<KG/>
నా కత

నా కత

ఏంది మొదట్లోనే స్పెల్లింగ్ మిస్టేక్ ఇంకేమి ఉంటదిలే అనుకోవద్దు. పేరుకు ఇంజనీర్ అయిన కూడా సదివింది అంత తెలుగు మీడియమే. ఏదో రచయితలంత కాక పోయిన కాస్తో కూస్తో తెలుగు లో రాయగలను. సదువుకుంటా పోతే అర్థమితదిలే ఎందుకు కత అని రాసిన అని.

ఇంటర్ అయ్యేంత వరకు ఏమి పెద్దగ కష్టపడి సదుకోకున్య పరీక్షల్లో మార్కులు బాగానే వస్తన్యాయ్. అలా అని ఫస్టు రాంక్ ఏమి కాదు గానీ రెండో మూడో రాంకు వచ్చేది. సార్లు, టీచర్లు కూడా పిల్లోడు మంచోడు బాగా సదువుతాడు అనుకునేటోళ్లు. వాళ్ళు అనుకున్నట్టే నేను కూడ పెద్దగ అల్లరి గిల్లరి చేసేవాణ్ణి కాదు. స్కూలు, కాలేజీ, ఇల్లు అపుడపుడు కిర్కెట్ ఆడుకొడం అంతే.

ఇంగ ఇంటర్ తర్వాత అందరూ షార్ట్ టర్మ్ కోచింగ్ అని నెల్లూరు పోతంటే అమ్మ కూడా పెద్ద మామ కాడికి పోయి ఐదు వేలు తీసుకొచ్చి నన్ను కూడా రత్నం క్యాంపస్ కి పంపింది. పొద్దనే ఆరు గంటల బస్ ఎక్కి నెల్లూరు పోయిన. ఇంగ ఆడ క్యాంపస్ లో దిగి దిగగానే ఆఫీసు రూమ్ కి పోయి 3500 ఫీసు కట్టేస్తే, అక్కడున్న సారు వాచ్మెన్ కి చెప్పి హాస్టల్ కాడికి పంపించాడు. ఇంతలో మాకు పాలు పోసే సుబ్బాడ్డన్న కొడుకు నేను వచ్చిన అని తెలుసుకొని నన్ను వాళ్ళ రూమ్ కి తీసుకొని పోయి మిగతా రూమ్మేట్స్ ని పరిచయం చేశాడు. కాసేపు మాట్లాడుకున్నాక తనకి క్లాసు కి టైం ఐతంటే , ఫస్టు రోజు కదా హాఫ్ డే కూడా అయిపోయింది, మెటీరియల్ కూడా రేపే ఇస్తారు ఈరోజు రెస్టు తెస్కుకో అని చెప్పి క్లాస్ కు పోయినాడు.

లెస్సన్ 1:

అప్పటిదాకా బాగానే ఉన్నా నేను, వాళ్లు వెళ్ళిపోయాక చుట్టు ఉన్న పరిసరాలను గమనించా, వెలిసిపోయిన సున్నం, చీలికలు వచ్చిన గోడలు, తిరగాల వద్ద అని తిరుగుతున్న ఫ్యాను, గవర్నమెంటు హాస్పిటల్ లో ఉండే ఇనుప మంచాలు, స్విచ్చులు లేని స్విచ్ బోర్డు, ఇంకాసేపట్లో ఆగిపోతుంది అన్నట్లు వెలుగుతున్న లైటు,ఒక గ్లాసు, ఒక కంచం, పాతకాలం ఇనుప రేకు ట్రంకు పెట్టెలు చూసేసరికి ఒక్కసారిగా నిస్సత్తువ వచ్చేసింది.

ఆ రోజు రాత్రి ఏవేవో కలలు, కలత నిద్రతో రోజు ముగిసింది. తర్వాత రోజు పొద్దున్నే 6 కల్ల రెడీ అయి క్లాస్ కి పోయిన, క్లాస్ లో 150 మంది ఉంటారనుకుంటా, క్లాసు మద్య లో కూచున్న కూడ ఆయప్ప చెప్పేది వినపడదు,పైగా ఇంగ్లీష్ లో చెప్తున్నాడు, మనమా తెలుగు మీడియం ఐపాయ్, ఒక్క ముక్క కూడా ఎక్కడం ల్యా . మంచి నీళ్ల చెరువు నుండి ఉప్పు నీళ్ల సముద్రం లో పడ్డ చాప పిల్ల పరిస్థితీ నాది .

