<KG/>
మనుషులు కష్టం

మనుషులు కష్టం

బక్కోడా! రేయ్ బక్కోడా!

దూరం నుండి ఎవరో పెద్దగా పిలిచినట్టు అనిపించింది. వినగానే వెనక్కి తిరిగి చూసాను. పిలుస్తున్నది నన్నే అనిపించడానికి మరో కారణం కూడా ఉంది — ఆ పిలుపు బాగా తెలిసిన పిలుపులా అనిపించింది.

గురుమోహనా? కాదా? అనుకుంటున్నంతలోనే, అతడు పరిగెత్తుకుంటూ నా దగ్గరికి చేరాడు.

అవును, అది గురుమోహనే!

ఇంత ఉదయాన్నే ఇక్కడ అతడిని చూడటం మాత్రం నిజంగా ఆశ్చర్యానికి గురి చేసింది.
గురుమోహన్, ఇంటర్మీడియట్ రోజుల్లో నా క్లాస్మేట్. చూడటానికి సినిమా హీరోలా, ఎత్తుగా, ఎత్తుకు తగ్గ బరువు, పైగా అప్పటి ట్రెండ్‌ స్టైల్ పవన్ కళ్యాణ్ హెయిర్‌కట్‌తో ఉండేవాడు.
నిజంగా సెలబ్రిటీ వాతావరణం తీసుకుని వచ్చేవాడు. క్లాస్‌లోకి అడుగుపెట్టగానే, అతని చుట్టూ ఎప్పుడూ నలుగురు బౌన్సర్లలాగా ఉండేవారు.

అతని బ్యాక్‌స్టోరీ కూడా అలాంటిదే. గురుమోహన్ వాళ్ల నాన్న వాళ్ల ఊరి సర్పంచ్. ఒక్కడే కొడుకు. చాలా సంవత్సరాల తర్వాత పుట్టడం వల్ల అతన్ని గారాబంగా పెంచారు. కాలేజీకి అప్పటి ఫ్యాషన్ బైక్, అపాచీపై వచ్చేవాడు. మధ్యాహ్నం కాలేజీ బంక్ కొట్టి సినిమాలకు వెళ్లడం అతని డైలీ రొటీన్. మేనేజ్‌మెంట్‌కి తెలిసినా, చూసీచూడనట్లు వదిలేసేది.

అది పది సంవత్సరాల క్రితం.

ఇప్పుడు గురుమోహన్‌ను చూస్తే ఒక కొత్త వ్యక్తిని చూసినట్టుంది. పాత జ్ఞాపకాలన్నీ వెంటనే మెల్లగా మైండ్ స్క్రీన్‌పై కదిలాయి.

"ఎరా బక్కోడా, గుర్తు పట్టినవా లేదా?" అనేసరికి ఈ లోకంలోకి వచ్చాను.

"అరే, ఏంటన్నా అలా అంటావు? ఎలా ఉన్నావు? ఎక్కడ ఉంటున్నావ్?నువ్వెందీడా ? ఏంటి ఇలా అయిపోయావ్?" అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే అతను నన్ను ఆపాడు.

"ఎలా అయిపోయానా? నువ్వు ఆలోచించకు, నేనే చెబుతా!"

(గురుమోహన్ వయసులో నాకంటే నాలుగేళ్లు పెద్ద. అనేక స్కూల్స్ మార్చడం, కొన్ని క్లాసులు ఫెయిల్ కావడం వల్ల అతను ఇంటర్‌లో నాతో పాటు చేరాడు.)

నేను ఇంకా ఏమి చెప్పక ముందే తానే ఇలా అన్నాడు:"బట్టతల, తెల్లగడ్డం, బానపొట్ట — ఇదే కదా నువ్వడిగేది? ఇది బైటికి కనపడ్తుంది. లోపల కూడా డామేజీ స్టార్ట్ అయ్యింది లే. ఎక్కువ మాట్లాడితే ఆయాసం. స్టోక్ వచ్చి పోయింది. చస్తా చస్తా బతికిన. డాక్టర్ రోజూ కొంత దూరం వాకింగ్ చేయమన్నాడు. లేదంటే ఈసారి నా దగ్గరికి రాకముందే పోతావు అన్నాడు."

"ఈరోజే కుదిరింది రావడానికి," అంటూ చెప్పడం ఆపేసాడు.

గురుమోహన్‌ను ఇలా చూస్తాననుకోలేదు.

"రా రా, అక్కడ టీ బంకు దగ్గర కూచొని మాట్లాడుదాం," అంటూ నా సమాధానమేమిటో వినకుండానే గురుమోహన్ ముందుకు నడవడం మొదలెట్టాడు.

