<KG/>
Stories in the corners III

Stories in the corners III

"రేపు శనివారం, ఈ సారీ అయినా దానవులపాడు వెళ్ళాలి అనుకుంటూ త్వరగా ఆఫీస్ మీటింగ్స్ ముగించుకొని నా ఎం.టి.బి సైకిల్ తీసుకొని శెట్టిపల్లి వైపు వెళ్లే రోడ్డు ఎక్కాను.

(ప్రతి శనివారం తెల్లారుజామునే సైకిల్ తీసుకొని ఒక 35 కిమీ సైక్లింగ్‌కి వెళ్ళడం అలవాటు. వేర్వేరు కారణాల వలన గత మూడు నాలుగు వారాల నుండి సైక్లింగ్ వెళ్ళడానికి కుదరడం లేదు.)

ఈరోజు ఆఫీస్‌లో ఒక మీటింగ్ అనుకున్న సమయం కన్నా ఎక్కువ సాగడం వల్ల కొద్దిగా లేట్ అయ్యి సైకిల్ బయటకు తీసేసరికి 6:30 అయింది. సైక్లింగ్ వెళ్ళలనుకున్న ముందు రోజు అంటే శుక్రవారం సాయంత్రం ప్రాక్టీసులా ఉంటుంది అని 10 కిమీ అలా వెళ్తాను.

సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆకాశం మొత్తం పసుపు గోధుమ రంగులు కలిసి కాంతి అప్పుడే మాయమవుతూ ఉంది. అక్కడక్కడ కొంగలు తమ ఇళ్లకు వెళ్తూ సూర్యకాంతి రంగులో కలిసిపోయి మనోహరంగా కనిపిస్తున్నాయి.

ఫిట్బిట్ వాచ్‌లో సైక్లింగ్ మోడ్ ఆన్ చేసుకుని, ఫోన్‌లో ఇళయరాజా తమిళ్ మెలోడీస్ వింటూ ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ సైకిల్ తొక్కుతున్నాను.

శెట్టిపల్లి పొలిమేర చేరుకునేసరికి సమయం 7:00 అయింది. "ఇంక చాలు, ఇంటికి వెళ్దాం లే," అని సైకిల్‌ను ఆపి వెనక్కి తిప్పాను.

"ఇశ్!" అంటూ ఒక్కసారిగా వెనుక టైరు గాలి మొత్తం పోయింది. చూస్తే కంకర రాయి గుచ్చుకొని ఉంది.

"అబ్బా, మళ్లీ రేపు ప్రోగ్రాం క్యాన్సలేనా?" అనుకుంటూ సైకిల్ దిగి మెల్లిగా నడుచుకుంటూ వస్తున్నాను.

కాకిరేని పల్లెకి వెళ్లే అడ్డదావ దగ్గరికి వచ్చేసరికి రోడ్డు పక్కన చుట్టూ ఆకు రాలిపోయిన చెట్లు. దాని పక్కనున్న సమాధి మీద ఎవరు కూర్చున్నట్టు మసకమసకగా కనబడింది. సమాధి పక్కన దీపం, అగరవత్తులు వెలుగుతున్నాయి. "ఊరోళ్ళు ఎవరయినా పెట్టి ఉండొచ్చులే," అనుకుంటూ నా మానానా నేను వెళ్తున్నాను.

"ఏం బీ! పంచరా? దొర్లించుకొని పోతున్నావే సైకిలు," అని అన్నట్టు వినిపించింది.

నన్నేనా అనుకుంటూ, సైకిల్ హ్యాండిల్ శబ్దం వచ్చిన వైపు తిప్పాను. హ్యాండిల్‌కు ఉన్న ఎమర్జెన్సీ లైట్లో ఒక ముసలాయన తెల్ల పంచ, గళ్ళ చొక్కా వేసుకొని బోరుగులు ఏమో తింటున్నాడు. వయస్సు 65 నుంచి 70 ఏళ్ళు దాకా ఉంటాదేమో.

"అవున్నా . కంకరాయి గుచ్చుకొని వెనక టైరు పంచర్ అయింది," అని చెప్పాను.

"ప్లాట్ లెచ్చల్లే. లారీలన్ని ఇట్నే తిరుగుతుండాయి. తారంత పోయి కంకర బయటికి తేలింది. లేకపోతే బెమ్మాండంగ్గుండేలే రోడ్డు," అని చెప్తూ పిడికిలి నిండా బోరుగులు తీసుకొని నోట్లో వేసుకున్నాడు ముసలాయన.

