శిథిలాలయం
జైనతీర్థం - బ్రిటిష్ పాలనలో మూతపడి, స్థానిక ప్రజల ధైర్యం, ఆత్మాభిమానం వల్ల తిరిగి తెరుచుకున్న ఈ పవిత్ర స్థలం ఒకప్పుడు భక్తుల కోరికలను నెరవేర్చిన పుణ్యక్షేత్రం. కాలగమనంలో శిధిలావస్థకు చేరుకొని పురాతన ఆలయంగా మారింది.
జైనతీర్థానికి వెళ్ళే దారి పచ్చటి పైరుల మధ్యగా సాగుతుంది. ఆలయానికి చుట్టూ రాతి ప్రహరీ గోడ కనిపిస్తుంది. ఆ గోడ చుట్టూ బీడుగా మారిన పంట పొలాలు, అక్కడక్కడా గట్లు, వాటి మీద రాళ్ళు రప్పలు కలిసిన మట్టిలో పెరిగిన పిచ్చి మొక్కలు, ఎండిన తీగలు, రాలిపడిన ఆకులు గాలికి ఊగుతుంటాయి. అప్పుడప్పుడూ వినిపించే పక్షుల కిలకిలారావాలు సమీపంలోని పెన్నా నది శాంతమైన ప్రవాహంలో కలిసిపోతుంటాయి.
ఆలయం గేటు ఎదురుగా గుప్తనిధుల కోసం తవ్వబడి, మూల విరాట్టు లేని పాడుబడిన రామాలయం ఒకటి ఉంది.
ఆరిఫ్ కారును రామాలయం ఎదురుగా ఆపి, తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ ఇలా అన్నాడు: "ఇదే రా, నేను ఇన్ని రోజులనుండి చెబుతున్న నా ఫేవరేట్ ప్లేస్ - జైనతీర్థం! కారు దిగేటప్పుడు జాగ్రత్త, దురదగుంటాకు మొక్కలుంటాయి.
మనం ఇక్కడి నుంచి 200 మీటర్లు నడిస్తే లోపలికి వెళ్లవచ్చు."
కారు దిగిన సుబ్రహ్మణ్యం, రమణ, రవి, ఆరిఫ్ నడుచుకుంటూ ఆలయం చుట్టూ చూసారు.
ఆలయం లోపలికి వెళ్లగానే, ప్రశాంతతను ఆస్వాదిస్తూ సుబ్రహ్మణ్యం ఆనందంగా అన్నాడు, "సూపర్ ప్లేస్ రా ఆరిఫ్! ఇంత ప్రశాంతంగా ఉంటుందనుకోలేదు . ఇన్ని రోజులు దీని గురించి ఎందుకు చెప్పలేదు?"
ఆరిఫ్ తల ఊపుతూ, "నేను కాలేజ్ టైం లో ఒక ఫ్రెండు తో కలిసి మొదటి సారి ఇక్కడికి వచ్చాను. కరోనా తరవాత ఇది నా ఫేవరేట్ ప్లేస్ అయిపోయింది. కొన్ని దశాబ్దాల నుండి ఇక్కడికి ఎవరు రావడం లేదు. ప్రస్తుతం ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కంట్రోల్ లో ఉంది," అన్నాడు.
రవి చుట్టూ చూస్తూ, "ఇలాంటి ప్రదేశాలలో శక్తులు ఉంటాయి, ఇక్కడ ఏముందో మనకు తెలియదు," అన్నాడు.
"శక్తులా? ఎలాంటి శక్తులు?" అడిగాడు ఆరిఫ్.
దానికి సమాధానం ఇవ్వకుండా, "మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి," అన్నాడు రవి.
"అదంతా నాకు తెలియదు కానీ నేను మాత్రం ఈ ప్రశాంతతను ఎంజాయ్ చేస్తాను," అంటూ అక్కడి నేల మీద పడుకుంటూ అన్నాడు సుబ్రహ్మణ్యం.
"ఎక్కడ పడితే అక్కడ నేల మీద పడుకోకూడదు, శక్తులు ఉంటాయని చెప్తున్నా కదా!" అంటూ గట్టిగా అరిచాడు రవి.