ఇద్దరం టీ బంకు దగ్గరికి వెళ్లి కూర్చున్నాం.

"నాకు ఒక టీ, నీకేం కావాలో తీసుకోరా, బక్కోడా," అన్నాడు.
తనకి ఒక టీ, నాకు బ్లాక్ కాఫీ ఆర్డర్ ఇచ్చి మళ్ళీ కుర్చీలో కూర్చున్నాను.

గురుమోహన్ టీ తాగుతూ: "నీ పులి సారు కనపడినాడు. మనిషి అట్నే ఉండాడు, ఏమి మారలేదు. అదే హీరో హోండా బండి వేసుకుని తిరుగుతున్నాడు. హాస్పిటల్ కాడ కనపడితే పలకరించిన నన్ను గుర్తు పట్టలేదు అనుకో."

నేనేదో చెప్పబోతుంటే,"నేనేం ఫీల్ కాలేదు, లేరా నాయనా. అయినా సార్ వాళ్లు, నా లాంటి మొద్దుని గుర్తు పెట్టుకుంటారా? మీలాగా బాగా చదువుకునే వాళ్లని మాత్రమే గుర్తు పెట్టుకుంటారు."

పులి సార్ అంటే ఇంటర్మీడియట్లో మా కెమిస్ట్రీ లెక్చరర్ భాస్కర్ రెడ్డి సార్.. గురు మోహన్ తో నాకు పరిచయం కెమిస్ట్రీ క్లాస్ లోనే జరిగింది ఇంటర్ జాయిన్ అయినా కొత్తలో ఒకరోజు కొంచెం లేటుగా వెళ్ళాను కాలేజీకి, దాంతో ముందు సీట్లన్నీ ఫుల్ అవ్వడంతో చివరి బెంచీలో కూర్చోవాల్సి వచ్చింది . ఆరోజు గురుమోహన్ కూడా అదే బెంచ్ లో కూర్చుని ఉన్నాడు. క్లాస్ చెప్తూ చెప్తూ సడన్గా భాస్కర్ రెడ్డి సార్ లాఫింగ్ గ్యాస్ ఫార్ములా ఎవరైనా చెప్పండ్రా అన్నాడు.. నేను N2O అని మెల్లగా గొణుక్కుంటున్నంటూ చెప్పాను. అది ఆయప్పకి వినపడింది. ఆయన పులిరా వాడు శభాష్ ఎవడ్రా చెప్పింది అన్నాడు. నేను మొహమాటం వల్ల వచ్చిన భయంతో లేవలేదు. గురు మోహన్ భయపడకు లేచి నిలబడు అని అంటున్నా నేను లేవకపోవడంతో తనే నా పేరు గట్టిగా చెప్పాడు దానితో తర్వాత జరిగిన ఎగ్జామ్స్ లో నేను ఫస్ట్ రావడంతో నా గురించి చాలామందికి తెలిసింది.

ఈ జ్ఞాపకాలు నా మనసులో నడుస్తుండగానే, పక్క టేబుల్ దగ్గర నలుగురు రాబోయే జమిలి ఎన్నికల గురించి చర్చించుకుంటూ సిగరెట్లు తాగుతుండటం గమనించాను.వాళ్ళ చేతిలో సిగరెట్లు చూసేసరికి ప్రాణం లేచి వచ్చినట్లైంది గురు మోహన్ కి. తన జేబులో నుంచి గోల్డ్ ఫ్లాక్ సిగరెట్స్ తీసి అక్కడున్న పెద్ద మనిషిని అడిగి అగ్గిపెట్ట తీసుకున్నాడు.

సిగరెట్ వెలిగించే లేపు మా టి అండ్ కాఫీ తీసుకుని ఇచ్చాడు టీ బంకులో పనిచేసే పిల్లోడు.

టీ ని ఒకసారి సిప్ చేసి సిగరెట్ పఫ్ ఒకసారి గాల్లోకి ఊది “అల్లం టీ సిగరెట్ కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది రా బక్కోడా” అన్నాడు.

“అవునా అన్న” అని కాస్త ఆశ్చర్యంగా చెప్పాను .

“ బక్కోడా నువ్వు ఏం మారలేదు రా అట్నే ఉండావు.” వేడి వేడి టీ ని రెండే గుక్కల్లో తాగేసి సిగరెట్ మొత్తం కాల్చి వరకు ఏం మాట్లాడలేదు.

నేను కూడా ఏమీ మాట్లాడలేదు.