"అవును. జగన్ ఇళ్లూ ముందర వేస్తున్నారులే. పనంతా అయినాక మల్ల రోడ్డు వేయిచ్చారులే," అని చెప్పాను.

గట్టిగా నవ్వి, "బో, చెప్తాండావే! నువ్వే నా కాంట్రాక్టర్ వి, ఏంది?" అని చెప్పాడు ముసలాయన.

నాకు కొద్దిగా కోపం వచ్చింది. మళ్లీ తామాయించుకుని, "పనులన్నీ అయిపోయినాక కొత్త రోడ్డు వేయకపోయినా ప్యాచ్లు వేస్తారులే," అని చెప్పాను.

"ఎర్రోనీవి మాదిరి ఉండావే. రాజకీయ నాయకులు నీ యాడ నమ్ముతావుబ్బీ. ముందు ఆ ఇళ్ళైన పూర్తి చేస్తారేమో సూడు. రోడ్డు సంగతి దేవుడికి ఎరుక," అన్నాడు.

నేను సాగదీయడం ఇష్టం లేక, "అవును, అది కూడా నిజమే లేన్న," అని చెప్పి, "ఇక వెళ్దాం లే," అన్నట్టు సైకిల్ హ్యాండిల్‌ను రోడ్డు వైపుకు తిప్పాను.

"సైకిల్‌కు ఏంది బీ? నీళ్లబాటల?" అని అడిగాడు ముసలాయన.

"అవునా? ఇయ్యాలనే తాగుతావా?" అంటూ బాటిల్ తీయడానికి అన్నట్టు సైకిల్ స్టాండ్ వేసాను.

"ఫిల్టర్ నీళ్లేనా?" అని అడిగాడు.

"అవును," అని చెప్పాను.

"ఫిల్టర్ నీళ్లు అయితే వద్దులే బీ," అన్నాడు.

నాకు ఒకంత ఆశ్చర్యం వేసింది. "ఫిల్టర్ నీళ్లేనని అడిగి, మళ్లీ వద్దంటాడేంది?" అని.

అది గమనించాడు ఏమో.

చెప్పడం మొదలుపెట్టాడు, "మొదట్లో కొన్ని రోజులు ఇంటికాడికి నీళ్ల ఆటో వస్తంటే పట్టుకొనీ తాగెటోల్లం. ఇగా ఆన్నుంచి ఒళ్ళు నొప్పులు, ఉత్త పప్పు తిన్య గ్యాస్ ట్రబులు. మా యామె ఎట్ట కనుక్కుందొ కనుక్కుంది. ఫిల్టర్ నీళ్లు తాగినప్పటి సంది ఆరోగ్యం బాగుండటం లేదని ఆటో కాడి నీళ్లు పట్టడం మానేసింది."

(నిజమేనేమో! జేజి కూడా ఎపుడు ఫిల్టర్ నీళ్లు తాగిందే లేదు. 106 ఏళ్ళు వచ్చినా కూడా 3 ఫ్లోర్ ఎక్కి దిగితాన్నది. ఇంటికి వెళ్లిన తర్వాత RO ఫిల్టర్ గురించి ఇంటర్నెట్‌లో చూడాలి అనుకున్న.)

"సరేనన్నా," అన్నాను. "వెళ్దాం," అన్నట్లు.

"ఎవరి పిల్లోనివో?" అని అడిగాడు. సంభాషణ పొడిగిస్తూ.

నేను ఫలానా అని చెప్పాను.

"మీ యబ్బ నాకు బాగా తెలుసు బీ. భలే పనిమంతుడు లే. పొద్దున బట్టల మిషను కుట్టేది, రాత్రిళ్ళు గానూగ వేసేది, సేద్యం కూడా మాకు సమానంగా చేసేటోడు. నీకు తెలుసో లేదో ఆయప్ప చింతామణి నాటకం ఏచే యెగబడి సూచన్యం. సూచ్చన్యే అనుకున్య మీ యబ్బ పోలికల మాదిరిగా ఉంటే. అందుకే అడిగిన లే బీ."

(ముసలాయన మాటలు కొంచెం ఆసక్తిగా అనిపించాయి.)

"ఆవున్న. మా జేజీ కూడ చెప్తన్యది మాకు. మా అబ్బ నాటకాలు అయి ఇయి ఏచన్యాడు అని."

సంభాషణను పొడిగిస్తూ నేనే అడిగా, "ఈడ ఎపుడు చూళ్ళేదు మిమ్మల్ని. ఒక్కరే వచ్చినార అని?"

(శేట్టిపల్లి రోడ్డు మీద చాలా మంది సాయింత్రం పూట వాకింగ్‌కు వస్తుంటారు.)

