<KG/>
కాకి గుడ్డు

కాకి గుడ్డు

అమ్మా కొరియర్ అనే సౌండ్ రాగానే పరిగెత్తుకుంటూ వెళ్లి కొరియర్ తీసుకున్నాడు శీను, అందులో వచ్చిన స్మార్ట్ వాచీ ని అక్కకి ఇచ్చేసి అట్టపెట్టె ని తీస్కెళ్లాడు.

కొరియర్ తీసుకొని రారా అని చెప్పినా వెళ్లని వీడేందబ్బా ఈరోజు పరిగెత్తుకుంటూ వెళ్లి తీస్కోచ్చాడు, అట్టపెట్టె తీసుకున్నాడు కదా ఏం చేస్తున్నాడో చూద్దాం అని వెళ్ళింది స్పందన.

ఇంటి వెనుక ఉన్న యాపాకు చెట్టు నుంచి తీసిన బంకతో పాత న్యూస్ పేపర్ ని అంటించడం చూసింది.

ఏంట్రా ఎదో చేస్తున్నావ్ అడిగింది స్పందన.

నీకెందుకు మేఁ .. నేనేందో చేస్కుంటున్నాలే.. పో ఈన్నుంచి..

మ్మోవ్ నీ కొడుకు సైన్టిస్టు అయినాడు దా సూద్దువుగాని అని చెప్పి ఆన్నుంచి వెళ్ళిపోయింది స్పందన..

అవునా.. ఉండు పప్పు తాళింపు పెట్టి వస్తా అని చెప్పింది వంటింట్లో నుంచి శీను వాళ్ళమ్మ.

(ఐదారు నిమిషాల తర్వాత వంటింట్లోనుంచి వచ్చాక.. )

ఏమి చేస్తున్నావు రా .. ఏముంది దాంట్లో ..

కాకి గుడ్డు మా .. చెప్పాడు శీను .

కాకి గుడ్డా .. నీక్యాడ దొరికింది అది.

**యాన్నో ఒకసాట దొరికిందిలే ..**

యీపు పగుల్తాది మర్యాదగా చెప్పు.. యాన్నుంచి యెత్తుకొచ్చినావ్ .. గట్టిగా కసురుకుంది శీను వాళ్ళమ్మ.

నేనేం ఎత్తుకురాలే .. నాకే దొరికింది.

గుడ్డు యాడైన దొరుకుతాదా ? మొహం పగుల్తాది.. ఫస్టు ఇంట్లోనుంచి తీస్కపొయి పాడేయ్ దాన్ని .. ఎవడన్నా దిష్టి తీసి పాడేసింటాడు దాన్ని.. ఇంట్లోకి తీస్కొచ్చి .. మళ్ళా సైన్టిస్టు మాదిరి ఏందో చేస్తున్నాడు .. తిట్టేసినంత పని చేసింది శీను వాళ్ళమ్మ.

దిష్టి తీసింది నేనెందుకు తెస్తా . . రోడ్డు మీదిది కాదులే.

మరి యాడిది రా ..

క్యాచ్ పట్టిన్యాలే . .

ఎం తమాషా జేస్తాండావ .. మీ నాయనా రాని చెప్తా.

నిజమే చెప్తున్నా మా .. పొద్దన కిర్కెట్ ఆడుతాంటే .. కాకి పోత పోత గాలి లో గుడ్డు పెట్టింది దాన్ని నేను క్యాచ్ పట్టినా .

వీడు తిన్నగా ఏది చెప్పాడు అని మనసులో అనుకుంటూ .. ఏమన్న చేస్కొని సావు.. అని చెప్పి ఆన్నుంచి వెళ్ళిపోయింది.

ఆ రోజు నుంచి ఎక్కడికెళ్లినా ఏమి చేస్తున్న ఆ అట్టపెట్టెని జాగ్రత్తగా తనతో పాటే తీసుకెళ్తున్నాడు. పడుకొనే సమయంలో కూడా దిండు పక్కన పెట్టుకొని పడుకుంటున్నాడు.

