<KG/>
ఇడ్లీ శెట్టి

ఇడ్లీ శెట్టి

బైక్‌లో వీధిలోకి రాగానే, "ఆ పిల్లాడి వెనకాలే వెళ్ళు. అతని ఇంటికే మీరు వెళ్లాల్సింది," అని చెప్పడం వినిపించింది. కానీ, పరీక్ష రాసి వస్తున్న నేను ఆ మాటలను సరిగా వినిపించుకోలేదు. సమాధానాలు కరెక్ట్‌గా రాశానా లేదా అన్న టెన్షన్‌లో, సర్రున ఇంటికి వచ్చేసాను.

పరీక్ష పేపర్ చూస్తూ ఉండగా, కాలింగ్ బెల్ మోగింది. గేటు దగ్గర ఒక పెద్దాయన నిలబడి ఉన్నాడు. వయసు 70-75 మధ్యలో ఉండొచ్చు. పాలిపోయినట్టు తెల్లగా ఉన్న ముఖం, మెరిసే తెల్ల జుట్టు, తెల్ల చొక్కా, తెల్ల పంచె—సాదాసీదాగా కనిపించినా గంభీరంగా ఉన్నాడు.

"బాబు, ఇది ఖాదర్ భాష ఇల్లే కదమ్మా?" అని ఆయన అడిగాడు.

"అవునండి," అని సమాధానం ఇచ్చాను.

"ఇంట్లో ఉన్నారా బాబు, మీ నాన్న?" అని మళ్లీ అడిగారు.

"మా నాన్న చనిపోయి చాలా సంవత్సరాలు అయ్యింది అండి," అని చెప్పాను. 20 ఏళ్ల క్రితమే మా నాన్న మృతిచెందారు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఎవరో నాన్న గురించి అడగడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది.

ఆయన ముఖంలో బాధ కనిపించింది.

"ఓ దేవుడా..." అని మెల్లగా గొణుక్కుంటూ, నాతో ఇంకేమీ చెప్పకుండా వెళ్లిపోయారు.

ఆలోచించాను, "మీరు ఎవరు అని అడిగితే ఆయన ఏమనుకుంటారో..."


(తదుపరి రోజు )

“వదినా! వదినా! ఎవరో ముసలాయన ఎండలో పడుకొని ఉన్నాడు. పిలిచినా వినడం లేదు. రాత్రి అన్నం పెట్టు మా, ఆకలి అవుతుంది అంటే అన్నం పెట్టాను... తినేటప్పుడు అన్న గురించి అడిగాడు. నీకేమైనా తెలుసేమో సూజ్జురా!" అంటూ మస్తాన్ అత్త గేట్ దగ్గర నిలబడి అమ్మతో చెప్పడం వినిపించింది.

చదువుకుంటున్న పుస్తకాలు పక్కన పెట్టి, అమ్మతోపాటు వెళ్లాను.

అందరూ ఒకచోట గుమిగూడారు. నిన్న సాయంత్రం నాన్న గురించి అడిగిన అదే వ్యక్తి...

"అమ్మ, నిన్న నాన్న గురించి అడిగిన ఈయనే," అని చెప్పాను.

ఆయన్ని లేపుదామని ప్రయత్నించాం. పలకడం లేదు. నా గుండె గాబరాగా కొట్టుకుంది. పల్స్ చెక్ చేయాలని చేయి పట్టుకున్నాను. చాలా చల్లగా ఉంది. ముక్కు దగ్గర వేళ్లు ఉంచాను. ఊపిరిపీల్చడం లేదు.

"అమ్మ! ఈయన చనిపోయారమ్మ!" అని అన్నాను.

అమ్మ కళ్లలో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి.

"ఇడ్లీ శెట్టి" అనింది పైకి. అమ్మ చూడగానే గుర్తు పట్టింది.


నాకు ఇంకా గుర్తుంది. నేను రెండో తరగతిలో ఉన్నప్పుడు, దసరా సెలవుల్లో, ఒకసారి నాన్నతో పాటు వీధి అరుగు మీద కూర్చొని ఉన్నాను. అప్పుడొక వ్యక్తి వచ్చి, "అయ్యా, ఇక్కడ బాడుగకు ఇల్లు ఏమైనా దొరుకుతుందా?" అని అడిగాడు.