ఆరిఫ్ కనుబొమ్మలు పైకెత్తి, "ఎలాంటి శక్తులు? అవి మంచివా? చెడ్డవా? శక్తులున్నాయని ఎలా చెప్తున్నావ్?" అంటూ అడిగాడు.
రవి, నిటారుగా నిలబడి, తన కుడి చేయి బొటనవేలు మరియు చూపుడు వేలుని కలిపి నొసటి భాగం లో ఉంచి ఇలా అన్నాడు, "నాకు కొన్ని మంత్రాలు తెలుసు. వాటిని జపించినపుడు నేను నిలబడిన ప్రదేశంలోని శక్తిని గ్రహించగలను. పాజిటివ్ వస్తే ప్రశాంతంగా ఫీలవుతాను. నెగెటివ్ వస్తే మనం ఉన్నఫలంగా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి.” అన్నాడు.
ఆరిఫ్ నవ్వుతూ, 'మంత్రాలా? అవి జపిస్తే శక్తుల గురించి ఎలా తెలుస్తుంది? బై ది వే, ఎలాంటి శక్తుల గురించి చెప్తున్నావ్?' అని అడిగాడు.
రవి సమాధానం చెప్పే లోపు రమణ ఇలా అన్నాడు, “నువ్వు ఆగరా, రేయ్ ఆరిఫ్, నీకు దెయ్యాలన్న, ఆత్మలు అంటే నీవు నమ్మవు కదా? మరి ఎందుకు అంత ఆసక్తిగా అడుగుతున్నావు?”
ఆరిఫ్ భుజాలను ఒకసారి పైకెత్తి దించుతూ, “నేను ఆత్మలు, దెయ్యాలుంటాయంటే ఇప్పటికి నమ్మను. వాడు శక్తుల గురించి చెప్తుంటే నేను విద్యుదయస్కాంత క్షేత్ర శక్తుల గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను. మంత్రాలూ జపిస్తే వాటి గురించి ఎలా తెలుస్తాయి అని తెలుసుకుందాం,” అని చెప్పాడు .
రవి నవ్వుతు, “విద్యుదయస్కాంత క్షేత్రాల గురించి కాదు, నేను చెప్పింది రమణ చెప్పిన ఆత్మలు, గుప్తనిధులు కాపాడుతున్న శక్తుల గురించి చెప్తున్నాను. ఇలాంటి ప్రదేశాలలోనే గుప్తనిధులు ఉంటాయి, వాటిని కాపాడుతూ కొన్ని శక్తులు ఉంటాయి. సినిమాల్లో కూడా చూపిస్తారు. నిధులు వెలికితీసేపుడు పాములు, ఎనుముగొడ్డులు రావడం.”
“నీ బొందర, నీ బొంద... పాములు ఎక్కువగా బొరియలు, పగుళ్లు ఉన్న చోటు ఆటోమాటిగ్గా వెళ్ళ్తాయి. ఇంకా నిధులు దాచాలనే వాళ్ళు కూడా పాముల్ని ఉంచుతారెందుకుంటే అవి ఉన్నచోటు ప్రమాదం అని చెప్పడానికి. అంతే కానీ నువ్వు చెప్పినట్లు మంత్రాలూ గింత్రాలు కాదు.” అన్నాడు ఆరిఫ్
“అవునా అలా నా... అయితే నీకు శక్తుల గురించి నమ్మకం కలగాలంటే నేను చెప్పినట్టు చేయి, వచ్చే అమావాస్య ఆదివారం నాడు నేను చెప్పిన శ్మశానంకి వెళ్లి అక్కడి నుండి ఏదయినా ఒకటి తీసుకుని రా. నీకు శక్తులంటే భయం కలగకపోతే నన్నడుగు తర్వాత,” అన్నాడు రవి
ఆరిఫ్ గట్టిగ నవ్వుతు, “ఏందీ అతడు సినిమా సీన్ చెప్తున్నావా? నేను ఏ శ్మశానం దగ్గరికి వెళ్లి ఏది తీసుకురాను కానీ భయం గురించి ఒకటి చెప్తా. సరిగ్గా విను,” అంటూ సంభాషణ కొనసాగించాడు.