(3రోజుల తరవాత.. )

ఉదయం టిఫన్ చేసేప్పుడు ఉండబట్టలేక .. ఏముందిరా దాన్లో అంత భద్రంగా చూసుకుంటున్నావ్ . . అడిగాడు శీను వాళ్ళ నాన్న.

కాకి గుడ్డు నాన్న .. అమ్మ జెప్పలేదా ?

ఆఁ జెప్పిందిలే .. గుడ్డు క్యాచ్ పట్టినావని ... క్రికెట్ అకాడమీ లో జెర్పేదా ?

సంతోషంతొ ఒక్కసారిగ మొహం వెలిగింది శీనుది .. సరే నాన్న అన్నాడు .

అవున్రా శీను ఇంతకీ ఏమి జేస్తంది నీ కాకి ఆ బాక్సులో ?

కాకి కాదు డాడీ .. దాని గుడ్డు ..

ఆఁ అదేలే .. ఏమి జేస్తంది?

అదేం జేస్తాది డాడీ.. బైటికి ఎప్పుడు వద్దామా అని ఎదురు చూస్తుంది. కొన్ని రోజులు పోయినాక పొదుగుతాది.

తినడం అయ్యాక అడిగాడు శీను వాళ్ళ నాన్న .. దానికి గాలి ఆడకుండా అట్లా బిర్రుగా సీలు వేసినావే చచ్చిపోతాదేమో చూస్కో.

ఇపుడు దానికి గాలి అవసరం లేదు నాన్న .. అది బైటికి వచ్చాక అవసరం.

నీకెలా తెలుసు అది.. నవ్వాపుకుంటూ అడిగింది స్పందన.

నాక్కాదు తెలియాల్సింది .. దానికి తెలిస్తే చాలు.

(4 రోజుల తర్వాత .. ఒక రోజు రాత్రి భోజనం చేసే సమయం లో బాక్సుకు ఉన్న రంద్రం చూసి )

రే శీనా ఎలుకమే కొరికినట్టుంది చూడు నీ బాక్సుకి.

ఓహ్ అదా .. నేనే వేసినలేమ్మా గాలి ఆడటానికి. నిన్న రాత్రి పిల్ల బైటికి వచ్చింది. మొగ కాకి.

ఓహ్ .. సౌండ్ చేసిందా అది? విన్నావా నువ్వు? క్యూరియస్గ అడిగింది స్పందన

అది కాదు . వాడు . చెప్పా కదా మొగ కాకి అని. ఉహు వినలేదు. వాడు నిశబ్ధంగా ఉన్నాడు.

హ్మ్మ్.. మేము వాణ్ణి చూడొచ్చా ఆ బొక్కలోనుండి ? ఇంతకీ నువ్వు చూసావా?

నాకు తెలుసు వాడేలా ఉన్నాడో. కాకిలానే ఉన్నాడు. ఇపుడే పొదగబడ్డాడు. కొంతకాలం ఒంటరిగా ఉండాలనుకుంటున్నాడు.

సరేలే నువ్వు చూసినావ్ కదా వాడేలా ఉన్నాడో చెప్పు..

వాడు బ్లూ కలర్ లో ఉన్నాడు.. రెక్కలు చాల మెత్తగా ఉన్నాయి.. తోక గోల్డు కలర్ లో మెరుస్తా ఉంది.

ఓహ్ అవునా .. అయితే మేము కూడా చూస్తాం.. అని చెప్పింది స్పందన.

పొమ్మేయ్ నువ్వు ఇన్నుంచి .. చెప్పిన కదా .. వాడికిష్టం లేదని. చీకట్లోనే ఉండాలనుకుంటున్నాడు వాడు.

అది నీకెలా తెలుసు? శీను వాళ్ళమ్మ అడిగింది

కాకులకి చీకటి అంటే ఇష్టం. చెప్పాడు శీను.