రెండు నిమిషాల తర్వాత “ఇప్పుడు చెప్పరా బక్కోడా ఏంటి విశేషాలు” అంటూ సంభాషణ స్టార్ట్ చేశాడు

నా దగ్గర విశేషాలు ఏముంటాయి అన్న అంతా మామూలే.

ఏదో అనుకోడని మాట అన్నట్టు నా వైపు చూసాడు.

నిజం చెప్పాలంటే నా దగ్గర పెద్దగా విశేషాలు లేవు కూడా.

“నువ్వే చెప్పన్నా” అని అన్నాను

నేను ఎప్పుడు అడుగుతాను అని వెయిట్ చేస్తున్నట్టు అనిపించింది అతని చూపులో.

మెల్లిగా చెప్పడం మొదలు పెట్టాడు. “డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో ఉన్నప్పుడు మా నాన్న ప్రస్తుతం సాగుచేస్తున్న భూమితో పాటు మల్లెల దగ్గర ఇంకా ఐదు ఎకరాలు గుత్తకి తీసుకున్నారు. ఒక రోజు ఆ భూమిని సాగు చేయడానికి ట్రాక్టర్లో వెళ్తున్నప్పుడు, డ్రైవర్ రోడ్ దిగువకు ఉందని డీజిల్ ఆదా చేయాలనుకుని న్యూట్రల్‌లో పెట్టి నడిపించాడు . ట్రాక్టర్ కంట్రోల్ తప్పి బోల్తా పడి ఆక్సిడెంట్ అయ్యింది.

ఎన్నో ఆసుపత్రులు తిరిగినా ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. మా దగ్గర ఉన్న ఆస్తులన్నీ ఆయన వైద్యం కోసం ఖర్చయిపోయాయి. కొన్నిరోజుల తర్వాత ఆయన చనిపోయారు.

గోరుచుట్టుకే రోకలిపోటు అన్నట్టు.. మేమున్న పరిస్థితిలో ఉన్న ఇంటిని మోసం చేసి లాక్కున్నాడు నా మామ (అదొక పెద్ద కథ) దాంతో రోడ్డున పడాల్సి వచ్చింది. అప్పు అడగడానికి వెళ్తే, ‘ఏం పని చేసి తిరిగి చెల్లిస్తావు?’ అని అనడం మొదలుపెట్టారు. పైగా, 'లెక్క ఉన్నపుడు ఎగరేసుకుంటిరి , ఇప్పుడు అడుక్కుంటున్నారు' అని చెప్పడం మొదలెట్టారు. అది కూడా నిజమే లే . ఉన్నపుడు తెలిసిన తెలియని వాళ్ళు ఎవరు వచ్చి అడిగిన, అడిగిన దానికంటే ఎక్కువిచ్చి పంపించేవాడు మా నాయన, ఆటో వాడు 100 అడిగితే 150 ఇచ్చేవాణ్ణి నేను. కొన్ని రోజుల పాటు ఉత్త అన్నం నీళ్లు కలుపుకొని తిన్యాం రా బక్కోడా. “

ఆ మాటలు వింటుంటే నాకు తెలియకుండానే నా కళ్ళలో నీళ్లు తిరిగాయి.

“నువ్వు చూశావుగా బక్కోడా. కాలేజీలో ఉన్నపుడు ఎంతమందికి నేను సహాయం చేసానో. కానీ నేను కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ నన్ను తప్పించుకుని వెళ్లేవాళ్లు.”

ఎంతో జాలీగా జల్సాగా ఉండే గురుమోహనేన అనిపించింది. తను చదవకపోయినా కూడా మా క్లాసులో చాలామందికి ఎగ్జామ్ ఫీస్ కట్టేవాడు చాలామందికి బుక్స్ ఇప్పించాడు ఎవరైనా కాలేజీ ఎగర కొట్టి సినిమాకి వెళ్తే వాళ్ళని తిట్టి కాలేజీకి పంపించేవాడు తనలాగా ఎవరు అవ్వకూడదనేసి.

“ఇపుడు ఏమి చేస్తున్నావ్ ఎలా ఉన్నావ్ అన్న” అని అడిగా బాధతొ .

“ఇపుడా.. తెలివి వచ్చింది రా బక్కోడా. ఇంటర్లో టైంపాస్ కోసం నేర్చుకున్న ఫోటోషాప్ బతుకుదెరువు అయింది. ఆకలితొ ఒక రోజు రోడ్ మీద కళ్ళు తిరిగి పడిపోతే ఒకాయన ఫుడ్ పెట్టి నా పరిస్థితిని చూసి, నా గురించి అంత తెలుసుకొని నాకు ఫొటోస్టూడియో లో పని ఇప్పించాడు. ఇపుడు సొంతంగా నాయన పేరు మీద ఫొటోస్టూడియో పెట్టుకున్నాను.

