేతిలో తీసుకుని దగ్గరగా చూసాడు.
"సింకోనా చెట్లు ఈ పరిసర ప్రాంతాల్లో ఉండవు కదా?"
అనుకుంటూ, వాటిని జేబులో వేసుకొని బయటకు వచ్చాడు.
అదే సమయంలో, ట్రాక్టర్ ఆలయానికి సమీపంగా వెళ్తోంది!
విక్రమ్ అప్రమత్తంగా దాన్ని గమనించాడు. ట్రాక్టర్ వెనుక, కప్పబడిన పరుపుల మధ్య కొన్ని మొక్కలు కనబడ్డాయి.
"ఇవి అదే సింకోనా చెట్లు!"
"ఎందుకు ఈ మొక్కలను ట్రాక్టర్ ద్వారా తీసుకువెళ్తున్నారు? ఇవి సాధారణంగా మెడిసిన్‌లలో ఉపయోగిస్తారు. కానీ, ఇక్కడ ఎందుకు తీసుకువెళ్తున్నారు?"
దీని గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఆ ట్రాక్టర్ ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలి అనుకుంటూ ఊరిలోకి వచ్చాడు.
ఇంతలో హరి కూడా అక్కడికి వచ్చేశాడు.
విక్రం హరిని చూసగానే ఇలా అన్నాడు…
"హరి! ఆలయం దగ్గర విచిత్రమైన విషయాలు గమనించాను.
అక్కడ ఎండిపోయిన కొన్ని ఆకులు కనిపించాయి. వాటిని పరిశీలిస్తే, అవి సింకోనా చెట్టు ఆకులా అనిపించాయి. ఇవి ఇక్కడ పెరగవు!
ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే…
ఆలయం దగ్గర నుంచి నేను చూస్తుండగానే, ఒక ట్రాక్టర్ పూర్తిగా సింకోనా చెట్లతో వెళ్తున్నట్టు కనిపించింది!"
హరి ఆశ్చర్యపోతూ,
"ఇది నిజంగా విచిత్రంగా ఉంది.
అయితే, నేను ఊరిలో ఎవరినీ పెద్దగా మాట్లాడించలేకపోయాను. అందరూ భయంతో నోరుమెదపడం లేదు. మళ్లీ, ఇది ఊరిపై ఒక శాపం అని చెప్పి తప్పించుకుంటున్నారు!"
"మరి ఆ ట్రాక్టర్ ఎక్కడికి వెళ్తోందో తెలుసుకోవాలి!"
వారు జీప్ ఎక్కి, ట్రాక్టర్ వచ్చిన వైపుగా వెళ్లారు.
కొంత సేపటి తర్వాత, ట్రాక్టర్ ఆలయం సమీపంలో ఉన్న ఇటుకల బట్టీలో ఆగి ఉండటం గమనించారు.
హరి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒక కార్మికుడిని పక్కకు తీసుకెళ్లి ప్రశ్నించాడు.
"ఈ చెట్లను ఇక్కడ ఎందుకు తెస్తున్నారు?"
కార్మికుడు భయంతో,
"నాకు తెలియదు సార్… మా యజమాని ఎక్కడో నుంచి వీటిని తెప్పిస్తాడు.
ఎందుకు అని అడిగితే… ఇవి చాలా కాలం పాటు మండుతూనే ఉంటాయి, పైగా దోమలు కూడా ఉండవు" అని అన్నాడు.
విక్రమ్ శ్రద్ధగా బట్టీ పరిసరాలను పరిశీలించసాగాడు.
ఇంతలో, విక్రమ్ ఒక మూలన నిలబడి నేలను గమనించాడు.
అక్కడ భూమి కాస్త లోపల ఉండటం, ఓ చిన్న గుండ్రటి ఆకారంలో రంధ్రం ఉన్నట్లు కనిపించింది.
కాలితో గట్టిగా నొక్కగానే…
"టాక్!" అంటూ శబ్దం వచ్చింది.