(2రోజుల తర్వాత .. )

స్పందనక్క యాడుండవుమే .. ఈ కాకిగాడికి పేరు పెడతండా . గట్టిగ అరుచుకుంటు ఇంట్లోకి వచ్చినాడు శీను.

ఏమి పేరు పెడతన్నావ్ ? హోంవర్క్ చేస్కుంటూ తల కూడా ఎత్తకుండా చెప్పింది స్పందన.

సోనీయాస్టేషన్_ప్లే_5

అదేం పేరురా అలా ఉంది .. నాకు నచ్చలేదు.

వాడికి నచ్చింది లెమ్మేయ్.

స్పందనకి ఏదో గుర్తొచ్చినట్లు .. అవున్రా వాడికి తినడానికి ఎం పెడ్తున్నావ్ రోజు?

చిన్నపుడు కాకులకి ఏమి పెట్టినా తినవు.. రెక్కలు బాగా గట్టి పడ్డాల ముందు..

ఒహ్హ్ .. పెద్దయ్యాక ఏమి పెడ్తవు మళ్ల ..

పెద్దైనాక మనం ఎందుకు పెట్టాలా వాడే ఏదోకటి తెచ్చుకొని తింటాడు.

నువ్వు నీ కాకి గోల .. ఇంగ నువ్వు పో ఇన్నుంచి నేను చదువుకోవల అని చెప్పి మల్లి హోంవర్క్ చేస్కుంటూ కూచుంది.

ఇది జరిగిన 4రోజుల తర్వావతా ఒక ఆదివారం నాడు.. టిఫన్ చేసేప్పుడు శీను బాక్సు తీస్కొని రాలేదు. ఆదివారం చేయాల్సిన పనుల హడావిడిలో పడి ఎవరు అది గమనించలేదు..

సోమవారం అందరూ ఎవరువెళ్లాల్సిన చోటుకి వెళ్ళాక.. శీను వాళ్ళమ్మ ఇల్లు ఊడవడానికి వెళ్ళినపుడు .. బాక్సు మీద ఉన్న న్యూస్ పేపర్ చిరిగి,బాక్స్ పూర్తిగా ఓపెన్ అయి ఉండటం గమనించింది. బాక్స్ లోపల చూస్తే ఖాళి గా ఉంది.

శీను సాయంకాలం స్కూల్ నుంచి వచ్చాక అడిగింది వాళ్ళమ్మ.. శీనా నీ కాకి లేదురా బాక్సులో ..

ఎగిరిపోయింది. (నిరాశగా చెప్పాడు)

ఎలా?

పెద్దవాడయ్యాడు ఎగిరిపోయాడు ..

అయ్యో .. నిజంగానా .. మేమెవరం చూడలేదే .. ఎక్కడికి వెళ్లిఉంటాడంటావ్?

కాకులన్నీ ఉన్న చోటుకే .. జపాన్ కి.

*అయ్యో .. పోనిలే .. ఈ బాక్సుని పడేయమంటావా?*

వద్దు.. STUMPER బాల్ పెట్టుకుంటా ఇందులో అని బాక్సు తీస్కొని తన రూంలోకి వెళ్ళిపోయాడు శీను.

(10 రోజుల తర్వాత శీను పుట్టిన రోజు నాడు... టిఫిన్ చేసేప్పుడు)

రే శీనా .. నిన్న రాత్రి నీ కాకిగాడు వచ్చాడు చూసావా? నీ బాక్సులోనే ఉన్నాడు చూడుపో.. అని చెప్పాడు శీను వాళ్ళ నాన్న .

వాడేందుకు వచ్చాడబ్బా అని తన గది లో ఉన్న బాక్స్ ఓపెన్ చేసి చూసాడు..

Share

Khalil

Khalil Ganiga

Just another programmer.. This blog expresses my views of various technologies and scenarios I have come across in realtime.

Keep watching this space for more updates.