అప్పుడు స్టార్ట్ అయ్యింది, ఇంగ వెళ్లి పోదాం అని. లంచ్ బ్రేక్ లో అన్న కి ఫోన్ చేసి చెప్పేసిన, నా వల్ల అవడం లేదు, ఏమి అర్ధం కావడం లేదని. కొన్ని రోజులు ఉండు రా అన్నాకూడా వినలేదు, ఈవెనింగ్ బ్రేక్ లో కూడా మళ్ళీ ఫోన్ చేసి అదే ఏడుపు. నా బాధ చూడలేక సరే వచ్చేయ్ అన్నాడు. ఆ మాట విని, ఇంక రేపు వెళ్లిపోవడం అని ఫిక్స్ అయి ఫ్యాను వైపు చూసి రేపు నేకు బై చెప్తా అని హ్యాపీగా పడుకున్న.

తర్వాతి రోజు పొద్దున్నే ఆఫీసు రూమ్ కి పోయి సార్ నాకు హెల్తు బాగా లేదు, నా ఫీజు ఇచ్చేయండి వెళ్లిపోతా అని బిర్రుగ చెప్పిన,అక్కడున్న సారు గాడు తల కూడా ఎత్తకుండా ఫీజు రిటర్న్ ఇవ్వం, వెళ్లి పోవాలనుకుంటే చెప్పు గేట్ పాస్ సైన్ చేసి ఇస్తా అన్నాడు. ఒక్క రోజే అయింది నేను వచ్చి కావాలంటే ఒక్క రోజుకి ఎంత అయితదో కట్ చేసుకుని ఇవ్వమన్న ఇన్ల్యా , అన్న కి మళ్ళీ ఫోన్ చేసి చెప్పిన వాడు లెక్క ఈయనంటున్నాడు అని. పాపం అన్న ఎవరెవరికో ఫోన్ చేసి చెప్పించిన ఆ సార్ గాడు ఇన్ల్యా.లాస్టు కి కావాలంటే 1 వారం హోమ్ సిక్ అని ఇంటికి వెళ్లి రా అన్నాడు. సరే అని చెప్పి ఇంటికి వచ్చేసిన 3 రోజుల కే.

ఇంటికి వెళ్ళాక అమ్మ నా పరిస్థితి చూసి వద్దులే నాన్న ఇంక వెళ్ళద్ధు, ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అవ్వు అనింది. ఇంట్లో ఒక వారం ఉండి, మళ్ళీ పోయిన, లెక్క వెస్ట్ ఐతాదని . అప్పట్లో మూడు వేలు అంటే చాలా పెద్ద లెక్క .

రూమ్ లో ఉన్న ఫ్యాను, నన్ను చూసి వెక్కిరించినట్టు ఎక్కువ శబ్దంతో తిరుగుతుంది, బై అన్నవ్ మళ్ళీ వచ్చినావ్ కదా అని. దాని వైపు చూడకుండా పడ్కున్న.

పొద్దున క్లాస్ కి పోవడం, మూకి సినిమా చూసినట్టు లెక్చరర్స్ ని చూడటం, స్టడీ టైం లో ఇంటి గురించి ఆలోచించడం తర్వాతి 3రోజులు ఇదే స్టోరీ. 4 రోజు దాదావల్లి క్యాంపస్ గోడ దూకి బైటికి పోయే మార్గం చూసినాడు, ఇంకెంది నెక్స్ట్ రోజు ప్లాన్ అమలు. స్టడీ టైం లో టాయ్లెట్ అని చెప్పి గోడ దూకి బైటికి పోయిది . ఒక 2hours బైట తిరిగి మళ్ళీ ఏమి తెలీదన్నట్టు స్టడీ లో కూచున్నయెది .

బైట ఉన్నపుడు అంత బాగానే ఉంది, క్యాంపస్ లో ఎంటర్ అవగానే ఏదో దెయ్యం పట్టినట్టు, అవే ఆలోచనలు వెళ్లిపోవాలని. 5రోజులు అలానే జరిగింది. స్టడీ టైం లో గోడ దూకడం,రాగానే ఇంటికి వెళ్లిపోవాలి అనుకోవడం. మొత్తానికి దెయ్యమే గెలిచింది. గట్టిగా ఫిక్స్ అయి ఇంటికి వెళ్లిపోయిన. కరెక్టుగా గ 12 రోజులు ఉండి ఇంటికి వచ్చేసాను.