అందరూ శ్రద్ధగా వినడం మొదలు పెట్టారు. “భయం అనేది జస్ట్ మన మెదడులో జరిగే కెమికల్ రియాక్షన్ తప్ప మరొకటి కాదు. భయపడినపుడు మన శరీరం అడ్రినలీన్ ఇంకా కార్టిసాల్ అనే హార్మోన్లను విడుదల చేస్తుంది. అవే గుండెని వేగంగా కొట్టుకునేలా, అరచేతుల్లో చెమటలు పట్టేలా, కొంతమందికి పానిక్ ఎటాక్ వచ్చేలా చేస్తాయి ఇంకా మన మనస్సు అర్థం చేసుకోలేనటువంటి విషయాలను ఊహించుకొనేలా చేస్తాయి.
ఇదంతా బయాలజీ... ఇంకోటో, ఇంకోటో కాదు.”
రమణ సాలోచనగా తల ఊపుతూ, “అంటే ఆ భయం అంతా జస్ట్ హార్మోన్ల వల్ల అంటున్నావా?” అని అడిగాడు.
“ఎక్సాట్లీ అదే. దెయ్యాలు, ఆత్మలు అనేవి మన భ్రమ వల్ల కలిగిన భయాలు మాత్రమే.” చెప్పాడు ఆరిఫ్
"రవి మొహం చిట్లించి, ఇన్ని శతాబ్దాలుగా జనాల నమ్మకాన్ని కొట్టిపారేస్తున్నావ్. దెయ్యాలు, ఆత్మలను చూసిన వ్యక్తుల కథల గురించి ఏమిటి? అవన్నీ భ్రాంతులు, భ్రమలు అంటున్నావా? నాకు జరిగిన సంఘటనలు చెప్తాను, విను. ఒకసారి, నేను మా బావ కలిసి ఒక పల్లెటూరు కి వెళ్లాం. మా పని అయిపోయే సరికి ఆ ఊరి లాస్ట్ బస్సు వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి పడుకోవడానికి ఊరి చివర ఉన్న స్కూల్ వరండాలో పడుకున్నాం. అర్థరాత్రి రెండు గంటల ఆ సమయంలో ఎముకలు కోరుకుతున్న శబ్దం వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే, ఎదో నీడ మా కళ్ళ ముందు కనపడుతుంది. మేము హనుమంచాలీసా జపిస్తూ పడుకున్నాం. ఆ రోజు మమ్మల్ని దేవుడే కాపాడాడు. ఇంకో సంఘటన గురించి చెప్తాను. 8 నెలల కిందట, ఒకసారి వేంపల్లె సైడ్, రాత్రి 11 అవుతుంది అనుకుంటాను, సడన్గా జాజిమల్లెలా వాసనా వచ్చింది." వీటి గురించి ఎం చెబుతావ్?” అంటూ చెప్పడం ఆపేసాడు.
“ఆత్మలు కనిపించాయి అనడం అనేది మన భ్రమ. చనిపోయాక శరీరం మట్టిలో కలిసిపోతుంది. సింపుల్గా ఒకటి చెబుతాను.
చనిపోయిన వారు ఆత్మీయులకు శోకంగానూ, కాటికాపరులకి పొట్టకూటిగానూ, భయస్తులకి దెయ్యంగానూ, సాధువుకి వైరాగ్యంగానూ, వైద్యులకు ప్రయోగాత్మక వస్తువుగానూ, తాత్వికులకి తత్వంగానూ కనపడతారు.
అదే, ఆత్మలు ఉంటే అందరికి ఒకేలానే కనిపించాలి కదా?