నాన్న, "నీ అదృష్టం బాగుంది. ఒక ఇల్లు ఉంది. నచ్చుతుందో లేదో చూడాలి, దా చూపిస్తాను," అంటూ అతన్ని తీసుకొని, మా ఇంటి తర్వాత నాలుగు ఇళ్ల పక్కన ఉన్న ఒక కొట్టం ఉన్న ఇల్లు చూపించాడు.

"నచ్చింది అయ్యా," అని అతను చెప్పాడు.

మా నాన్న దగ్గరుండి అద్దె అది మాట్లాడి, ఇల్లు ఇప్పించి ఇంటికి వచ్చాడు. మా నాన్న హిందీ మూవీ 'ఆనంద్'లో రాజేష్ ఖన్నా టైపు. వీధిలో తెలిసిన, తెలియకపోయిన అటు పోయే వాళ్లతో తప్పకుండా మాట్లాడేవాడు.

అమ్మ నాన్నపై కోపంతో, "ఎవరో తెలియని వ్యక్తికి ఇల్లు ఎందుకు ఇప్పించారు ? అతని వల్ల ఏదయినా అయితే వీధిలో వాళ్లు మనల్ని అంటారు. తెలియదు అంటే సరిపోయేది కదా ?" అని చెప్పింది.

"అతను బాగా అవసరంలో ఉన్నాడని అనిపించింది, అందుకే ఇప్పించానమ్మ," అని నాన్న సున్నితంగా సమాధానం ఇచ్చాడు.

"అవును, మీకు ప్రతి ఒక్కరి అవసరం తెలుస్తుంది కదా!" అని మళ్లీ కోప్పడింది.

చెప్పా కదా, మా నాన్న రాజేష్ ఖన్నా టైప్ అని... "బాబుముషాయ్! ప్రతి మనిషి ఒక ట్రాన్స్మిటర్ & ఒక రిసీవర్. అతని నుండి ఒక వైబ్రేషన్ వచ్చింది, అంతే! నాకు ఇలా తెలిసిపోయింది, అతనికి అవసరం ఉంది," అన్నాడు.
(నాన్న సరిగ్గా ఇదే అన్నాడో లేదో నాకు గుర్తులేదు...నేను రాసిన కథ కదా, కొంత స్టోరీ లిబర్టీ తీసుకున్నాను.)

అదే రోజుసాయంత్రమే అతను ఇంట్లో చేరిపోయాడు.

రెండు రోజుల తర్వాత, ఒకసారి అతను మా ఇంటికి వచ్చి, నాన్నతో మాట్లాడడం, నాన్న జేబులోనుంచి కొంత డబ్బు తీసి ఇవ్వడం నేను చూసాను.

కొన్ని రోజులు పోయిన తర్వాత, అతను ఇడ్లీలు అమ్మడం మొదలు పెట్టాడు.

ప్రతిరోజు సాయంత్రం, అతను తన చేతులతో రుబ్బురోల్లో వేసి పిండి రుబ్బేవాడు. అతను పిండి రుబ్బే పద్ధతి చాలా విచిత్రంగా అనిపించేది—మోకాళ్ళ మీద నిలబడి పిండి రుబ్బుతుండేవాడు.
అది చూసి మా నాన్న అతని గేలి చేసేవాడు.

"ఏందయ్యా శెట్టి! నువ్వు ఇలా పిండి రుబ్బుతే, పిండి అరగడం ఏమో కానీ, ఈ వయసులో నీ మోకాళ్లు మాత్రం బాగా అరుగుతాయి. జాగ్రత్త!" అని చెప్పేవాడు.

ప్రతిరోజూ ఉదయాన్నే, ఆరు గంటలకే ఉడికించిన ఇడ్లీలను తీసుకొని అమ్మడానికి వెళ్లిపోయేవాడు అతను. మా వీధిలో మాత్రం అమ్మేవాడు కాదు.

ఒకరోజు, నాన్న అతనితో ఇలా చెప్పారు—
"శెట్టి! నువ్వు వీధిలో వాళ్లు ఏమైనా అనుకుంటారేమో అని ఇక్కడ అమ్మడం లేదేమో అలా అనుకుంటే, నువ్వు బతకలేవు అబ్బా!"

దానికి అతను చెప్పిన సమాధానం నాకు ఇంకా బాగా గుర్తుంది...