ఇంటికి వచ్చాక ప్రిపర్ అవుదామా వద్దా అని డైాలమ, 30 రోజులు ఉండలేక పోయాను, ఇంజినీరింగు 4యేళ్లు యాడ బైట ఉంటాయి అని, బాగా ప్రిపేర్ అయి ఎగ్జామ్ రాసి రాంకు వస్తే సిటీ కి పోవాలి. ఏదోక రాంక్ వస్తె అపుడు చూద్దాం లే అని ఏదో అలా అలా ప్రిపేర్ అయ్యాను. నేను వచ్చిన 18days తర్వాత క్యాంపస్ లో ఎవరో స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు అని అందరినీ పంపించేశారు. తర్వాత కొన్ని రోజులు తర్వాత కడప కి వెళ్లి ఏంసెట్ రాసి వచ్చా. అదెందో గానీ అంతంత మాత్రం చదివిన, మిగతా వాళ్ళు అంటే క్యాంపస్ లో చాలా రోజులు ఉన్న వాళ్ల కంటే బాగానే వచ్చింది. అప్పటి వరకు ఎపుడు బైటికి వెళ్లని నేను, సడెన్ గా అందరినీ వదిలి హాస్టల్ కి వెళ్ళడం అనేది నాకు కంఫర్ట్ జోన్ నుంచి బైటికి వచ్చినట్లు అనిపించింది.

నా మొదటి రియలైజేషన్, కంఫర్ట్ జోన్ అంటే నీకు నువ్వే ఒక పంజరం తయారు చేసుకొని అందులోకి వెళ్లి లాక్ చేస్కొని కీ నీ పడేసు కోవడం లాంటిది. పంజరంలో ఉంటూ, బయటి ప్రపంచాన్ని చూస్తూ కీ పడిపోయింది అని నీకు నువ్వు విక్టిమ్ లాగా ఊహించుకొని, నీతో ఉన్నవాళ్ళ నీ కూడా భాధ పెట్టటం.

లెస్సన్ 2

ఎంసెట్ అయితే రాశా కానీ డిగ్రీ జాయిన్ అవ్వలా లేదా ఇంజినీరింగు అనే డైలమా. డిగ్రీ జాయిన్ అయితే హాఫ్ డే కాలేజ్ మిగతా హాఫ్ డే ఏమి చేయాలో తెలీదు. మా ఊర్లో ఉన్న డిగ్రీ కాలేజెస్ అన్ని ఇంటర్మీడియేట్ కాలేజ్ లాగే ఉంటాయి. లైట్ అని చెప్పి మనకు వచ్చిన రాంకు కి సిటీ కి వెళ్లి చదువుకునే సీన్ లేదు, ఇక్కడే చూద్దాం లే. అన్న కూడా ఇక్కడే చదివాడు మనకేం భయం ప్లస్ ఇంట్లోనే ఉండొచ్చు.సిటీ కి వెళ్తే క్యాంపస్ లో జాబ్ వస్తది కదా అంటే ఇక్కడ ఉండి బాగా చదివితే జాబ్ ఎలా అయిన వస్తది కదా నాకు నేను సర్ది చెప్పుకున్న. లోలోపల ఇంటికి నుంచి దూరంగా ఎక్కడ ఉండలిసి వస్తుందో అనే భయం తో .