భయము మనం చూడని వాటిని చూసేలా చేస్తుంది. ఎపుడైనా పడుకున్నప్పుడు, సడెన్‌గా లేచినపుడు మనకు విచిత్రమైన రూపాలు కనపడుతాయి. మళ్ళీ వాటిని అదేపనిగా చూసినపుడు అవి నార్మల్ ఆబ్జెక్ట్స్ లా కనుపడుతాయి. బేసిగ్గా మన బ్రెయిన్ నెగటివ్ కి ట్యూన్ అయి ఉంటుంది. ఎపుడైనా పార్కులో గడ్డిలో నడిచేటప్పుడు ఏదయినా పుల్ల గుచ్చుకుంటే, వెంటనే అక్కడినుండి మన కాలిని తీసి చూసుకుంటాము. మొదటగా మనకు కలిగే భయం ఏదయినా పురుగు కుట్టిందా అని. తెలియని వాటి గురించి మనల్ని రక్షించడానికి మెదడు ఎంచుకున్న మార్గం అది.
నువ్వు చెప్పిన విషయాలకి వస్తే, బాగా అలసిపోయి పడుకున్న మీకు, అక్కడి జంతువులూ ఏమైనా ఎముకలు కోరుకుతుండటం విన్పించి, కళ్ళు తెరిచి చూసారు. సడెన్‌గా నిద్రనుండి లేవడం వల్ల మీకు వాటి నీడలు ఆత్మలాగా కనిపించి ఉంటాయి. రెండో సంఘటనకి వస్తే, రాత్రి సమయంలో నువ్ రోడ్ మీద ఒంటరిగా వెళ్ళ్తున్నావు. ఆ చుట్టుపక్కల ఏమైనా పూల మొక్కలుండొచ్చు. వాటి పూల నుండి ఆ సువాసన నీకు తెల్సిన జాజిమల్లెలా వాసనా లాగా ఉండొచ్చు, అంతే.
ఒకటి చెప్పు, మనుషులకే మనుషుల ఆత్మలు ఆవహిస్తాయేందుకు? జంతువులు కూడా చచ్చిపోతాయి కదా, వాటికి ఆత్మలు ఉండవా? అవి ఎందుకు ఆవహించావు?
నువ్వు ఇంకోటి గమించావా? ఇవన్నీ రాత్రి మాత్రమే జరిగాయి. నీకు బేసిగ్గా, నీకు రాత్రంటే భయం. ఖలీల్ అనే ఒక ఇంస్టాగ్రామ్ యూసర్ ఏమన్నాడో తెలుసా? "రాత్రి ఎప్పుడూ భయంకరం కాదు. అది మన ఊహల్లోంచి పుట్టిన భయం." అని ఆరిఫ్ చెప్తుండగా, దూరం నుండి నెమళ్ళ కూతలు వినపడ్డాయి. పెన్నా నది ఒడ్డున సూర్యుడు అస్తమిస్తున్నాడు.
“మనం అప్పటినుండి ఇక్కడే ఉన్నాము. ఇక్కడ శక్తులు కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయో చూడనే లేదు. పదండి, వెళ్దాం” అన్నాడు రమణ.
నలుగురు అక్కడున్న మట్టిలో నడుచుకుంటూ జైన తీర్థంకరుడైన పార్శావపునాద గుడి దగ్గరికి వచ్చారు. ఒకప్పుడు పూజ పునస్కారాలతో ఉన్న విగ్రహం నేడు జైలు లాంటి ఇపుడు కమ్మీల వెనుక తాళం వేసి ఉండటం గమనించారు.
"ఇక్కడ చూడండి," రవి గుడి రాతి గోడ మీద చెక్కబడిన శిల్పాలను చూపిస్తూ అన్నాడు. "పాములు మరియు గుండ్రటి ఆకృతి లో ఉన్నాయ్ ఆ శిల్పాలు. ఇక్కడెవో శక్తులున్నాయనే రాళ్ళని ఇలా చెక్కారు. వాటి కోసమే జనాలు ఇక్కడికివచ్చేవారేమో?"
"వాళ్ళకి నచ్చి వచ్చేవారేమో “ ఆవలిస్తూ అన్నాడు సుబ్రహ్మణ్యమ్.
అక్కడినుండి ఇంకో వైపు వెళ్తుండగా వాతావరణం చల్లబడింది. దూరంగా గుడ్లగూబ అరుపులు భయంకరమైన వినపడుతున్నాయి.
