సరిపోదు శనివారం
కోవిడ్ పుణ్యమా అని, వర్క్ ఫ్రం హోం ఉండటంతో, శనివారపు చల్లటి సాయంత్రాలని నా చుట్టూ ఉన్న పరిసరాలని గమనిస్తూ ఆనందంగా గడిపేయడం అలవాటయింది. ఆ సాయం సమయాల్లో బయటికి ఎక్కడికి వెళ్లకుండా, మా ఇంటి టెర్రస్ మీద, వాలు కుర్చీలో కూర్చుని,కాళ్ళని ఏటవాలుగా రైలింగ్ గోడమీద పెట్టి, Sennheiser హెడ్సెట్ లో, అమెజాన్ మ్యూజిక్ నుండి స్ట్రీమ్ అవుతున్న ఇళయరాజా పాటలని మంద్ర స్వరంలో వింటూ, కృష్ణ తులసి ఆకులతో చేసిన గ్రీన్ టీ ని తాగుతూ, సూర్యాస్తమయపు అందాలని చూస్తూ గడిపేయడం మనసుకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
మా ఇంటి నుండి నేరుగా ఒక 500 మీటర్స్ దూరంలో RCM చర్చ్ ఉంటుంది. సాయంత్రం ఐదున్నర నుండి ఆరు గంటల మధ్యలో సూర్యకిరణాలు 320 డిగ్రీల కోణంలో బంగారు వర్ణంలో ఉండి నీలిరంగులో ఉన్న గుండ్రటి చర్చి గోపురం మీద పడతాయి. ఆ దృశ్యం చూడటానికి చాలా బాగుంటుంది. ఆల్బిడో ఎఫెక్ట్ వల్ల లైట్ కలర్ ఉపరితలం మీద సూర్యకాంతి పడినప్పుడు చాలా ప్రకాశంగా ఉండి స్పష్టమైన రూపం కనబడుతుంది. ఇక్కడ రౌండెడ్ షేపులో ఉన్న చర్చి గోపురం సూర్యకాంతిని వివిధ దిశలలో ప్రాజెక్ట్ చేయడం వల్ల ఆ దృశ్యం ఐఫీస్ట్ లాగా ఉంటుంది. అప్పుడెప్పుడో చదివినట్టు గుర్తు కలర్స్ మనుషుల భావోద్వేగాలని ప్రభావితం చేస్తాయని, గోల్డ్ కలర్ సూర్యకాంతి బ్లూ కలర్ తో మిక్స్ అవ్వడం వలన మనసుకు చాలా ప్రశాంతత మరియు ఉత్తేజాన్ని ఇస్తుంది.
చర్చి దగ్గర నుండి కొద్ది అడుగులు ముందుకు వేసి గ్రౌండ్లో ఒక మూలన చూసినప్పుడు, ఎన్నో ఏళ్ల నుండి ఒకే చోట అలసట విసుగు అనేదే లేకుండా నిలబడి ఉన్న ఒక పెద్ద వేప చెట్టు కనబడుతుంది. దూరం నుండి దాని దట్టమైన కొమ్మలని చూసినప్పుడు, అదే పనిగా చాలా శ్రద్ధగా కత్తిరించినట్టు చాలాసార్లు హృదయాకారంలో, కొన్నిసార్లు దానా తింటున్న కోడి ఆకారంలో కనబడుతుంది. మన ఇమాజినేషన్ ని బట్టి మనం ఎలా ఊహించుకుంటే అలా కనబడుతుంది. ఒక్కోసారి అనిపిస్తుంది ఆ చెట్టు కింద కాసేపు కళ్ళు మూసుకొని,
అది చిన్న విత్తు నుండి పెద్ద చెట్టు అవడంలో అది చేసిన జీవన సంఘర్షణ,ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు పడిపోకుండా దాని వేర్లు భూమితో చేసిన సహవాసం గురించి, అక్కడి గాలి మరిచిపోయిన కథలని ,దానిమీద కూర్చుని మాట్లాడుకునే పక్షుల రహస్యాలని,ఒకప్పుడు అక్కడ ఆడుకున్న పిల్లల నవ్వులని దాని కొమ్మల్లో చిక్కబడనంతవరకు గాలిపటం ఆకాశంలో చేసిన ప్రయాణం గురించి వినాలనిపిస్తుంది.