"ఒక్కన్నేమి రాలేదుబీ. వచ్చెపుడు నాతో చాలా మందే వచ్చినారు. తర్వాత అందరూ వెళ్ళిపోయినారు లే వాళ్ల ఇండ్లకి. వెళ్ళిపోవాలి కూడా. మనతో ఎవరు ఉండరు. ఉండాలని కూడా మనం కోరుకోకూడదు. నాక్కూడా ఇక్కడే ఉండలనిపిస్తుంది. ఇక్కడ ప్రశాంతంగా ఉందిలే. నేను కష్టపడి సంపాదించిన భూమి కదా. అట్నె ఉంటదేమో."

(ఆయన మాటలు ఒకింత విచిత్రంగా అనిపించాయి.)

"ఎన్ని ఎకరాలుంది ఉన్న భూమి మీకు?" అని అడిగాను.

"నేను సంపాదించినద.?" అని అడిగాడు.

"ఆ.." అని బదులిచ్చాను.

రోడ్డు అటువైపు ఉన్న బావి వైపు చెయ్యి చూపిస్తూ, "ఆ బావి కానుంచి నేనున్న కాడికి మొత్తం 4 ఎకరాలు కొన్య. కొడుకు గానీ సదువు కోసం 3 ఎకరాలు అమ్మిన. అమ్మేటపుడు మాత్రం ఉద్యోగం రాగానే మళ్లీ భూమి కొందాము అనే కొడుకు. ఇపుడు వాడికి నీ అంత కొడుకు అన్నాడు. ఏకర కాదు కదా, సెంటు కూడా కొనలేదు." అని చెప్పడం ఆపేశాడు. కళ్ళలో నీటి జీర కనపడింది నాకు.

"ఏం ఉద్యోగం చేస్తన్నాడు మీ కొడుకు?" అని అడిగాను.

"అయన్ని నాకు తెలీదు బీ. పెద్ద సదువూ చదవాలా అని దేశాంతరం పోయినాడు. ఆన్య్యే ఉద్యోగం వచ్చింది. ఏదో కంప్యూటర్‌లో నొక్కుతాంటాడు అని ఫోన్లో చూసిన అని మా యామె చెప్పింది. నాతో మాటల్లేవులే."

"మరి ఇంకేం అన్న కొడుకు అమెరికాలో ఉండాడు. బాగా సంపాదించి పంపింటాడే. సెంటు కూడా కొనలేదన్నావ్?" అని అడిగాను.

ఆ ముసలాయన కాస్త నిట్టూర్చి, దూరంగా చూస్తూ చెప్పడం మొదలుపెట్టాడు, "బాగా సంపాదిస్తున్నాడు. ఇపుడు ఉన్న దేశంలోనే ఇల్లు, కార్లు, ఇంగ భూములు అయి ఇయి కొన్నాడు. ఇందాక నువ్ అన్నట్టే మమ్మల్ని సూసినోళ్లు మీకేం లే కొడుకు బంగారు బిస్కెట్లు పంపిస్తన్నాడు అనుకుంటారు. కానీ ఇవన్నీ చూసి నాకెంత ఆనందం కలగాలో అంత బాధ కలుగుతాది. మేము పడే బాధ మాకు మాత్రమే తెలుస్తాది."

"ఇంత బాగా సంపాదిస్తుంటే మీకు ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఉంటాడే. మరి బాధ ఎందుకు?" అని అడిగాను.

"చూసుకుంటున్నాడు అంటే చూసుకుంటున్నాడు బీ. నెలకి 5,000 పంపిస్తాడు, జీతం పంపినట్టు. అది చెప్పడానికి అన్నట్టు నెలకొతూరి ఫోన్ చేసి డబ్బు పంపించా అని చెప్తాడు. అది మా యామె మందులకే సరిపోతాది. సరిపోతాయా? ఇంకా పంపించాలా అని ఒక్కసారైనా అడిగితే ఒట్టు. ఇంతకూ ముందర పించిన వచ్చేది. మేమంటే కడుపు మండినోడు ఎవడో పోయి గోర్మెంట్టోళ్ళకి చెప్పినాడంట మా కొడుకు వేరే దేశంలో ఉన్నాడు మేము లచ్చాదికారులం అని. అది కూడా తీసేసినారు ఇపుడు. లెక్క సంగతి పక్కన బెట్టు, ముసలి మోపును మమ్మల్ని సూసుకోవాలా వద్దా?"

"మీరు ఇంతగా కష్టపడి చదివించి, పెద్ద మనిషిని చేసినారు. అది గుర్తు లేదంటనా?" అని అడిగా.