కౌన్సిలింగ్ కి వెళ్ళే వరకూ రోజు ఇదే ఆలోచన, ఇక్కడ ఉండాలా వేరే సిటీ కీ పోవల అని. కౌన్సిలింగ్ ముందు రోజు వరకు కూడా EEE బ్రాంచ్ జాయిన్ అవుదాం అనుకున్న ఎందుకంటే నాకొచ్చిన రాంకు కి అది తప్ప వేరే బ్రాంచ్ రాదు అని నాకు తెలుసు. కానీ లోపల మాత్రం ECE బ్రాంచ్ వస్తే సూపర్ ఉంటాది కదా అనుకున్నా. ఆ రోజు రాత్రంతా ECE గురించి అలోచించి పడుకున్న. నెక్స్ట్ డే కడప కి వెళ్ళాం సీట్ అలాట్మెంట్ కోసం అన్న కూడా వచ్చినాడు. బస్సు ఎక్కాక , "ఏ సీట్ తీసుకోవాలా "అని అన్నని అడిగా , నీ ఇష్టం రా అన్నాడు. అయితే నీ లాగే EEE తీసుకుంటా అని చెప్పా . కౌన్సిలింగ్ సెంటర్ లో కూచున్న తర్వాత అక్కడి సార్ నీ అడిగా సార్ వాగ్దేవి కాలేజ్ లో ECE బ్రాంచ్ ఉంటే ఇవ్వండి అని. ఆయప్పా ఏమో వేరే కాలేజీ లు ఏమైనా చూస్తావా అని అడిగాడు, వద్దు సార్ వాగ్దేవి ECE ఇచ్చేయండి అని చెప్పి సీట్ అల్లోట్ చేసుకొని వచ్చేశాం. వెళ్ళెపుడూ అన్న అడిగాడు EEE అని చెప్పి ECE ఎందుకు తెస్కున్నవ్ అని, నేను సమాధానం ఇవ్వక ముందే ఆ నీలాంటోళ్ళు అందరూ ఆ ECE lone ఉంటారు లే అని చెప్పాడు, అప్పడు అర్ధం కాలేదు కానీ ఇంజినీరింగ్ అయిపోయాక అర్ధం అయింది ఎందుకు అని 😂😂😂.

అలా కొన్ని రోజుల తర్వాత ఇంజినీరింగ్ జాయిన్ అయ్యాను. నీ లైఫ్ లో ఒక బోరింగ్ టైం నీ తీసెయ్ అని అడిగితే ఇంజినీరింగ్ చదివిన నాలుగేళ్లు అంటా . ఇంటర్మీడియట్ కాలేజెస్ కంటే ఘోరంగా ఉండేది. మార్నింగ్ పోవడం ఈవెనింగ్ రావడం, నేను జాయిన్ ఒక నెలకి happy days సినిమా వచ్చింది. ఆ మూవీ చూసాక రీల్ లైఫ్ కి రియల్ లైఫ్ కి నక్క కి నాగ లోకానికున్నంత తేడా ఉందని అర్థమైంది.

ఇంగ నాలుగేళ్లు జర్ అని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తా, ఎదో అయింది అంటే అయింది అన్నట్టు ఇంజినీరింగ్ పాస్ అయినట్టు సర్టిఫికెట్ వచ్చింది. ఇంజినీరింగ్ అయింది,ఇంగ తర్వాతేందో ఏమి చేయాలో తెలీదు.. నా క్లాస్మేట్స్ చాలా మంది సర్టిఫికెట్స్ రాక మునుపే హైద్రాబాదు వెళ్లి కోడింగ్ చేయాలనుకునేటోళ్లు జావా .నెట్ అని , కోడింగ్ వద్దనుకునేటోళ్లు టెస్టింగ్ కోర్సులు జాయిన్ అయ్యారు. ఇంకొంతమంది బ్యాంక్ జాబ్ కొట్టాలి అని నంద్యాల కోచింగ్ కి వెళ్ళారు. ఒక 10 మందేమో బెంగుళూరు వెళ్లి జాబ్ ట్రయల్స్ కీ వెళ్ళారు.

నేను మాత్రం తీరిగ్గా సర్టిఫికెట్స్ వచ్చాక చూద్దాంలే అని టీవీ చూస్కుంటా కూచిన్యా . అలా ఒక 3 నెలలు గడిచిన తర్వాత ఏదో గుర్తొచ్చినట్లు నేను కూడా బెంగళూర్ పోయి జాబ్ చుస్కుంటా అని అన్నతొ చెప్తే , శ్రీను అన్న రూమ్ కి పొ అన్న కూడా జాబ్ ట్రైల్స్ లో ఉన్నాడు అన్నాడు . సరే అని చెప్పి, పోయిన బెంగళూరు కి, ఆడికి పోయినాక చూస్తే ఒక చిన్న రూమ్ అందులో అప్పటికే 5మంది ఉండే వాళ్లు ఎవరికి జాబ్ లేదు, గట్టిగా చెప్పాలంటే ఆ అపార్మెంట్ మొత్తం లో ఎవరికి జాబ్ లేదు అందరూ ట్రయల్స్ వేస్తున్నారు.