"హరి! ఇక్కడికి రా…" మెల్లిగా అతన్ని పిలిచాడు.
"ఇక్కడ ఏదో రహస్యమార్గం ఉన్నట్టుంది!"
వారు ఇద్దరూ ఆ ప్రదేశాన్ని గమనించి, ఒకరినొకరు ఆశ్చర్యంతో చూశారు.
"దీన్ని ఎవరు లేనప్పుడు అక్కడ ఏముందో చూడాలి!" అనుకుంటూ, అక్కడి నుంచి వెళ్లిపోయారు.
తర్వాతి రోజు మధ్యాహ్నం…
ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్లు భోజనం చేయడానికి వెళ్లినపుడు, ఇద్దరూ ఆ రహస్య మార్గంలోకి వెళ్తారు.
అది ఒక సొరంగం లాగా ఉంది.ఆలయానికి వెళ్తున్నట్లు గమనిస్తారు…
లోపలికి వెళ్లే కొద్దీ, వాళ్లకు ఒక విచిత్రమైన ఘాటు వాసన వస్తుంది.
అక్కడ వాళ్లకి, కొన్ని ఉప్పు మూటెలు, సారాయి నిండి ఉన్న టిన్నులు కనబడ్డాయి.
"ఇది ఇప్పటికీ పెద్ద మిస్టరీగానే ఉంది!
సింకోనా చెట్టు, ఆలయం, ఈ రహస్య మార్గం, ఉప్పు, మద్యం టిన్నులు... వీటన్నింటికీ సంబంధం ఏంటో ఇంకా అర్థం కావడం లేదు!" అని హరి చికాకుగా అన్నాడు.
"రాత్రి ఆలయం పరిసరాలను తిరిగి పరిశీలిద్దాం!" అని చెప్తూ, అక్కడినుండి వచ్చేసారు.
రాత్రి అవుతుండగా, ఇద్దరూ ఆలయం వైపుకి బయల్దేరారు.
చీకటి పెరుగుతున్న కొద్దీ, ఆలయం మరింత వింతగా అనిపించసాగింది.
ఒక వింత ముసురు లాంటిది అక్కడ పరిసరాల్లో కనిపించింది.
అది గమనించిన విక్రమ్,
"హరి, ఆ గోడల వెంట పొగ వస్తున్నట్టు కనిపించలేదా?" అని చెప్పేలోపే, హరి ఒక్కసారిగా నడవడం నెమ్మదించాడు.
"విక్రమ్… నా చెవుల్లో ఏదో మోగుతున్నట్టుంది… చాలా దాహం వేస్తుంది…" అని చెప్పాడు.
హరికి తట్టుకోలేని తలనొప్పి మొదలైంది.
విక్రమ్ పరిస్థితిని గమనించి, తన వెంట తెచ్చుకున్న మాస్క్ తొందరగా ధరించుకున్నాడు.
హరికి ఏమి జరుగుతుందో అర్థం కాక, అతడిని మెల్లగా పట్టుకుని టెంట్ వైపుకు లాక్కెళ్లాడు.
గుడారానికి చేరిన వెంటనే, విక్రమ్ హరికి తొందరగా చికిత్స అందించాడు.
కొంత సమయం తర్వాత, హరి తేరుకున్నాడు.
"విక్రమ్, అది ఏదో… చాలా బలమైన వాసన… నా తల తిరిగింది…"
విక్రమ్ తాను సేకరించిన పదార్థాలను పరిశీలిస్తూ,
"ఈ పొగ… ఏమిటో తెలుసుకోవాలి!" అని అనుకున్నాడు.
"సింకోనా చెట్టు, మద్యం, ఉప్పు… ఇవన్నీ కలిస్తే…" అని విక్రమ్ ఆలోచిస్తున్నాడు.
