Stories in the corners II
రేయ్ ఎందుకురా వాడు అడిగిందానికి ఆన్సర్ జెప్పి పంపించకుండా మల్ల నీకు తెలిసిందంతా జెప్పడం అవసరమా.. ఇపిరి నాయాల మాదిరి మల్ల నాకు తెలిసింది చెప్పిన అబ్బి అని డిస్క్లైమర్ ఒకటి.
ఇప్పుడేమైతాది లే.. జెప్తే..
ఏమైతాది ఏం కాదనేది కాదు పాయింటు.. ఎవరన్నా ఏమన్నా అడిగితే అడిగిందానికి మాత్రమే సమాధానం ఇయ్యాల.. నీకు తెలిసిందంతా ప్రవచనాలు మాదిరిగా జెప్పకుడదు.
నేనేమీ ప్రవచనాలు చెప్పల్యా .. వాడికి ఉపయోగపడతాదని జెప్పిన.
వాడికి ఉపయోగపడతాదని నీకు తెలుసా..? అదేదో సినిమాలో జెప్తాడు గద అడిగిందానికి మాత్రమే ఆన్సర్ ఇయ్యకుండా సోది చెప్పేటోన్ని సోదిగాడు అంటారని..
ఏ సినిమాలో చెప్పినాడు..?
ఏదో సినిమాలో చెప్పింటారులే.. నాకు గుర్తులేదు
అదే నీకు నాకు తేడా నేను ఏదైనా చెప్తే కరెక్ట్ గా చెప్తా.. నీకు మాదిరి సగం సగం చెప్పను.
సగమో.. ఫుల్లో .. అదంతా నాకు తెలీదు గానీ.. నేను కాంటెక్స్టు గుర్తు పెట్టుకుంటా.. ఇప్పుడు నీకు కరెక్ట్ ఎగ్జాంపుల్ జెప్పాలంతే గద.. అయితే విను.. బ్యాట్ మాన్ సినిమాలో జోకర్ చెప్తాడు కదా నీకు బాగా తెలిసిన పని ఎప్పుడూ ఫ్రీగా చేయకూడదు.
ఇప్పుడేంది చెప్పిందానికి లెక్క తీసుకోవాల్న? లెక్క ఇయ్యమంటే వాడు వింటాడా ఫస్టు?
నేను అప్పటినుండి మొత్తుకునేది అది.. సొల్లు చెప్తున్నావని వాడు వింటా కూచున్యాడు.. లేదంటే మల్ల వస్తాలేన్నా అని అప్పుడే వెళ్లిపోయుంటాడు. సొల్లు చెప్పేటోళ్ళని ఎర్రి నాయాలు అనుకుంటార్రా.
వాడు నన్ను ఎర్రినాయాలనుకుంటే నాకేం లే గాని.. అయినా నా ముందరోచ్చి చెప్తాడా ఏంది?
అట్నా.. సర్లే.. మీ ముందరే నిన్ను ఎర్రి నాయాలు అన్నాడనుకుందాం.. ఏం జేస్తావు అప్పుడు?
(32 పళ్ళు బయటికి తీసి) వాడు కష్టపడకుండా ముందు జాగ్రత్త పడతాడని వాడికి అవసరమైందంతా చెప్పినా నన్ను ఎర్రి నాయాలంటే.. వాడే పెద్ద ఎర్రి నాయాల అనుకుంటా నేను మనసులో..
అది కాదురా.. బజార్లో వాడు నీ గురించి ఎక్కిచో తగ్గిచ్చో చెప్పాడనుకుందాం అప్పుడు నీ ఇమేజె గదా డామేజీ అయ్యేది..
కాదుబ్బి.. ఇప్పుడు వాడు నా గురించి ఏమీ ఆలోచిస్తాడో.. నలుగురులో నా గురించి ఏం చెప్తాడో.. అది విని ఆ నలుగురు నా గురించి ఏమనుకుంటారో.. అది కూడా నేనే ఆలోచించాల్నా? పోరా నాయనా..
ఆలోచించాలిరా.. ఎప్పుడు ఎవరితో ఏం అవసరం పడతాదో నీ గురించి మంచిగా అనుకుంటే పర్లేదు.. ఇంకోలా అనుకుంటేనే కదా సమస్య.. ఇదో ఇట్లాంటి తిక్క తిక్క యవ్వారాలు చేసే నీ అదృష్టాన్ని అరటిపండు అనుకుని తినేస్తున్నావేమో..