రూమ్ లో ఒక డెస్క్టాప్ కంప్యూటర్ ఉండేది aircel సిమ్ 2g ఇంటర్నెట్ తొ. ఆ రూమ్ చూసాక నాకు రత్నం క్యాంపస్ హాస్టల్ రూమ్ గుర్తొచ్చింది .

రూమ్ లో ట్యూబ్ లైట్ ఉండేది ,పాపం చాలా మంచిది, వీళ్లకి జాబ్ లేదు ఎక్కువ కరెంటు బిల్ రాకూడదు అని జీరో బల్బు లాగా తక్కువ లైటింగ్ ఇచి తక్కువ కరెంట్ బిల్ వచ్చేలా చేసేది. ఒక ఫ్యాను కూడా ఉండేది , దాని స్విచ్ ఏదో కూడా ఎవరికి గుర్తు ఉండదు ఎందుకంటే వేయాల్సిన అవసరం రాలేదంటే నమ్మరు.ఇంగ ఒక చిన్న గ్యాస్ స్టవ్ ఉండేది దాని మీద రైస్ ఒక్కటే వన్డే వాళ్ళు.

ఇంక నాకు బెడ్ బగ్స్ అనే ఒక జాతి ఉంది అని తెలుసుకున్న సమయం అది. అక్కడికి వెళ్ళిన మొదటి రోజు ఏమి అర్ధం కాలేదు బాగానే పడుకున్న, నెక్స్ట్ డే పొద్దున్నుంచే దండయాత్ర, ఏవో కుడుతున్నై, బాగా దురద వేస్తుంది. 3 రోజుల తరువాత తెలిసింది వాటిని నల్లులు అంటారు అని. 7 రోజుల తర్వాత నా వల్ల కాక సిట్రిజెన్ టాబ్లెట్ వేసుకుని పడుకునేవాణ్ణి . (అదేంటో తెలీదు ఇప్పటికీ దోమలు కి నల్లుల కి నేనంటే బాగా ఇష్టం, నేను ఎక్కడుంటే అక్కడికి ఐ వన్నా ఫాలో ఫాలో యు అని వచ్చేస్తాయి.)

అలా రోజులు గడుస్తున్నాయి, జాబ్ ట్రయల్స్ కి వస్తె ముందు రోజు రాత్రి జాబ్ పోర్టల్స్ లో ఏమైనా వాఁకిన్స్ ఉన్నాయా అని చూసుకుని అడ్రస్ నోట్ చేసుకుని నెక్స్ట్ డే ఉదయాన్నే డే పాస్ తీసుకుని ఇంటర్వూస్ కి అటెండ్ అవడం.

జాతర కి, సంత కి వస్తారుగా అలా వస్తారు రెస్యూములూ పట్టుకొని. చాలాసార్లు రిటన్ టెస్ట్ రాసి బైటికి వచ్చేసరికే సాయంత్రం అయేది. కొన్ని కంపెనీలు అయితే అంత మంది నీ చూసాక రెస్యుము తీసుకుని మేమె కాల్ చేస్తాం అనే వాళ్ళు. ఆ టైం లో యాడ చుసిన చూసిన టక్ చేస్కొని సర్టిఫికెట్స్ ఫైల్స్ తొ కనపడేవాళ్లు.అదేందో అంటారు కదా ,నేను జాబ్ కోసం చూస్తున్న కాబట్టి నాకు అందరు జాబ్ కోసం చూసేవాళ్ళే కనపడేవారు. అప్పటి నుంచి ఎక్కువ మంది జనాలు ఉన్న ప్లేసెస్ కి వెళ్ళాలి అంటే విరక్తి వచ్చేసింది.

అలా కొన్ని రోజుల తరవాత టాలెంట్ స్ప్రింట్ గురించి తెలిసి అక్కడికి వెళ్లి జాయిన్ అయ్యా, ఆడైతే 3 నెలల్లో కోర్స్ నేర్పించి ప్లేసెమెంట్స్ చూపిస్తారు అని. మధ్య మధ్య లో ఇంటర్వూస్ కూడా అటెండ్ అయ్యేవాణ్ణి. 3నెలల కోర్సు కాస్త 5నెలలు అయింది, జాబ్ ఏమో రావడం లేదు . ఒక పక్క భయం, ఒక పక్క నిరాశ. చాల ఇంటర్వూస్ లో లాస్ట్ రౌండు దాక పోయిన జాబ్ వచ్చేది కాదు.