అది కాదు భాష! నేను ఇక్కడికి రాకముందే, ఒక అమ్మాయి ఇక్కడ ఇడ్లీలు అమ్ముతుంది, కదా? నేను ఇప్పుడు వచ్చి ఇక్కడ ఇడ్లీలు అమ్మితే, ఆమె వ్యాపారం దెబ్బతింటుంది. అందుకే నేను ఇక్కడ అమ్మను," అని చెప్పాడు.

ప్రతిరోజు ఇడ్లీలు అమ్మడం, మధ్యాహ్నం సాంబార్ అన్నం తినడం, సాయంత్రం పిండి రుబ్బడం—అతని దినచర్య. ప్రతి ఆదివారం నాన్నతో కలిసి చింతకాయలాట ఆడేవాడు. వాళ్లు ఆడుతుంటే, పిల్లలమంతా ఆసక్తిగా చూసేవాళ్లం.

చెప్పడం మరిచాను! అతని చెవి దగ్గర ఎప్పుడూ ఒక బీడీ ఉండేది, కానీ నేనైతే అతను పొగ తాగేది ఎప్పుడూ చూడలేదు.

రోజులు గడుస్తున్న కొద్దీ, అతను వీధిలో వాళ్లకు బాగా దగ్గరయ్యాడు. అందరూ అతన్ని 'ఇడ్లీ శెట్టి' అని పిలవడం మొదలుపెట్టారు.

వీధిలో ఎవరి ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా, అతనికి చెప్పకపోయినా కూరగాయలు కోయడం, అంట్లు తోమడం లాంటి పనులు చేసేవాడు. డబ్బులు ఇచ్చినా తీసుకునేవాడు మాత్రం కాదు.

దస్తగిరి స్వామి పండుగ వస్తే, నాన్నకి రైట్ హ్యాండ్ లాగా ప్రతి పని చేసేవాడు. ఒకసారి "శెట్టి, తూ ఈద్ కైకు కర్త? తూ తో తెలుగు బాత్ కర్త!" అని అడిగితే...
"మీకు పండుగ అయితే, నాకు కూడా పండుగ రా చిన్నోడా," అన్నాడు.

వీధిలో వాళ్లు ఎవరైనా హాస్పిటల్‌లో ఉంటే, తన ఇంటి వాళ్లే ఉన్నట్టు, వాళ్లకు నయం అయ్యేదాకా వారితో పాటు హాస్పిటల్‌లో ఉండేవాడు.

వీధి మనిషి కాస్త ఇంటి మనిషి అయ్యాడు ఇడ్లీ శెట్టి.

చెప్పలేదు కదా? శెట్టి గులాబ్ జామున్ భలే చేసేవాడు!
ఒకసారి తింటే, మళ్లీ మళ్లీ అడుగుతారు—అలా ఉండేది. వీధిలో పిల్లలందరినీ పిలిచి, "నోరు తెరవండి!" అని చెప్పి గులాబ్ జామున్ పెట్టేవాడు.
"కైకూ శెట్టి గులాబ్ జామున్ బనాయ?" అంటే...
"మా పండగ రా ఈరోజు!" అనేవాడు.

కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక రోజు నగలతో ముస్తాబైన మహిళ ఆకస్మాత్తుగా శెట్టి ఇంటికి వచ్చింది. రావడం రావడం, అతని మీద అరవడం మొదలుపెట్టింది. ఆమె మాట్లాడే భాష ఏంటో నాకు అర్థం కాలేదు. అక్కడున్న పెద్దవాళ్లు అది తమిళం అని చెప్పడం గుర్తుంది నాకు.

ఆమె వచ్చి వెళ్లిపోయిన కొన్ని రోజుల తర్వాత, శెట్టి ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు.

స్కూల్, ఆటల్లో పడి, నేను కూడా మర్చిపోయాను అతని గురించి.
ఎవరికి తెలియదు—అతను ఎక్కడికి వెళ్లాడు, ఎందుకు వెళ్లిపోయాడు.


"ఆయన బ్యాగ్‌లో అడ్రస్ ఏమైనా ఉందేమో చూడు నాన్న," అని అమ్మ చెప్పడంతో, ఒక్కసారిగా ఈ లోకం లోకి వచ్చాను.