నాకు ఇంకా గుర్తు మా పొలానికి ఎరువు లాగా ఇంకా పురుగు పట్టకుండా ఉండటానికి వేపచెక్క తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టేవారు, అది భరించలేనంత చేదు వాసనతో చిరాకు వచ్చి, అరిచేసేవాడిని. వేప చెట్టు గురించి అలా అనకూడదు, దానివల్ల అంతా మంచే జరుగుతుంది. ఎప్పుడూ ఇతరులకి మంచి చేసే వాటి గురించి చెడుగా చెప్పడం, కోప్పడడం చేయకూడదు అని చెప్తుండేది మా నాయనమ్మ. వేప చెట్టు మీద ఎప్పుడు దేవతలు కూర్చొని ఉంటారు వాళ్లు దాని వైపు నుండి వెళ్లే బాటసారులకు రక్షణగా మరియు మార్గదర్శనం చేస్తారని కూడా చెప్తుండేది.
వేప చెట్టు నుంచి కొద్దిగా కుడి వైపుకు వచ్చి పైకి చూస్తే ఆకాశాన్ని తాకుదామా అన్నట్లు రెడ్ అండ్ వైట్ కలర్ లో ఎత్తుగా టెలిఫోన్ టవర్ ఉంటుంది. సరిగా గుర్తు లేదు కానీ నేను అనుకోవడం నేను ఫోర్త్ క్లాస్ లో ఉన్నప్పుడు అది కట్టడం స్టార్ట్ చేసి ఉంటారు. దాదాపు ఆరు నెలలు టైం పట్టింది అది పూర్తి అవ్వడానికి. అతిశయోక్తి కాదు కానీ నాకు ఊహ తెలిసినప్పుడు మొదటిసారిగా తెలుసుకోవాలనుకున్న విషయం ఏంటిది అంటే, ఎందుకని ఆ టవర్ రెడ్ అండ్ వైట్ కలర్ తో పెయింట్ చేశారని. ఆ టైంలో ఇంటర్నెట్ అంతగా లేకపోవడం వలన అనుకుంటా ఎవరిని అడిగినా కరెక్ట్ గా సమాధానం ఇచ్చేవారు కాదు. నేను బీటెక్ జాయిన్ అయ్యాక తెలిసింది అలా పెయింట్ చేయడం వెనుక ఉన్న కారణం, రెడ్ అండ్ వైట్ కలర్ కి విజిబిలిటీ చాలా ఎక్కువ దానివల్ల పైలెట్ కి సులభంగా కనిపిస్తూ ఏరోప్లేన్ సేఫ్టీకి సహాయపడతాయి. టవర్ కట్టడం పూర్తయిన కొత్తలో అనుకుంటా ఒకసారి ఒక విమానం అతి తక్కువ ఎత్తులో టవర్ కి అతి దగ్గరగా దానికి తగులుతుందేమో అన్నట్లు వెళ్ళింది. పొరపాటున కూడా అది తగిలి క్రాష్ అయ్యుంటే మా వీధిలో కూడా దాని శకలాలు పడి ఉండేవి. ఆ సంఘటన గురించి పిల్లలుగా ఉన్న మేము వారం పది రోజులు మాట్లాడుకున్నాం. పున్నమి రోజు చీకట్లు పడ్డాక చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చి, విద్యుత్ దీపాలు అనవసరం అన్నట్లు వెలుగునిస్తాడు. ఒకానొక సమయంలో చంద్రుడు టవర్ చివరి అంచుకొస్తాడు,RRR సినిమాలో రామ్ చరణ్ సీతారామరాజు వేషంలో కనిపించినప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో చంద్రుడు వస్తాడు కదా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది ఆ దృశ్యం.