అలా రోజులు గడుస్తున్నాయి, సడన్ గ ఒక రోజు ఇమెయిల్ వచ్చింది Accenture రిటన్ టెస్ట్ కి రమ్మని. సరే అని వెళ్ళాను , అక్కడేమో కోడింగ్ టెస్ట్ పెట్టారు 5ప్రోగ్రామ్స్ ఇచ్చి రాయమన్నారు. మాములుగా అయితే ఫ్రెషర్స్ కి ఆప్టిట్యూడ్ టెస్ట్ పెడతారు కదా ఇక్కడేమో ప్రోగ్రామ్స్ ఇచ్చారు . ఏదైతే ఏముంది లే , మనకు ఎమన్నా రాదా అని ఎక్సమ్ రాసా.

స్వతహాగా మనకు హెల్పింగ్ నేచర్ ఎక్కువ కదా, నా పక్కనోడికి కూడా చూపించ నా ఆన్సర్ షీట్. 3డేస్ తర్వాత రిజల్ట్స్ వచ్చాయి, డౌట్ లేకుండా నా పక్కన కూచున్నోడు సెలెక్ట్ అయ్యాడు, ఇపుడు ట్విస్ట్ ఏందీ అంటే లిస్ట్ లో నా పేరు లేదు. నవ్వాలో ఏడ్వాలో తెలీని పరిస్థితి.

కొంచెం స్వార్దంగా అలోచించి టాలెంట్ స్ప్రింట్ వాళ్ళకి కాల్ చేసి అడిగా లిస్ట్ లో నా నేమ్ ఎందుకు లేదు అని. నువ్వు సరిగా రాయలేదు అందుకే నే నీ నేమ్ లేదు అన్నారు, నేను సరిగా రాయకపోతే నా పక్కన కూచున్నోడు కూడా అవ్వకూడదు కదా అని చెప్పా. సో అయితే నువు నీ పక్కనోడికి చుపించావ్ నీదే తప్పు అని కాల్ కట్ చేసారు. ఇది కూడా పోయిందిలే అని వదిలేసా. ఒక 2నెలల తర్వాత Accenture ఇంటర్వ్యూ కి రమ్మని ఇమెయిల్ వచ్చింది, ఇది పోయింది కదా మల్లి ఎందుకు వచ్చిందా అని మల్లి ఇమెయిల్ చదివా, నాకే వచ్చింది అని కంఫర్మ్ చేసుకున్న. అపుడే అనుకున్న ఇది మాత్రం నాకు కచ్చితంగా రావాలి , ఏది ఏమైనా ఈసారి మాత్రం వదులుకోకూడదు అని గట్టిగ ఫిక్స్ అయ్యా.

అది సంక్రాంత్రి టైము , హైదరాబాద్ పోయి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి . బస్సు టికెట్స్ దేన్లోనూ దొరకలా, డ్రైవర్ పక్కన కూచుని పోదాం అన్న కుదరలా. లాస్ట్ కి ఎర్రగుంట్ల పోయి జనరల్ టికెట్ తీస్కుని రైలు ఎక్కినా.

అదేదో మీమ్ పేజీలో చూపించినట్టు ఎటు చూసిన జనాలే జనాలు. రైలు ఏ పొజిషన్ లో ఎక్కానో అదే పొజిషన్ లో దిగా . 10 గంటలు ఒకటే పోజు(గిన్నిస్ బుక్ వాళ్లకు చెప్పుంటే అవార్డు ఇచ్చేవాళ్ళేమో). ఇంటర్వ్యూ ఏమో గచ్చిబౌలిటీ నేను రైలు దిగింది కాచిగూడ , లేటు అవుతాదేమో అని తొందర తొందరగా ఏమి తినకుండా వెళ్ళిపోయా.

దేవుడి దయ వాళ్ళ కరెక్ట్ టైం కి పోయిన, రెస్యూమ్ ఇచ్చి కూచున్న. 11 అయింది ఒక పక్క ఆకలవుతుంది, తినడానికి పోతే అదే టైం లో పిలిస్తే ఛాన్స్ పోతాడేమో అని అలానే కూచున్న. 11 కాస్త 4అయింది, సరేలే ఏమైనా తిని వద్దాం అని లేచే టైం లో పిలిచారు.