ఒకటి మాత్రం బాగా తెలుసుకున్న రా బక్కోడా. డబ్బు ని మనం గౌరవిస్తేనే అది మనల్ని గౌరవిస్తుంది, మనతొ ఉంటుంది. కడుపు నిండిన వాడు మాత్రమే డబ్బు శాశ్వతం కాదంటాడు అది అబద్దం.

బెల్లం చుట్టు చీమలు చేరుతాయి అన్నట్టు దూరం పోయిన బంధువులు మళ్ళీ వస్తున్నారు ఇంటికి.

మనుషులు కష్టం రా బక్కోడా అంటూ చెప్పడం ఆపేసాడు.

గురుమోహన్ మాట్లాడటం ముగించగానే, అతని ముఖంలో అతని అనుభవాల బరువును నేను చూడగలిగాను, అతని కళ్ళలో ఒక విచిత్రమైన ప్రశాంతత కనపడుతుందిప్పుడు.

కుర్చీని మీద వెనక్కి వాలి ఇంకో సిగరెట్ వెలిగించి ఇలా అన్నాడు "జీవితం, రా బక్కోడా, పాఠాలు చెబుతూనే ఉంటుంది. మనం వాటిని ఎప్పుడు నేర్చుకుంటామనేదే ముఖ్యం."

నేను నిజం అన్నట్టు తల ఊపాను. గురుమోహన్ ఎప్పుడూ నాకు గొప్పగానే కనిపించేవాడు ఒక హీరోగా, ఒక స్నేహితుడిగా, ఒక మార్గదర్శిగా. ఇప్పుడూ అతని ఎదురుగా కూర్చుని చూస్తుంటే, అతను ఇంకా అలానే ఉన్నాడని అనిపిస్తుంది . కానీ ఇప్పుడు అతను తన పాత నిర్లక్ష్యమైన గతం వల్ల కాదు, జీవితం అతనిని మలిచిన తీరు వల్ల ఆదర్శంగా కనపడుతున్నాడు.

చూడరా, బక్కోడా,"సిగరెట్ యాష్ ని పడేస్తూ ఇలా అన్నాడు. కష్టం నాకు ఒక కొత్త గమ్యం ఇచ్చింది.ఇపుడు ఆ గమ్యాన్ని చేరుకున్నాననిపిస్తుంది.

ఒక క్షణం మౌనంగా కూర్చున్నాం అతని సిగరెట్ నుండి వస్తున్న పొగ మంచు పొగలో కలిసిపోతుంది. మా మాటలు నచ్చాయేమో టీ బ్యాంకు అతను మాకొ ఇంకో రౌండ్ వేడి టీ ఇచ్చి వెళ్ళాడు.

గురుమోహన్ టీ తాగుతూ "బక్కోడా, జీవితం మనకు ఏదైనా ఇచ్చే ముందు మనల్ని పరీక్షిస్తుంది మనం క్యాపబిల్ కాదా అని . అప్పుడు మనం ఆ పరీక్షల్లో పాస్ అయితేనే మన జీవితానికి నిజమైన అర్థం. కానీ ఆ అర్థాన్ని మనం కరెక్టుగా ఉపయోగించుకోవాలి . ఇప్పుడు నా చూపంతా నా స్టూడియోను ఒక పెద్ద బ్రాండుగా చేయడమే దానితొ పాటు నా ఆరోగ్యాన్ని చూసుకోవడం అంటున్న అతని ముఖంలో ఆత్మవిశ్వాసం, అతని కళ్ళలో జీవిత పాఠాలను గెలిచిన విజయపు గెలుపు నేను చూశాను.

"నీ కథను వింటుంటే నాకు మొదట్లో చాల బాదేసిన ఇపుడు సంతోషంగా ఉంది అన్న”.

అతను నవ్వుతు , "బక్కోడా, మనం ఎదుర్కొనే ప్రతి కష్టానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం తెలుసుకుని ముందుకు నడిస్తే, మనల్ని ఎవరూ ఆపలేరు," అన్నాడు.

ఆ రోజు మధ్యాహ్నం వరకు మాట్లాడుకుంటూ, పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటూ, భవిష్యత్తు ప్రణాళికలు గురించి మాట్లాడుకున్నాం .

Share

Khalil

Khalil Ganiga

Just another programmer.. This blog expresses my views of various technologies and scenarios I have come across in realtime.

Keep watching this space for more updates.