రవి అక్కడున్న మర్రి చెట్టు దగ్గర ఆగి ఇలా అన్నాడు, "నాకు ఇక్కడ ఏదో ఉన్నట్లు అనిపిస్తుంది. కళ్ళు మూసుకుంటూ ఊపిరి బిగబట్టి జపిస్తున్నట్టు ఏదో గొణుగుతున్నాడు."
సుబ్రహ్మణ్యం ఉలిక్కిపడి, "ఆత్మలు కనిపించాలంటే ఇలా చేయాలా?" అని అడిగాడు.
రమణ అతన్ని వారిస్తూ, "నువ్వు ఆగరా, వాడి నమ్మకాలూ వాడివి," అన్నాడు.
ఆరిఫ్ తన చేతులని కట్టుకుంటూ, "వాడేమి చేస్తున్నాడో చెప్పనా? ఇక్కడ లేని భయాన్ని దూరం చేసుకుంటున్నాడు," అన్నాడు.
రవి కళ్ళు తెరిచి ఆరిఫ్ వైపు చూశాడు. "నీకు అన్నీ తెలుసు కదా?"
"లేదు," అన్నాడు ఆరిఫ్ ప్రశాంతంగా. "కానీ భయం అనేది బయట ఉన్నదాని కంటే మనలో ఉన్నదాని గురించే ఎక్కువ అని నాకు తెలుసు."
ఆ నలుగురు మెల్లగా వెళ్తూ గుడి మెట్ల మీద కూచున్నారు. పున్నమి చంద్రుడు అప్పుడే బయటికి వస్తున్నాడు, చల్లటి వెన్నెల వెలుగులనిస్తూ.
రవి ఏదో ఆలోచిస్తూ ఇలా అన్నాడు, "నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, ఆరిఫ్. బహుశా భయం మనసులోనే ఉండి ఉండవచ్చు. కానీ మన నమ్మకాల మాటేమిటి? మనము వివరించలేని విషయాల సంగతేమిటి?"
సమాధానం చెప్పే ముందు ఆరిఫ్ ఒక్క క్షణం ఆలోచించాడు. "నమ్మకాలూ ఎల్లపుడు తప్పు కాదు. అవి మూఢనమ్మకాలుగా మారితే తప్ప. మూఢ నమ్మకాలూ మనల్ని ప్రశ్నించకుండా, నేర్చుకోకుండా చేస్తాయి."
రమణ ఇలా అన్నాడు, "అంటే మనం మనకి తోచింది అంగీకరిస్తూనే, అర్థం చేసుకోవటానికి ప్రయత్నించలానా?"
"అవును," అన్నాడు ఆరిఫ్. "మనకు తెలియని దాని గురించి భయపడకూడదు. దాన్ని అన్వేషించి తెలుసుకోవాలి."
సుబ్రహ్మణ్యం అక్కడినుండి లేస్తూ, "పదండి, ఇంకా నేనేదో ప్రశాంతంగా ఎంజాయ్ చేద్దామని వస్తే డిబేట్ చేస్తున్నారు," అన్నాడు.
వారు బయలుదేరడానికి సిద్ధమవుతుండగా, నలుగురి మధ్య ఒక విచిత్రమైన నిశ్శబ్దం ఆవహించింది. ఆరిఫ్ తన స్నేహితుల వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వాడు. ఈ ప్రదేశం లో శక్తులున్నా లేకున్నా, ఇది మాత్రం నా ఫేవరేట్ ప్లేస్ అన్నాడు.
ఈరోజు నుండి నాది కూడా, అన్నాడు సుబ్రహ్మణ్యం.
మాకు కూడా, అని ఒకేసారి రమణ, రవి అన్నారు.
రమణ కారు స్టార్ట్ చేస్తూ మళ్ళీ, ఎపుడు వద్దాం అని అడుగుతున్నాడు. దూరం నుండి ఆ నలుగురిని ఒక నాగుపాము వారినే గమనిస్తూ ఉంది.
Khalil Ganiga
Just another programmer.. This blog expresses my views of various technologies and scenarios I have come across in realtime.
Keep watching this space for more updates.