అతనికి హఠాత్తుగా…
"హరి! గుర్తుందా, ఆ వృద్ధ మహిళ కూడా మరణించే ముందు 'దాహం… దాహం…' అని అన్నదీ కదా?"
హరి మెల్లగా తల ఊపాడు.
"ఒక్కసారి ఆలోచించు…
సింకోనా చెట్టులో ఒక ప్రత్యేకమైన కెమికల్ ఉంటుంది.
ఇది మలేరియా ట్రీట్మెంట్‌లో ఉపయోగిస్తారు.
దాన్ని ఎక్కువ మోతాదులో వాడితే… అది ఒకరకమైన విషంగా మారుతుంది!"
హరి ఒక్కసారిగా అవాక్కయ్యాడు.
"ఏమంటున్నావు? అంటే… ఈ పొగ దానివల్లే అంటున్నావా?"
విక్రమ్ గట్టిగా తలూపాడు.
"ఇది క్వినైన్ మిక్సర్.
ఆలయం కిందనుంచి దీన్ని పొగ రూపంలో విడుదల చేస్తున్నారు.
దీని ప్రభావంతో, మనిషికి దాహం పెరుగుతుంది, చెవుల్లో వింత శబ్దాలు వినిపిస్తాయి, నడవడం కష్టమవుతుంది…
చివరికి… మరణిస్తారు!"
"కాని… ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఎందుకు?"
విక్రమ్ ఇంకా ఆలోచిస్తూ,
"ఇదే మనం కనిపెట్టాల్సిన మిస్టరీ…" అని చెప్పాడు.
విక్రమ్, హరి తమ సంభాషణ కొనసాగిస్తుండగానే, ఒక సంఘటన జరిగింది.
అవునూ… వారు ఉన్న టెంట్‌కి ఒక్కసారిగా నిప్పంటుకుంది!
"విక్రమ్! చుట్టూ మంటలు వ్యాపిస్తున్నాయి!" హరి కేక వేసాడు.
"త్వరగా బయటకు రా!" అని విక్రమ్ హరిలోని చేతిని గట్టిగా పట్టుకుని, ఇద్దరూ పరిగెత్తారు.
కాసేపటికి, మంటలు పూర్తిగా వ్యాపించాయి. వారి గుడారం బూడిదయ్యింది!
హరి కోపంతో తన చుట్టూ తిరుగుతూ,
"ఇదంతా యాదృచ్ఛికం కాదు… ఎవరో కావాలనే చేస్తున్నారు!" అన్నాడు.
విక్రమ్ తల ఊపుతూ,
"ఒక నేరస్తుడు మన వెనకాల ఉన్నాడనేది స్పష్టమైంది.
మనం ఆలయాన్ని, సింకోనా చెట్టును, పొగ ప్రయోగాన్ని తేల్చగానే, మనల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు."
"అంటే ఎవరు?" హరి ఎదురుగా నిలబడి ప్రశ్నించాడు.
విక్రమ్ కాస్త ఆలోచించి,
"బ్రిక్ ఫ్యాక్టరీ… ఇటుకల బట్టి యజమాని! అతనే అయ్యుంటాడు!" అన్నాడు.
హరి ఒక్కసారిగా ఆగ్రహంతో బ్రిక్ ఫ్యాక్టరీ యజమానిని పట్టుకుని, అతడిపై 3rd-degree interrogation మొదలుపెట్టాడు.
"నిజం చెప్పు! లేకపోతే నువ్వు కూడా ఈ పొగ ప్రయోగానికి బలి అవుతావు!"
భయపడిపోయిన యజమాని, చివరికి తన నేరాలను ఒప్పుకున్నాడు.
"నాకు తెలియదు… నేను ఏం చేస్తున్నానో… నన్ను వదిలేయండి!"
"అదేంట్రా? నీ ఆటలు మాకు తెలియవా? ఏం చేస్తున్నావో అన్నీ చెప్పు!" అంటూ, పట్టకార్‌తో అతని వేలి గొర్లుని పీకాడు.