ఆయన బ్యాగ్‌లో రెండు జతల బట్టలు, ఒక చిన్న నోటుబుక్, 500 రూపాయల సీలు వేసిన డబ్బు కట్ట ఉన్నాయి. దానిమీద ఏదో పేరు తమిళంలో రాసి ఉంది

నోట్‌బుక్‌లో ఒక ల్యాండ్‌లైన్ నెంబర్ కనబడింది. దానికి ఫోన్ చేశాను.

ఆడ గొంతు వినిపించింది. జరిగిందంతా తెలుగులో చెప్పబోతుంటే, ఆమె కోపంగా ఏదో అంటుంది అనిపించింది.

"తెలుగు మాట్లాడే వాళ్లు ఎవరైనా ఉంటే ఫోన్ ఇవ్వండి," అని మళ్లీ చెప్పాను.

ఐదు నిమిషాల తర్వాత, ఎవరో అబ్బాయి మాట్లాడాడు.

"ఇడ్లీ శెట్టి చనిపోయారు," అని వివరాలు చెప్పాను.

"మాది తమిళనాడు దగ్గర పల్లెటూరు. నేను రావడానికి ఆరు గంటలు పడుతుంది. అంతవరకు కొంచెం చూసుకుంటారా?" అని అడిగాడు.

"సరే," అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేశాను.

చెప్పినట్లే, ఆరు గంటల తర్వాత నా వయసున్న ఒక అబ్బాయి వచ్చాడు. ఇంకా ఎవరూ రాలేదు. అతను ఇడ్లీ శెట్టి కొడుకు.

దహన సంస్కారాలు అయ్యాక, ఇడ్లీ శెట్టి దగ్గర ఉన్న బ్యాగు, డబ్బు ఇస్తుంటే...

"ఈ డబ్బు మీదేనండీ," అని అబ్బాయి చెప్పాడు.

"మీ నాన్న పేరు రాసి ఉందండీ," అన్నాను.

ఆ డబ్బు అతనికి ఇచ్చి, "ఇడ్లీ శెట్టి పేరు మీద ఎవరైనా అవసరార్థులు ఉంటే, ఈ డబ్బును వారికే ఇవ్వండి," అని చెప్పింది అమ్మ.


ఇడ్లీ శెట్టి మా వీధిలోకి అనుకోకుండా వచ్చాడు. ఇక్కడ వాళ్లలో ఒకడిగా మారిపోయాడు. కానీ చివరికి, అతని కథ ఎవరికీ పూర్తిగా తెలియకుండానే ముగిసిపోయింది.

అతను అందరికీ తోడుగా ఉన్నాడు—ఎవరికి ఏ అవసరం వచ్చినా ముందుండేవాడు, అహంకారం అనేదే లేకుండా సహాయపడేవాడు.
కానీ, అతను వెళ్లిపోయినప్పుడు, ఎవరు అతని గురించి కనుక్కోలేదు.

చాలా ఏళ్ల తర్వాత తిరిగి వచ్చినా, చివరి రోజుల్లో, అతని మనుషులు కూడా అతన్ని మరిచారు.

ఒక్కోసారి ఆలోచిస్తే—ఇది ఎప్పటి నుంచో ఇలా ఉందా? లేక ఇప్పుడే మారిపోయిందా?
మనిషి, మనిషిని అర్థం చేసుకోవడం, అనుబంధాలు ఏర్పరచుకోవడం మరిచిపోతున్నారా?

బాగా అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల్లో, పొరుగువారితో పెద్దగా మాట్లాడుకోరు.
బయట ఎప్పుడైనా కనిపిస్తే, ఒక చిరునవ్వు నవ్వి వెళ్లిపోతారు.

ఇప్పుడు మన భారతదేశ పట్టణాల్లో కూడా ఇదే మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.

ఇది గ్లోబలైజేషన్ ప్రభావమా? లేక సమాజంలో మారుతున్న విలువలా?

ఇడ్లీ శెట్టి లాంటి ఎన్నో మనుషుల కథలు ఇలా మౌనంగా పోతున్నాయేమో.
మనం వాళ్ల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపించకుండా, అవసరం పూర్తయ్యాక మర్చిపోతున్నాం.

మనకెంతో దగ్గరగా ఉన్న వారిని సైతం మనం గుర్తించకుండా ఉంటే, మానవత్వానికి మిగిలేది ఏమిటి?

Share

Khalil

Khalil Ganiga

Just another programmer.. This blog expresses my views of various technologies and scenarios I have come across in realtime.

Keep watching this space for more updates.