"ఏం చెప్పాలి బీ? 40 ఏళ్ల ముందు టౌన్‌కి వచ్చి ఏమేం కష్టపడినామో, ఎలా కష్టపడినామో. ఓ 4 ఎకరాలు కొన్యా. అందులో 3 ఎకరాలు వాడి చదువు కోసమే అమ్మితిని. కొడుక్కు చదువు గొప్పదని, డబ్బు గొప్పదని నేనే నేర్పా. కానీ అప్పుడే అర్ధం కాలేదు. మనం ఎదగాలి అంటే బంధాలు కూడా ఎదగాలి అని. డబ్బు సంపాదించడంతో బంధాలు చిన్నవైపోతాయి నాయన. చెప్తే నమ్మవు గాని నా కొడుకు కొడుకు (మనుమడు) పేరు కూడా మాకు తెలీదు. ఒక్కతూరి గూడ ఆ పిలగానితో మాట్లాడియాలా మా వాడు.

ఇప్పుడు 3 ఎకరాల విలువ కంటే 3 నిమిషాల విలువ ఇస్తే చాలు అని అనిపిస్తుంది.

నాకు ఇదంతా అర్థమయ్యింది బీ. మా యామెకె ఇంకా తెలియల్యా. అదే బాధంతా." అని చెప్తూ ఏటో చూస్తున్నాడు.

ఆ చూపుల్లో నిస్సహాయత, వేదన మాత్రమే కాదు, ఒకింత ఎదురు చూపు కూడా ఉంది.

"ఆయన చేయకపోతే ఏమి? మీరే ఫోన్ చేయొచ్చుకదా?" అని అడిగాను.

"నాకు ఫోన్లు గీన్లు చేయడం రాదు బీ. ఆడికి రెండు మూడు సార్లు నీలాంటి పిలగాళ్లు కనపడితే ఫోన్ చేయించిన. నిమిషం కూడా మాట్లాడటానికి టైం లేకపాయ వాడికి. 'ఏమి రా?' అని అడిగితే 'పని కాడ బిజీగ ఉన్నాలే బ్బా' అంటాడు."

ముసలాయన మాటలు వింటుంటే నాకు చాల బాధేసింది. నేనూ ఏమీ చెప్పలేకపోయాను.

అది తనకి అర్థమయ్యింది అనిపించినట్టయింది నాకు. మళ్లీ తానే సంభాషణ మొదలుపెట్టాడు.

"నువ్వు ఏం పని చేస్తావ్ బీ?" అని అడిగాడు.

"నేను కూడా కంప్యూటర్ పనే చేస్తా అన్న." అని చెప్పిన.

"దేశాంతరం పోలేదా? ఆడైతే లెక్క ఎక్కువిస్తారు అంట కదా." అని అడిగాడు.

"ఒకసారి పోయి ఆరునెలలు ఉండి వచ్చినన్న. ఈడ కూడా బాగానే ఉంది లే. అందరితో కలిసి ఉండడం అది." అని చెప్పాను.

"అయితే మళ్లీ వెళ్ళవా?"

"అదైతే తెలీదు. వెళ్తానేమో... చూడాలి కాలం ఎటు తీసుకెళ్తాదో. మన చేతుల్లో ఏముంది?" అని చెప్తుంటే ఇంటి దగ్గరనుండి ఫోన్ వచ్చింది.

"ఎక్కడున్నారు? బాగా లేట్ అయింది. తొందరగా ఇంటికి రండి." అని మా ఆవిడ ఫోన్‌లో చెప్తుంది.

"వస్తున్నాను. తెలిసిన అన్న ఒకాయన కనపడితే మాట్లాడుతున్న," అని చెప్పి ఫోన్ పెట్టేసాను.

"లేట్ అయింది అన్న. మళ్లీ కలుద్దాం. నేను వెళ్తాను," అని చెప్పాను.

"సరే బీ," అని చెప్పి తను కూడా బావి దగ్గరికి వెళ్లడం మొదలెట్టాడు.

నడుచుకుంటూ వెళ్తున్న నాకు ఆ ముసలాయన మాటలే వినపడుతున్నాయి. కొన్నిసార్లు మనం పట్టుకోగలిగే దానికంటే, మనం కోల్పోయేది ఎంతో విలువైనదని మరిచిపోతున్నాము అనిపించింది.

Share

Khalil

Khalil Ganiga

Just another programmer.. This blog expresses my views of various technologies and scenarios I have come across in realtime.

Keep watching this space for more updates.