తరువాత మా ఇంటి కుడి వైపున ఒక పది అడుగుల దూరంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫాతిమా మస్జిద్. స్వర్గానికి ఇలా వెళ్లాలి అని దారి చూపినట్లు ఎత్తైన దాని రెండు మినార్లు నేరుగా ఆకాశం వైపు చూపిస్తుంటాయి. మస్జిద్ మధ్య భాగంలో ఇంకో మినార్ అర్థచంద్రాకారంలో ఉంటుంది అది ఆధ్యాత్మికకు కేంద్ర బిందువుగా, జీవితంలో పెద్ద విషయాల గురించి ఆలోచించండి అన్నట్లు ఉంటుంది. ఈ మూడు మినార్లని ఒకేసారి కలిపి చూసినప్పుడు మధ్యలో ఉన్న మినార్ తలభాగం లాగా మిగిలిన రెండు మినార్లు ప్రార్థన చేయడానికి పైకెత్తిన చేతుల లాగా కనబడతాయి. నా దృష్టిలో మస్జిద్లు కేవలం ప్రార్థన మాత్రమే చేసుకునే భౌతిక భవనాలే కాదు మన దైనందిన జీవితపు గజిబిజి పరుగులలో మనం కోల్పోయిన నిశ్శబ్దాన్ని తిరిగి పొందడానికి ఒకరి నుండి ఒకరు నేర్చుకోవడానికి వీలు కల్పించే ప్రదేశాలు. జాతి మతభేదం లేకుండా శాంతిని గురించి తెలుసుకుని దాన్ని ఆచరించాలనుకునే ప్రతి ఒక్కరూ ఆహ్వానితుడే ఇక్కడ. అసర్ నమాజ్ అయ్యాక ప్రతిరోజు కొన్ని పక్షులు, మినార్ల దగ్గర ఉన్న లౌడ్ స్పీకర్ల దగ్గరికి వచ్చి మాకు తెలిసిన మంచి విషయాలను, మేము ఆకాశంలో ప్రయాణిస్తూ చూసిన వింతలు విశేషాలని వివిధ ప్రదేశాల గురించి చెప్తాం అన్నట్లు తిరుగుతుంటాయి. పాపం వాటికి తెలియదు కదా లౌడ్ స్పీకర్లు నుండి కేవలం అవుట్ ఫుట్ మాత్రమే వస్తుంది ఇన్పుట్ ఇవ్వాలంటే మసీదు లోపల మైక్ సెట్ వాడాలని..
పక్షులంటే గుర్తొచ్చింది …తలని పైకెత్తి చూసినప్పుడు అంతేలేని నీలాకాశం, అప్పటికప్పుడు రూపాన్ని మార్చుకునే తెల్లటి మేఘాలు, అస్తమించే సూర్యకిరణాలతో పోటీ పడుతూ ఆహార అన్వేషణ ముగించుకొని, చీకట్లు అలుముకోకముందే తమ గూళ్ళను చేరుకోవాలని V
ఆకారం కదులుతుందా అన్నట్లు పక్షుల గుంపు కనపడుతుంది. పక్షులు V
ఆకారంలోనే ఎగరడానికి రెండు కారణాలు ఉన్నాయి ,మొదటిది ప్రతి గుంపులో మార్గ నిర్దేశం చేయడానికి నాయకుడు ముందుంటాడు దాని వెనకాల మిగిలిన పక్షులు ఉంటాయి. వీటిలొ పోటీ తత్వం ఉండదు ,సమానత్వం మాత్రమే ఉంటుంది. నాయకుడు అలిసిపోతే దాని స్థానంలో వెనుకన్న పక్షి ముందుకు వస్తుంది. రెండవ కారణం, మిగతా పక్షులతో ఢీకొట్టకుండా, గాలి వేగాన్ని నియంత్రిస్తూ, శక్తిని ఆదా చేస్తూ ప్రయాణించడానికి V ఆకారం కరెక్ట్ గా ఉపయోగపడుతుంది. నిశితంగా గమనిస్తే మనకు తెలియకుండానే చాలా వరకు పక్షుల నుండి ఇన్స్పైర్ అయ్యాం..అవుతూనే ఉన్నాం.. ఉదాహరణకి ఆహారం సంపాదించడానికి తెల్లవారుజాముని అవి తమ గూళ్లని వదిలి వెళ్ళినట్టు మనం కూడా డబ్బులు సంపాదించడానికి మరియు ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని పని చేయడానికి వెళ్తాం.. రక్షణ కోసం అవి ఎలా తమ గూళ్ళని నిర్మించుకుంటాయో మనం కూడా మన రక్షణ కోసం అందమైన ఇల్లు నిర్మించుకుంటాం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి..
కొన్ని రోజుల కిందట Instagram లో ఒక రీల్ చూసాను ,అందులో ఒకతను ఇలా అంటాడు మన చుట్టూ ,రోజు చూస్తూన్న వాటినే కొత్తగా చూడడంలోనే అసలైన మజా ఉంటుంది. అది అలవాటయితే నిరాశ నిస్పృహ మరియు డిప్రెషన్ మన జీవితంలోకి రావడానికి ఆస్కారమే ఉండదని . మొదట్లో ఇదంతా కొంచెం exaggerate అనిపించినా, అలవాటు అయ్యే కొద్దీ మన దృష్టి కోణం తప్పకుండా మారుతుంది.
చివరగా దీనికి టైటిల్ శనివారం నాది అనే మల్లాది గారి నవల నుండి ఇన్స్పైర్ అయ్యి పెట్టాను.
Here are a few of the effortless snaps of nature as seen through the lens of my camera
Khalil Ganiga
Just another programmer.. This blog expresses my views of various technologies and scenarios I have come across in realtime.
Keep watching this space for more updates.