పండు తింటేనే కదా అది ఎలా ఉందో తెలిసేది.. తినకుండా అట్నే ఉంచినామనుకో ..చెడిపోతాది. చాన్సు తీసుకోవాలి రా.. మనం చెప్తేనే కదా నలుగురికి మన గురించి ఏదో తెలిసేది. చెప్పకుండా ఉంటే ఎట్టా?
సాల్లే రా నీ ఆర్జీవి డైలాగులు.. నేనేం చెప్పుకోకూడద్నల్య.. ఆ చెప్పడం ఏదో మంచి గురించి చెప్పేలా చేస్తే బాగుంటది కదా.
మంచి చెప్తున్నాడా ఇంకొకటి చెప్తున్నాడా అనేది ఎప్పుడు మన చేతిలో యాడ ఉంటాది.. వాడున్న పరిస్థితుల్లో వాడేలా తీసుకుంటాడు అన్న దాని మీద ఆధారపడి ఉంటాది. గీతలో కృష్ణుడు చెప్పినాడు కదా.. చెప్పడం వరకే మన బాధ్యత విన్నటోడు ఎలా తీసుకుంటాడు అనేది వాడి ఇష్టం అది.
ఏందో నువ్వు.. నాకు అర్థం కావులే..
ఇందులో అర్థంకానికి ఏముంది సామి.. సింపుల్గా చెప్తా చూడు. ఇప్పుడు ఎవరైనా వచ్చి కాకిరేని పల్లెకి దగ్గర దావ ఉంటే చెప్పు బి అన్నారనుకో ఏం చెప్తావ్.? అడిగింది దగ్గర దావ మాత్రమే గదా అని ఇట్నే ఒక మైలు సక్కగా పోయి ఎడమ చేయి వైపు తిరిగి పొలాల్లో పడి పోతే 20 నిమిషాల్లో పోవచ్చు అని చెప్పి ఊరుకుంటావా? లేదా ఇప్పుడు శనగ కట్ట కోసి యాడంటే ఆడ కుప్పలు పోసింటారు బండ్లో పోనీకి ఉండదు.. నడుచుకుంటూ పోదామంటే.. నల్ల మన్ను పెళ్ళల మీద నడిస్తే కాళ్లు బొబ్బలేక్కుతాయి…ఆడాడ తెల్ల తేళ్లు ,జెర్రులు ఉంటాయి ఏమైనా జరిగితే చెప్పడానికి ఫోన్లు కూడా పనిచేయవు.. మధ్యలో నీడకి యాడైన కూర్చుందాం అంటే కంప చెట్లు తప్ప ఏముండవు.. తాగడానికి కోనేరులన్నీ ఎండిపోయి ఉంటాయి అని చెప్తావా?
ఇదంతా ఇణ్యాక.. దారి చెప్పమంటే ఏందేందో సొల్లు చెప్పి భయపెడుతున్నాడు అనుకుంటాడా .. నువ్వు చెప్పిందంతా నిజమే అనుకొని వెనక్కి వెళ్తాడా.. అది కూడా కాదు నేను చూడని తేళ్లు ,జెర్రుల అని ముందుకు వెళ్తాడా.. పోనీ అసలు నువ్వు చెప్పింది అంతా నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఇంకెవరినైనా అడుగుతాడా.. అది కాదంటే నువ్వు వాడికి ఎందుకు అబద్ధం చెప్తావని ఆలోచిస్తాడా.. అనేది మనం ఆలోచించకూడదు.
ఇంకా ఏందంటే.. దారి చెప్పినాను కదా మళ్లీ ఎందుకు వెనక్కి వెళ్తున్నావు అని మనం అడగకూడదు.. లేదా ఇంత చెప్పినా అతను ముందుకే పోయినాడు అనుకో ఎందుకు పోతున్నావు అని మనం అడగకూడదు. ఏమంటావ్?
ఇదంతా చెప్తే నీకేం వస్తదిరా..
బోరుగుల మిక్చర్ అయిపోయింది.. మిరపకాయలు ఇంకా మిగిలినయ్.. ఇంటికి తీసుకొనిపోయి కారం దంచమందామా లేదా ఈన్నే పడేసి పానిపూరి తినడానికి పోదామా?
అర్థమైంది.. దోమల కరస్తుండాయ్.. బండి బీగాలి.. ఇంటికి పోదాం.
Khalil Ganiga
Just another programmer.. This blog expresses my views of various technologies and scenarios I have come across in realtime.
Keep watching this space for more updates.