అతను నెప్పితో గట్టిగా అరిచి, నిజం చెప్పడం మొదలెట్టాడు.
"నేను పురాతన నిధుల స్మగ్లింగ్ చేస్తున్నాను… నా గురించి ఎవరికీ ఎటువంటి ఆధారం లభించకూడదని చంపేస్తున్నాను.
గుడికి ఉన్న శాపాన్ని నేను వరంగా మార్చుకున్నాను…" అంటూ చెప్పడం ఆపేసాడు.
"ఒక్కసారి విన్నాక నమ్మలేరు… కానీ ఇది నిజం!
నేను పురాతన నిధులను అక్రమంగా అమ్ముతున్నాను…!"
హరి, విక్రమ్ ఒకరికొకరు చూసుకున్నారు.
విక్రమ్ ఇలా అన్నాడు,
"పొగ వల్లే అంత తొందరగా చనిపోరు కదా… మరి జనాలు ఎలా చనిపోతున్నారు?" అని అడిగాడు.
ఇటుకల బట్టి యజమాని మౌనంగా కిందకి చూశాడు.
"అది… నెమ్మదిగా… ప్రణాళిక ప్రకారం జరిగిన పని.
1️⃣ ముందుగా, నేను ఆలయం చుట్టుపక్కల సింకోనా చెట్లను తగలబెడతాను.
2️⃣ అందులో మద్యం పోసి, ఉప్పు కలిపి పొగ విడుదల చేస్తాను.
3️⃣ దాన్ని పీల్చుకున్న వ్యక్తికి దాహం వేస్తుంది, చెవుల్లో ఓ శబ్దం వినిపిస్తుంది, తల తిరుగుతుంది.
4️⃣ తర్వాత, ఆలయానికి దగ్గరగా ఓ బకెట్‌ను ఉంచుతాను.
5️⃣ అది తాగితే, అందులో ఉన్న అధిక మోతాదులోని క్వినైన్, ఆల్కహాల్ వల్ల ప్రాణాలు కోల్పోతారు.
నేను గోపురం మీద ఏనుగు నీడ కనిపిస్తే చనిపోతారు… ఇది ఆలయ శాపం అని నమ్మించాలనుకున్నాను… నమ్మించాను.
అప్పుడు అందరూ ఆలయానికి దూరంగా ఉంటారు…" అని చెప్పడం ఆపేసాడు.
"అర్థమైంది!" విక్రమ్ కోపంగా అన్నాడు. "ఆ భయానకమైన శాపం వెనుక ఉన్నది భూతం కాదు… మనిషే!"
పోలీసులు వచ్చి ఇటుకల బట్టి యజమానిని అరెస్టు చేశారు.
అతని కుట్ర బహిరంగమైంది. గుడి శాపం ఓ అబద్ధం అని నిరూపించబడింది.
అంతా ముగిసిన తర్వాత, విక్రమ్, హరి తిరుగు ప్రయాణం పట్టారు.
"ఇది అంతా ఎంత వింతగా జరిగింది!
ఒకానొక సమయంలో నిజంగానే శాపం అనుకున్నాను నేను… ఇక అసలు శాపాలు, భూతాలూ నమ్మను!"
విక్రమ్ చిరునవ్వు నవ్వి,
"అవును. భయాన్ని మనం సృష్టించుకుంటాం. నిజానికి, ఇవన్నీ మానవ మేధస్సు అంతే!"
విక్రమ్ ఒక్కసారి గుడి వైపు చూసాడు.
ఆ శూన్యమైన గుడి గోపురం… వెన్నెల కాంతిలో మెరిసిపోయింది.
అంతలో, ఒక భారీ నీడ కనిపించింది అతనికి.
అది ఏనుగు ఆకారంలో ఉంది…

Khalil Ganiga
Just another programmer.. This blog expresses my views of various technologies and scenarios I have come across in realtime.
Keep watching this space for more updates.