లోపలి వెళ్ళాక అశోక్ సర్ ఎదో ఇమెయిల్ టైపు చేస్తు 5 నిముషాలు కూచో అన్నారు, 5నిముషాలు ఏందీ రాత్రంతా కూచుంటా జాబ్ కంఫర్మ్ చేస్తా అంటే అని మనసులో అనుకుని స్యూర్ సర్ అన్నా. ఆయనేమో 4 క్వశ్చన్స్ అడిగి ఐ ఆమ్ డన్, యు కాన్ వెయిట్ అవుట్ సైడ్ అన్నారు. ఇది కూడా పొయే అనుకుని ఇంటికి వెళ్ళిపోదాం అని బ్యాగ్ తీసుకుంటున్న టైం లో మళ్ళీ పిలిచారు నెక్స్ట్ రౌండ్ అని ,

ఆ మనల్ని ఉండదు లే అనుకున్న 4క్వశ్చన్స్ అడిగి నెక్స్ట్ రౌండ్ కి ఎవరు పిలుస్తారు మన భ్రమ కాకపోతే అనుకున్న. మళ్ళీ నేను అన్ని కర్రెక్టుగా చెప్పా కదా అందుకే పిలుస్తాండరేమో సర్లే చూద్దాం పద అని లోపలి పోయా. రొటీన్, టెల్ మీ అబౌట్ యూర్సెల్ఫ్ లాంటి 2, 3 క్వశ్చన్స్ అడిగి యు కాన్ లీవ్ ఫర్ ది డే అన్నారు.

బైటికి వచ్చాక బండి మీద పునుగులు వేస్తుంటే ఒక ప్లేట్ తినేసి కాచిగూడ వెళ్లి రైలెక్కా ఎవరితొహ్ ఏమి మాట్లాడకుండా. ఇంటికి వచ్చాక నెక్స్ట్ డే ఫుల్ డే రెస్టు తీస్కుని, సాయంత్రం అన్న తొ మాట్లాడుతూ ఇంకా నేను జాబ్ సెర్చ్ మానేసి ఎం.టెక్ జాయిన్ అవుతా, పార్లల్ గ టీచింగ్ చేస్తా అనే చెప్పే టైం లో టంగ్ అని నోటిఫికేషన్ వచ్చింది. కంగ్రాట్యులేషన్స్ యు అర్ సెలెక్టెడ్ ఫర్ .. .. కంప్లీట్ చేయకుండానే అన్న కి ఫోన్ ఇచ్చి నువ్వు చూడు అని. కొంచెం డ్రామా అనిపిస్తుందా, కొంచెం కాదు చాలానే డ్రామా. ఇలాంటివి సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా అపుడపుడు జరుగుతాయి. సినిమాలు కూడా రియల్ లైఫ్ నుండి ఇన్స్పిరె అయినవే కదా.

మా అన్న కంప్లీట్ గ 2 టైమ్స్ ఇమెయిల్ చదివి, మా మనోడు సంపినాడు జాబ్ వచ్చేసింది వీడికి అని అమ్మ కి చెప్పాడు. సంతోషానికి నిర్వచనం ఏంటి అని నన్ను ఎవరైనా అడిగితె, ఆ రోజు నేను అమ్మ , అన్న కళ్ళలో చూసిన ఆనందం అని చెప్తా . ప్రపంచం లో ఉన్నంత డబ్బు ఖర్చు చేసిన అది రిపీట్ అవదు.

నా రెండవ రియలైజేషన్:

ది అల్కెమిస్ట్ లో Paul Coelho చెప్పినట్టు, మనం ఏదయినా కావాలని గట్టిగ నమ్మినపుడు ఎన్ని అవాంతరాలు, కష్టాలు వచ్చిన మనం అనుకున్నది సాధించడానికి మన చుట్టూ ఉన్న ప్రకృతి కూడా సహాయం చేస్తుంది.

వార్ని చాలా ఎక్కువ రాసేసిన, ఇంగ ఉన్నాయి కతలు. మళ్ళీ ఎపుడైనా బుద్దిపుడ్తే రాస్త.

Share

Khalil

Khalil Ganiga

Just another programmer.. This blog expresses my views of various technologies and scenarios I have come across in realtime.

Keep watching this space for more updates.